గ్రౌండ్ రిపోర్ట్: ‘లెనిన్, స్టాలిన్ అందరూ పోవాల్సిందే’

  • 7 మార్చి 2018
బెలోనియాలో లెనిన్ విగ్రహం కూల్చివేత Image copyright Twitter

''లెనిన్, స్టాలిన్, మార్క్స్.. అందరూ పోవాల్సిందే. ఇప్పుడు విగ్రహాలు పోయాయి. రాబోయే రోజుల్లో రోడ్ల పేరు కూడా పోతాయి.''

దక్షిణ త్రిపురలోని బెలోనియా నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ సభ్యుడు అరుణ్ చంద్ర భౌమిక్ మాటలివి.

''వాళ్ల గురించి బోధించే పాఠ్యపుస్తకాలను కూడా మారుస్తాం. వాళ్లు మన సంస్కృతిలో భాగం కాదు'' అన్నారాయన.

ఒకప్పుడు లెనిన్‌గ్రాడ్‌గా పేరొందిన దక్షిణ త్రిపుర ప్రాంతం ఇప్పుడు లెనిన్‌రహిత ప్రాంతంగా మారింది. కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే త్రిపురలో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా లెనిన్ విగ్రహాలను కూలుస్తున్నారు.

బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే జరుగుతున్న పరిణామాలివి.

చిత్రం శీర్షిక నిర్మానుష్యంగా సీపీఎం కార్యాలయం

రెండు దశాబ్దాల పాలన అనంతరం ఓటమి పాలైన కమ్యూనిస్టులు మితవాదులు తమ పార్టీ కార్యాలయాలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసకున్నారని ఆరోపిస్తున్నారు.

మొదట బెలోనియాలోని కాలేజ్ స్క్వేర్‌లో ఉన్న లెనిన్ విగ్రహం కూల్చివేశారు. వామపక్ష నేత బాసుదేబ్ మజుందార్ వరుసగా నాలుగుసార్లు ఇక్కడి నుంచే గెలుపొందారు. ఈసారి ఆయన భౌమిక్ చేతిలో 735 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆదివారం భౌమిక్ విజయోత్సవ వేడుకలలో కొంత మంది లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

సోమవారం సాయంత్రం అగర్తలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్రూంలో మరో లెనిన్ విగ్రహాన్ని కూలదోశారు.

ప్రస్తుతం బెలోనియాలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. ప్రజలెవ్వరూ బైటికి రావడం లేదు. కేవలం కాలేజ్ స్క్వేర్ వద్ద ఒక దుకాణం మాత్రం తెరచి ఉంది.

దాని నిర్వాహకురాలిని సమీపించగా ఆమె తొందరతొందరగా, ''మాకేం తెలీదు. మేమేమీ చూడలేదు'' అన్నారు.

కూల్చేసిన లెనిన్ విగ్రహానికి దగ్గరలోనే పోలీసు బ్యారక్స్, స్థానిక ఎస్పీ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఉన్నాయి.

అయినా కూడా అల్లరి మూక రెచ్చిపోయి లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిందని అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ప్రస్తుతం సంఘటనాస్థలానికి కాస్త దూరంలో ఉన్న సీపీఎం పార్టీ కార్యాలయం తాళం వేసి ఉంది. దాని పరిసరాల్లో కూడా ఎవరూ కనిపించలేదు.

గవర్నర్ తథాగథ రాయ్ చేసిన ఒక ట్వీట్‌తోనే ఈ మొత్తం వివాదం ప్రారంభమైందని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.

సీపీఎంకు చెందిన దీపాంకర్ సేన్.. ప్రస్తుతం కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలంతా బెదిరిపోయి ఉన్నారని తెలిపారు.

Image copyright Tathagata Roy @Twitter
చిత్రం శీర్షిక గవర్నర్ తథాగత రాయ్ ట్వీట్

మేం రోడ్డుపై వెళుతుండగా, బైకుపై వెళ్తున్న కొందరు మా వివరాలు అడిగారు. విగ్రహం కూల్చివేత గురించి ప్రశ్నించినపుడు అమాయకంగా తమకేమీ తెలీదన్నారు.

వాళ్లు వెళ్లిపోయాక అక్కడే ఉన్న దుకాణం యజమానురాలు, విగ్రహాన్ని కూల్చివేస్తున్నపుడు ఆ బైకుపై వెళ్లిన వాళ్లలో కొందరు అక్కడే ఉన్నారని తెలిపారు.

చిత్రం శీర్షిక దక్షిణ త్రిపురలోని బీజేపీ కార్యాలయం

మేం బెలోనియాలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లినపుడు అక్కడంతా హడావుడిగా ఉంది.

కార్యాలయ నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్న శంతను దత్తా, లెనిన్ విగ్రహం కూల్చివేతలో బీజేపీ సభ్యుల హస్తం లేదని తెలిపారు. సీపీఎం కార్యకర్తలే బీజేపీ టీ షర్టులు వేసుకుని, తమను అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేశారని అన్నారు.

బెలోనియా నుంచి కొత్తగా ఎన్నికైన అరుణ్ చంద్ర భౌమిక్, ఇప్పుడు తమ పార్టీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ లాంటి నేతల విగ్రహాలు లేదా బ్రిటిష్ వారితో పోరాడిన యోధుల విగ్రహాలను నెలకొల్పుతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)