ప్రెస్‌రివ్యూ: ‘నన్ను వాడుకుని వదిలేశారు’ - పవన్ కల్యాణ్

  • 8 మార్చి 2018
పవన్ కల్యాణ్ Image copyright JANASENA/FACEBOOK

'2014 ఎన్నికల సమయంలో నన్ను వాడుకుని వదిలేశారని అనుకుంటున్నాను' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఈనాడు పేర్కొంది.

బుధవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘నేను మోదీకి మద్దతు ఇవ్వడం వెనుక కారణాలు ఉన్నాయి. బలమైన వ్యక్తి వచ్చి ఏదైనా చేస్తారని నమ్మాను. నిరుత్సాహానికి గురయ్యాను. భవిష్యత్తులో మోదీకి వ్యతిరేకంగా ఉంటానా? లేదా అనేది జనం అభీష్టం మేరకు ఉంటుంది.

భారత ప్రభుత్వం మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఉంది. భారత ప్రభుత్వం ఇచ్చిన రెండు హామీల్లో ఒకటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నెరవేరిందని, రెండో హామీ 'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా' అమలు కాలేదన్నారు.

భారత ప్రభుత్వం చెప్పిన మాటే అమలు కాకపోతే రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 'మేం చెప్పాం కానీ అమలు చేయం అంటే ఎలా?' అని కేంద్రాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు.

జనసేనకు ప్రజాప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈ నెల 14న జరిగే జనసేవ ఆవిర్భావ సభలో పొత్తులు సహా అన్ని ప్రశ్నలకు జనసేన సమాధానం ఇస్తుందన్నార' ని ఈనాడు తెలిపింది.

Image copyright Sean Gallup/Getty Images

'ముస్లిం కోటా ఇవ్వలేం'

'తెలంగాణలో జనాభా ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్‌ ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింద'ని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

'కేసీఆర్‌ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటవచ్చని, అలాంటి పరిస్థితులేవీ కేసీఆర్‌ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో ఉటంకించ లేదని స్పష్టం చేశారు.

బుధవారం ఉదయం పార్లమెంటు ప్రారంభానికి ముందే ఈ సమాధానాలు సభ్యులకు చేరాయి. ముస్లిం రిజర్వేషన్లకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని గతంలో స్వయంగా సీఎం కేసీయారే ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంటు సాక్షిగా కుదరదని కుండబద్దలు కొట్టడంతో టీఆర్‌ఎస్‌ అగ్రహోదగ్రులయ్యారు.

బుధవారం ఉదయం ఉభయ సభల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందే సభ్యులు అడ్డుపడ్డారు. రిజర్వేషన్లపై అధికారాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలంటూ మూడోరోజూ పార్లమెంటును హోరెత్తించారు.

ప్రజల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత ఉంటుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే స్వేచ్ఛ రాష్ట్రాలకే ఉండాలని డిమాండ్‌ చేశారు. 'ఒకే దేశం.. ఒకే నీతి' అంటూ నినదించారు. లోక్‌సభ జరగనివ్వకుండా స్తంభింపజేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright FACEBOOK/ARUNJAITLY

'తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ నోట్లు దాచుకుంటున్నారు'

'ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు భారీ ఎత్తున కరెన్సీని దాచుకున్నారా? అందుకే ఏటీఎంలలో నోట్ల కొరత ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అవునన్నట్లుగా సమాధానం చెబుతున్నారు'ను అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

'బుధవారం జైట్లీ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ఉండగా.. తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల అక్కడికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయనకు వివరించారు.

దీనికి మంత్రి స్పందిస్తూ.. తాము ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన దానికంటే ఎక్కువ కరెన్సీని సరఫరా చేశామని వివరించారు.

అయినా.. కరెన్సీ కొరత నెలకొనడం ఆశ్చర్యకరమన్నారు. నోట్ల కట్టలను ఇళ్లలో.. లాకర్లలో దాచుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశార'ని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Telangana CMO

'గులాబీసేన వాట్సాప్'

'కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రులు, ఇతర కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్లు తెలిసింది.' అని సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

'కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఏ క్షణమైనా రంగంలోకి దిగే అవకాశముందని, ఏ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడాలని సూచించినట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ ఆరేడు నెలల కింద ఇదే విషయంపై మంత్రులు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్నవారిని హెచ్చరించారని సమాచారం. అయినా ఇద్దరు, ముగ్గురు మంత్రుల వ్యవహారశైలిలో మార్పురాకపోవడంతో ఇటీవల మరోసారి హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి దిగుతున్నాం. కేంద్ర ఆధీనంలో ఐటీ, ఈడీ వంటి కీలకమైన దర్యాప్తు సంస్థలున్నాయి. ఈ కీలకమైన సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా అడ్డంగా దొరికిపోతాం. గతంలో తెలిసో, తెలియకో ఏమైనా జరిగితే దిద్దుకోండి, భవిష్యత్తులో చేయకుండా ఒళ్లు దగ్గరపెట్టుకోండి. తరువాత ఏం జరిగినా నేను కూడా కాపాడుకునే పరిస్థితి ఉండదు అని నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

దీంతో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులంతా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవడానికి జంకుతున్నారు. ఎవరితో, ఏం మాట్లాడితే ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఫోన్‌కాల్స్‌ కాకుండా.. కేవలం వాట్సాప్‌ ద్వారా కాల్స్‌ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా రహస్యంగా చెప్పాల్సిన విషయముంటే వాట్సాప్‌ కాల్‌ చేయాలని సూచిస్తున్నార'ని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)