‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’

  • 8 మార్చి 2018
కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు Image copyright drksrinivas.bjp/PMRBJP/facebook

కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చేస్తామని బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో దిల్లీ, అమరావతిలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాసేపట్లో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, రాజీనామాలు సమర్పిస్తామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

మంత్రి పదవిలో ఉన్నా, లేకున్నా ప్రత్యేక హోదా కోసం పోరు కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక హక్కు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్న సుజనా.. హోదా అనేది ఏపీ ప్రజల హక్కు అని తెలిపారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. బీజేపీ తమను రాజీనామాలు ఇవ్వక తప్పని పరిస్థితిలోకి నెట్టేసిందని సుజనా తెలిపారు.

ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామా

అటు టీడీపీ నిర్ణయానికి ప్రతిస్పందనగా ఏపీలో కూడా బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు.

రాజీనామాలు సమర్పించిన అనంతరం కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావులు అసెంబ్లీలో మాట్లాడారు. వారి ప్రసంగాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బదులిచ్చారు.

కేంద్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం మంత్రివర్గానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు కామినేని శ్రీనివాసరావు తెలిపారు. జరుగుతున్న పరిణామాలు బాధాకరమని కామినేని అన్నారు.

తాను బీజేపీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి వెంకయ్య నాయుడే కారణమన్నారు.

అసెంబ్లీలో కామినేని ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ .. చంద్రబాబులా పని చేసే సీఎంను ఎక్కడా చూడలేదని అన్నారు.

మంత్రిగా తనకు సీఎం చంద్రబాబు ఎంతగానో సహకరించారని కొనియాడారు.

రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. పదవికి రాజీనామా చేస్తున్నందుకు బాధగా లేదని తెలిపారు.

రాజీనామా చేసిన మరో మంత్రి పైడికొండలమాణిక్యాలరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్రం రాష్ట్రానికి ఎంతో సాయం చేసిందన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న బీజేపీని దోషిగా నిలబెట్టడం తగదన్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపటానికి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవను మరని ఆయన్ను ఏపీ ద్రోహిగా భావించటం సరికాదన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం తప్పని, రాష్ట్ర విభజన వల్లనే ఏపీ అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమంలాగే.. ఇప్పుడు ప్రత్యేక హోదా వ్యవహారం కూడా జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి లబ్ధి జరిగినట్లే, ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీకి బీజేపీ శత్రువు కాదని, మిత్రుడని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీని, నరేంద్ర మోదీని అర్థం చేసుకుంటారని ఆకాంక్షించారు.

Image copyright AndhraPradeshCM/facebook

‘నావేమైనా గొంతెమ్మ కోర్కెలా?’

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజీనామా చేసిన మంత్రులను అభినందించారు.

రాష్ట్రానికి న్యాయం జరగాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

కాంగ్రెస్ చేసిన పనే ఇప్పుడు బీజేపీ చేయడం తగదని అన్నారు. దీని వల్ల జాతీయ పార్టీలపై ప్రజలపై నమ్మకం పోతోందని బాబు తెలిపారు.

ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఐదేళ్లవుతున్నా చేస్తానన్న సాయం చేయకపోతే.. తామెప్పుడు ఖర్చు చేయాలని ప్రశ్నించారు.

కామినేని, మాణిక్యాలరావు సమర్థంగా పదవులను నిర్వహించారని కొనియాడారు.

రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఇకపై కూడా వారు కృషి చేయాలని బాబు కోరారు.

తాను అడుగుతున్నవి ఏమైనా గొంతెమ్మ కోర్కెలా? అని ప్రశ్నించారు. జాతి ప్రయోజనాల కోసమే తాను పని చేస్తున్నానన్నారు.

ప్రత్యేక హోదాలో ఇతర రాష్ట్రాలకు ఏమైతే ఇస్తున్నారో అవన్నీ ఇవ్వాలని కోరానన్నారు. ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే.. ఐదో ఏడు కూడా హోదా ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

పార్టీ సిద్ధాంతాలు మార్చుకోమని తాను చెప్పబోనని, అయితే రాష్ట్రానికి మేలు చేసేలా వ్యవహరించాలని, లేదంటే కాంగ్రెస్‌లాగే అవుతుందన్నారు.

ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)