అభిప్రాయం: హోదా దారెటు? టీడీపీ పయనమెటు?

  • 7 మార్చి 2018
చంద్రబాబు Image copyright Getty Images

తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించనున్నదనే వదంతులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వ్యాపించాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం నాడు శాసనసభలో మాట్లాడే సందర్భంగా మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మేరకు ప్రకటన చేయవచ్చునని రాజకీయవర్గాలు, పరిశీలకులు కూడా భావించారు.

కానీ సభలో రెండు గంటలకుపైగా ఉద్వేగభరితంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు.

Image copyright Getty Images

దోషం నాది కాదు..

రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయమై తాను ఎంతమాత్రం రాజీ పడటంలేదని, అది తమ 'హక్కు' అని కేంద్రాన్ని మరొకమారు హెచ్చరించి ఊరుకున్నారు.

అదేవిధంగా, ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినా 'అందుకు సమానమైన' ఆర్థిక నిధులు, రాయితీలు ఇవ్వగలమన్న కేంద్రం కనీసం ఆపనైనా చేయటం లేదంటూ గణాంక వివరాలతో సుదీర్ఘమైన జాబితాను చదివి సభ్యులకు వినిపించారు.

దోషమంతా కేంద్రానిదే తప్ప, కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్న తనది కాదని, స్వశక్తితో తానే ఎంతో అభివృద్ధి సాధించానని వివరించారు.

అయితే.. గత కొద్ది రోజులుగా ఇక్కడ అమరావతిలో, అక్కడ దిల్లీలో తెలుగుదేశం పార్టీ వైఖరి నేపథ్యంలో చంద్రబాబు తమతో బుధవారం నాడు తెగతెంపులు చేసుకోవచ్చన్న సూచనలు ఎన్‌డీఏ ప్రభుత్వానికి చేరాయి.

ఒకవేళ చంద్రబాబు అసెంబ్లీలో అటువంటి ప్రకటన నిజంగా చేసినట్లయితే వెంటనే టీడీపీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేయవలసిందిగా ఇక్కడి బీజేపీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లకు దిల్లీ నుంచి ఆదేశాలు అందాయి.

చంద్రబాబు దొరకడం అదృష్టం..!

కానీ ఇటువంటి పరిణామాలేవీ చోటుచేసుకోవన్న సూచనలు.. చంద్రబాబు కన్నా ముందు ప్రసంగించిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాటల్లో కన్పించాయి.

విష్ణుకుమార్ మాట్లాడుతూ..

'చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు లభించడం అదృష్టం. రాష్ట్ర హక్కుల కోసం, అభివృద్ధి కోసం మేము కూడా దిల్లీలో పోరాడుతాం' అన్నారు. దీంతో.. ఇరు పక్షాల మధ్య నెలకొన్న పరిస్థితులు యుద్ధానికి దారితీయబోవడం లేదని అర్థమైంది.

ఇటీవలి రోజుల్లో పరిస్థితులు ఇంతలా వేడెక్కటానికి తగిన కారణాలున్నాయి. ప్రత్యేక హోదా సమస్య మొదటి నుంచి ఉన్నదే. దానిపై కొంత కాలంపాటు టీడీపీ ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం మధ్య ముక్కోణపు వాదనలు తీవ్రంగానే సాగాయి.

అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్యసభలో ' హోదా హామీ' ఇచ్చారు. తాము అధికారానికి వచ్చినట్లయితే సదరు హామీని అమలు చేయగలమని బీజేపీ కూడా ప్రకటించింది. కానీ ఆ హామీ ఎందుకు నెరవేరడంలేదన్నది టీడీపీతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు, సమాజం చేసే వాదన.

హోదా సాధ్యం కాదు కానీ అందుకు పూర్తిగా సమానమైనవన్నీ ఇవ్వగలమని చెప్పి, ఆ పని కూడా ఎందుకు చేయటంలేదన్నది మరొక వాదన. చేస్తూనే ఉన్నామని, మరింత త్వరగా చేయగలమనేది కేంద్రం చెబుతున్న మాట. అందుకు తగిన 'ప్రత్యేక ప్యాకేజీ' ఇవ్వగలమని కేంద్రం అంటున్నది.

Image copyright Akira
చిత్రం శీర్షిక పార్లమెంటు బయట పోతరాజు వేషధారణలో నిరసన తెలుపుతున్న తెదేపా చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆయన ఈ ప్రదర్శన చేపట్టారు.

ఈ వేడి హోదా కోసమా? 2019 ఎన్నికలకోసమా?

వాస్తవానికి ఇక హోదా ఉండదు అన్న వాతావరణంలో అందరూ ప్యాకేజీకి మానసికంగా సిద్ధపడినట్లు ఇటీవల కన్పించింది. కానీ 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఉన్నట్లుండి ప్రకోపించాయి.

వైఎస్సార్ కాంగ్రెస్‌తో ఇతర ప్రతిపక్షాలు, మేధావులు హోదా ప్రస్తావన ఎప్పుడూ చేస్తూనే ఉన్నా, ఇపుడు ఎన్నికలు దగ్గరపడటంతో తమ గొంతును, ఆందోళనలను ఉన్నట్లుండీ పెంచారు.

