ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి?

  • 8 మార్చి 2018
ఆంధ్రప్రదేశ్ Image copyright AP Special Status Campaign

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోవడాన్ని నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కూడా ప్రత్యేక హోదా కల్పించకపోతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని తెలిపింది.

రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేక హోదా కోసం కొన్నాళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికన ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారు? ఈ హోదా వల్ల రాష్ట్రానికి అదనంగా వచ్చే ప్రయోజనాలేంటి?

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అంటే 13 జిల్లాలతో కూడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రత్యేక హోదాను అమలు పర్చడం లేదు.

Image copyright http://planningcommission.nic.in/

ప్రత్యేక హోదా ఎప్పుడు మొదలైంది?

5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు.

అసోం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ప్రారంభంలో ఈ ప్రత్యేక హోదా ఉండేది.

తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడం, అక్కడి పరిస్థితులు కారణంగా మరో ఎనిమిది రాష్ట్రాలకు కూడా హోదా కల్పించారు.

ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా ఉంది.

దేశంలో ప్రస్తుతానికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

ఇటీవల ఏపీతో పాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది.

ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటి?

ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  • పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు సరిగాలేని ప్రాంతాలై ఉండాలి.
  • జనసాంద్రత తక్కువగా ఉండాలి, గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండాలి.
  • సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలై ఉండాలి.
  • ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతమై ఉండాలి.
  • విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలై ఉండాలి.

చంద్రబాబు నాయుడు: ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతాం.. ఇది తొలి అడుగు!!

అభిప్రాయం: హోదా దారెటు? టీడీపీ పయనమెటు?

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారు?

ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ), కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు.

అయితే, ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్‌ను ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకంగా మారింది.

ప్రయోజనాలు ఏంటీ?

  • ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు.
  • కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది.
  • పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలిస్తారు. ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం కూడా చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)