చంద్రబాబు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. జైట్లీ : అసలు ప్రత్యేక హోదా అనేదే లేదు

  • 7 మార్చి 2018
జైట్లీ Image copyright CHANDAN KHANNA

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలో 7 ముఖ్యాంశాలు.

1. ప్రస్తుతం ప్రత్యేక హోదా అనేదే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఉదయం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందని చెప్పగా.. సాయంత్రం జైట్లీ అసలు ప్రత్యేక హోదా అనేదే ఇప్పుడు లేదని స్పష్టం చేశారు.

2. ప్రత్యేక హోదాకన్నా అధిక ప్రయోజనాలను కల్పిస్తామని జైట్లీ అన్నారు. రెవెన్యూ లోటును పూడ్చాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఆందోళనలతో అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

3. ప్రత్యేక హోదా తప్ప.. దానికి సమానంగా కేంద్ర పథకాలకు.. విదేశీ రుణాల చెల్లింపునకు 90-10 నిష్పత్తిలో నిధులు ఇస్తామని జైట్లీ చెప్పారు. దీని ప్రకారం ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఏపీకి 30 శాతం మేర నిధుల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అంతే కాని ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాలు ఏమీ లేవన్నారు.

Image copyright PRAKASH SINGH

4. గతంలో ప్రత్యేక హోదా అనేది ఈశాన్య.. మూడు పర్వత ప్రాంత రాష్ర్టాలకు మాత్రమే ఇచ్చారని జైట్లీ తెలిపారు. వాటికి తగిన రాబడి లేనందు వల్లే అలా చేశామన్నారు. తర్వాత ప్రత్యేక హోదా అనే అంశమే లేదని తేల్చి చెప్పారు.

5. రాజకీయ లాభాలతో నిధులను కేటాయించరని కేంద్రానికి విపరీతంగా నిధులు రావడం లేదనీ జైట్లీ అన్నారు. కేంద్రం ఇప్పుడు ఇచ్చే దానితో పోల్చితే.. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి వచ్చేది తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ర్టాలకు కేంద్ర పథకాలకు 60 శాతం నిధులను కేంద్రం ఇస్తుండగా ఏపీకి దాన్ని 90 శాతానికి పెంచామని తెలిపారు.

6. ఏపీ తగిన వనరులు లేక ఇబ్బంది పడుతుండటం వాస్తవమే కాబట్టి తాము 30 శాతం అదనపు నిధుల లభ్ది చేకూరుస్తున్నామని జైట్లీ చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక కూడా ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదని చెప్పిందన్నారు. కేంద్రానికి ఏపీతో పాటు 29 రాష్ర్టాలూ ముఖ్యమేనని సమానమేనని తెలిపారు.

7. ఏపీ కోసం ఎస్పీవీ వంటి సంస్థలు ఏర్పాటు చేయాలని దానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని జైట్లీ అన్నారు. ఇప్పటికే ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.4 వేల కోట్లు చెల్లించామని మరో 138 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. పోలవరానికి రూ.5వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.

Image copyright MONEY SHARMA

ప్రత్యేక హోదా.. ఆంధ్ర ప్రదేశ్ హక్కు: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బుధవారం నాడు ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వ హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆయన కొన్ని ప్రశ్నలను సంధించారు.

1. 'ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టప్రకారం అందులో పేర్కొన్న ప్రతి హామీనీ నెరవేర్చాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోయింది. 14వ ఆర్థిక సంఘం పేర్కొన్న అవరోధాలను దృష్టిలో ఉంచుకుని ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మేం నిర్ణయించాం. దీన్ని అయిదేళ్ల పాటు అందజేస్తాం' అని అరుణ్ జైట్లీ గతంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాన్ని ఎందుకు అమలు చేయలేదు?

2. 'ఆంధ్ర ప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా రావాలి. దాన్ని మా ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగిస్తుంది. అంటే... మొత్తం పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం' అని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో చెబుతోంది. ఆ హామీ ఎందుకు నెరవేరలేదు?

Image copyright Getty Images

3. కాంగ్రెస్ బిడ్డను బతికించి, తల్లిని చంపేసిందనీ, మేమైతే ఇద్దరినీ బతికించేవాళ్లమనీ నాడు మోదీ అన్నారు. ఆ మాట అన్న మోదీ, విభజన చట్టంలో ఉన్న నియమాలను అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు?

4. ఆంధ్ర ప్రదేశ్‌లో రెండంకెల అభివృద్ధి నమోదైనందునే కేంద్రం డబ్బులివ్వలేదని కొందరంటున్నారు. ఇదెక్కడి వాదన? అంటే మీరు డబ్బులివ్వట్లేదని మేం పనులు చేయడం మానేయాలా?

5. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనేనని ప్రకటిస్తున్నారు. అసలు అలాంటి ప్రకటన చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఆ హామీ మీరెందుకు నెరవేర్చలేకపోతున్నారు?

6. బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించీ ప్రత్యేకంగా మాట్లాడలేదని అన్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైల్వే సబర్బన్ అనో, మరొకటనో పెడతామని ప్రకటించారు. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు?

7. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. వాళ్లకు ట్యాక్స్ ఇన్సెంటివ్‌లను 2027దాకా పొడిగించారు. అవి మాకెందుకు ఇవ్వకూడదు?

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు