21వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం: ‘నేను పెడతా, మీరు మద్దతివ్వండి.. లేదా మీరు పెట్టండి, నేను మద్దతిస్తా’.. టీడీపీని ఉద్దేశించి జగన్

 • 8 మార్చి 2018
జగన్ Image copyright ysjagan/facebook

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీడీపీ కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వై.ఎస్. జగన్ మీడియాతో మాట్లాడారు.

ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు:

 • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మా పార్టీ నిర్ణయించింది. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మేం మద్దతిస్తాం.
 • రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలి, రాజీనామాలు చేయాలి. అప్పుడు కేంద్రం దిగొస్తుంది.
 • టీడీపీకి సమయం ఇవ్వడానికే 21వ తేదీన అవిశ్వాసం పెడతాం అంటున్నాం. అంతకంటే ముందు అయినా పెట్టడానికి సిద్ధమే. టీడీపీ మాకు మద్దతివ్వాలి. మనం రాజీనామాలు చేస్తే దేశం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు కేంద్రం దిగిరాక తప్పదు.
 • ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, అదే సంజీవిని కాదు అని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. దీనికి కారణం ఒక్కటే - ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ఇలా చేశారు. ఇది ప్రజల విజయం.
 • అరుణ్ జైట్లీ మొదటి నుంచి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్నట్లుగా చెబుతున్నా ఇన్నాళ్లు స్పందించని చంద్రబాబు ఇప్పుడు మాత్రం రాజీనామాలకు తెరతీశారు.
 • ప్రత్యేక హోదాపై బీజేపీ ప్రభుత్వం మోసం చేసినా ఇంకా ఎన్డీయేలో టీడీపీ ఎందుకు కొనసాగుతుందో చంద్రబాబు చెప్పాలి.
 • రాజకీయాల్లో చిత్తశుద్ధి, విలువలు, విశ్వసనీయత, నిజాయితీ ఉండాలి. చంద్రబాబుకు ఇవేవీ లేవు. పూటకో మాట, రోజుకో మాట మాట్లాడుతున్నారు.
 • టీడీపీ మంత్రులు ముందే రాజీనామాలు చేసుంటే ప్రత్యేక హోదా వచ్చేది. చివరి బడ్జెట్ కూడా వచ్చాక ఇప్పుడు చేయడం వల్ల ఉపయోగం ఏముంది?
 • కేంద్రం వైఖరి సరిగా లేదు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే చెప్పారు. ఆ రోజు రాష్ట్రం విడిపోకుండా పోరాడింది మా పార్టీనే.
 • ప్రత్యేక హోదా కోసం నేను నిరహార దీక్ష చేస్తే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దాన్ని భగ్నం చేయించింది. బంద్ చేస్తే దాన్ని సరిగ్గా జరగనీయలేదు. ఇప్పుడు వాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చెబుతున్నారు.
 • 14 ఆర్థిక సంఘం సిఫార్సులకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదు. మొదటి నుంచి నేను ఇది చెబుతూనే ఉన్నా.
 • ప్రత్యేక హోదాకు ఏ పార్టీ మద్దతిచ్చినా వారితో కలిసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ అయినా అభ్యంతరం లేదు. రాష్ట్రానికి మేలు జరిగితే చాలు.
 • అవసరమైతే పార్లమెంటు సమావేశాల చివరి రోజున అంతా రాజీనామాలు చేద్దాం. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెరిగి ఏం చేయాలో అది జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)