పవన్ కల్యాణ్ నాయకత్వాన ఏర్పడిన ‘ప్రముఖుల వేదిక’ పెద్దఎత్తున ముందుకు వస్తున్నది. ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి.. హోదా అంశంపై తన పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6వతేదీన రాజీనామా చేయగలరని ప్రకటించారు.

ఈ పరిణామాలు చంద్రబాబుపై రాజకీయంగా ఒత్తిడి పెంచాయి. అదే ప్రభావం బీజేపీపై కూడా పడింది. యథాతథంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కంటే టీడీపీ బలంగా ఉన్నప్పటికీ.. ఆ తేడా మరీ పెద్దది కాదు.

అగ్నికి ఆజ్యం...

అందుకు తగినట్లు టీడీపీ పాలన పట్ల ముఖ్యంగా కింది వర్గాల్లోనూ, రాయలసీమ వంటి ప్రాంతాల్లోనూ అసంతృప్తి పెరుగుతున్నది. ఇటువంటి స్థితిలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ వంటి అంశాలు ఉన్నట్లుండి మళ్లీ పెద్ద సెంటిమెంటుగా మారటం మొదలైంది.

సెంటిమెంట్లకుండే శక్తి గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. అవి.. అగ్నికి ఆజ్యంగా మారగలవు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఈ ప్రమాదాన్ని గ్రహించే ఉండాలి.

అందువల్లనే ఈ అంశాలపై జగన్మోహన్ రెడ్డికి, ఇతర ప్రతిపక్షాలకూ అవకాశం ఇవ్వరాదన్న ఆలోచనతో స్వయంగా హోదా విషయమై అకస్మాత్తుగా తన స్వరాన్ని కూడా పెంచారు.

Image copyright జయరాజు ఎగ్గోని/facebook

పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీయటం, ఇక్కడ టీడీపీ నాయకుల ద్వారా ప్రతిరోజూ కేంద్రంపై ఘాటైన విమర్శలు చేయించటాన్ని వ్యూహంగా పెట్టుకున్నారు.

దీనంతటికీ చివరన టీడీపీ మంత్రులు ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగటంకానీ లేదా ఆ కూటమితో పూర్తిగా తెగతెంపులుకానీ చంద్రబాబు వ్యూహంలో భాగమా? అన్నది ప్రశ్న.

స్వయంగా చంద్రబాబు తమ పార్టీలో, మీడియాతో గత పది రోజులుగా అంటూ వచ్చిన మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి.

తనపై బయటినుంచి ఒత్తిడి ఉన్నందున ఆ ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు తాను కేంద్రంపై ఒత్తిడి సృష్టించాలి. అదే సమయంలో రాజీనామాలు, తెగతెంపుల గురించి తన పార్టీవారి చేత మాట్లాడించాలికానీ తాను స్వయంగా అనకూడదు. రాజీనామాల వల్ల రాష్ట్రానికి అభివృద్ధి రీత్యా నష్టమనే విషయం సీనియర్లకు చెప్పి ఒప్పించాలి.

ఎన్నికల్లోగా కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ సాధించాలి. మొన్నటి కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలు నెరవేరని మాట నిజమే అయినా.. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా తగినన్ని నిధులు ఇవ్వగలమన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీపై నమ్మకం ఉంచి, ఆ ప్రకారం ఒత్తిడి తెచ్చి సాధించుకునే ప్రయత్నం చేయాలి.

ఎందుకంటే రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలుకానీ, రాష్ట్ర ఆర్థిక స్థితికానీ ప్రస్తుతం సున్నితమైన దశలో ఉన్నాయి. ఈవిధంగా చివరి దశ వరకు శాయశక్తులా ప్రయత్నించి, ఎన్నికలు పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత, ఒకవేళ అప్పటికీ ప్రతిపక్షాల ప్రమాదం తగ్గకుండా ఉన్నట్లయితే బీజేపీతో విడిపోవడం గురించి ఆలోచించవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది.

తాము అధికారానికి వచ్చినట్లయితే హోదా ఫైలు పైనే తొలి సంతకం చేయగలమని రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన, కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు చంద్రబాబు కొత్త సాధనంగా మారినట్లు తన అసెంబ్లీ ప్రసంగంలో కన్పిస్తున్నది.

Image copyright Getty Images

మరి.. పొత్తు సంగతేమిటి?

ఒకవేళ బీజేపీకు దూరం అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు? అనే మరో ముఖ్యమైన ప్రశ్న టీడీపీ అధ్యక్షుడిని వేధిస్తుండొచ్చు. 2014లో బీజేపీ పొత్తు, పవన్ కల్యాణ్ మద్దతు లేనట్లయితే టీడీపీ గెలిచి ఉండేది కాదు.

కనుక.. ఈ దూరదృష్టి వలన కూడా చంద్రబాబు బీజేపీతో దూరం కావటంపై తొందరపడి నిర్ణయాలు తీసుకోలేరు.

ఈలోగా జగన్ నుంచికానీ, ఇతరత్రాకానీ రాజకీయంగా చిక్కులు ఎదురైతే వాటిని చాతుర్యంతో మేనేజ్ చేయటం ఎట్లాగన్నది ఆయన ముందున్న ప్రశ్న.

ప్రస్తుతం ఆయన నుంచి, బీజేపీ నుంచి మనం చూస్తున్నది ఈ మేనేజ్‌మెంట్ చాతుర్యం ఎట్లా సాగనున్నదనే..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)