హోదా కోసమా? మైలేజీ కోసమా? ఏం జరుగుతోంది?

  • 8 మార్చి 2018
Image copyright AndhraPradeshCM/facebook

''ప్రధాని కార్యాలయం చుట్టూ పదే పదే తిరగడానికి వారికేం పని? అలాంటి వారి గురించి నేనేం మాట్లాడతా? మేమంటే మిత్రపక్షం. తిరిగినా అర్థం ఉంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏమిటి?'' - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

''కేంద్రం మోసం చేసినా ఎన్‌డీఏలో టీడీపీ ఎందుకు కొనసాగుతోంది? రాజీనామాలు చేయాలనుకున్నవారు దిల్లీ పెద్దలతో మాట్లాడటం ఎందుకు? చంద్రబాబు తీరుతోనే ఏపీకి హోదా దక్కలేదు.'' - ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి

జాతీయ స్థాయిలో తాము భాగస్వామిగా ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే క్రమంలో.. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మొదటివి.

చంద్రబాబు ప్రకటన మీద స్పందిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆక్షేపణ రెండోది.

Image copyright YS Jaganmohan Reddy/Facebook

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అమాంతంగా వేడెక్కాయి. నాలుగేళ్ల కిందట విభజనతో మిగిలిన రాష్ట్రానికి 'ప్రత్యేక హోదా సాధించటం' అనే అంశం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు.. అన్ని రాజకీయ పార్టీలూ ఈ 'హోదా పోరాటం'లో తలమునకలయ్యాయి.

నిజానికి ఈ పార్టీల పోరాటం హోదా కోసమా? లేకపోతే 'హోదా పోరాటంలో మేమే చాంపియన్లం' అని జనంలో మైలేజీ సంపాదించుకోవటం కోసమా? ఈ పార్టీలు కేంద్రంతో పోరాటం చేస్తున్నాయా? పైచేయి కోసం కొట్లాడుకుంటున్నాయా?

నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరులనే కాదు.. ఇద్దరు ముఖ్య నాయకుల తాజా వ్యాఖ్యలను చూసినా.. వారి పోరాటం మైలేజీ కోసమేనని, ఆ పోరాటం పరస్పరమేనని అర్థమవుతుందని పలువురు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Image copyright Getty Images/FB

నాలుగేళ్ల కిందటా ఇదే సీన్..!

వాస్తవానికి.. నాలుగేళ్ల కిందట రాష్ట్ర విభజన ప్రక్రియ సమయంలో జరిగిన నాటకీయ రాజకీయ పరిణామాలే.. ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ నిట్టనిలువుగా చీలిపోయాయి.

నాటి అధికార కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు తెలంగాణ - సీమాంధ్ర ఎంపీలు విడిపోయారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా ఆ ప్రాంత ఎంపీలు.. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులోనే ఆందోళనకు దిగారు. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

‘‘ఏపీ రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణ నాయకులు, పార్టీల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలూ కలిసి ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్లాయి. టీఆర్ఎస్ ప్రధాన పాత్ర పోషించినా అన్ని పార్టీలూ కలిసి రాష్ట్రాన్ని సాధించుకోగలిగాయి. కానీ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన పార్టీలది ఎవరి దోవ వాళ్లదే. ఎవరి కుంపటి వాళ్లదే. ఎవరి స్వరం వారిదే. ఎవరి ఆందోళన వారిదే. ఒకరకంగా చెప్పాలంటే ఒకళ్లంటే ఒకరికి పడని ప్రత్యేక పరిస్థితి అక్కడుంది’’ అని సీనియర్ పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తెలంగాణ ఉద్యమంలో భాగంగా కళా ప్రదర్శనలు

‘‘ఆ సమయంలో అన్ని పార్టీల సీమాంధ్ర ఎంపీలూ విడివిడిగానే ఆందోళనకు దిగారు. విభజనకు కారణం మీరంటే మీరంటూ టీడీపీ, వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. విభజన అనివార్యమని తేలిపోయినా.. సమైక్య ఉద్యమానికి తామే చాంపియన్లమని చాటుకోవటానికే ప్రాధాన్యమిచ్చాయి తప్పితే విభజన విధివిధానాలను ప్రభావితం చేయటంలో కానీ, విభజన చట్టంలో చేర్చాల్సిన అంశాలను ఖరారు చేయటంలో కానీ క్రియాశీల పాత్ర పోషించలేదు’’ అని నాటి పరిణామాలపై ఒక సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషించారు.

కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లును ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీజేపీ దానికి మద్దతు తెలిపింది. ఆ క్రమంలో విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'ప్రత్యేక సహాయం' విషయంలో బీజేపీ కొంత ప్రభావితం చేసి హామీలు ఇచ్చేలా చేసింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొనగా.. దానిని పదేళ్లు చేయాలని నాటి బీజేపీ ఎంపీ ఎం.వెంకయ్యనాయుడు సభలోనే డిమాండ్ చేశారు.

రాజకీయ వ్యూహంగా హోదా సెంటిమెంటు

అనంతరం జరిగిన పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా తుడిచిపెట్టుకుపోవటం.. టీడీపీ మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి రాగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కొంత లాభపడటం.. వైసీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించటం తెలిసిందే.

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రాగా నరేంద్రమోదీ సర్కారులో టీడీపీ కూడా భాగస్వామిగా చేరింది. అనతికాలంలోనే.. విభజన హామీలను అమలు చేసేలా చేయటంలో టీడీపీ విఫలమవుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ దాడి మొదలుపెట్టింది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు రాజీ పడ్డారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించటం మొదలుపెట్టింది.

‘‘ప్రత్యేక హోదా' అనేది కీలకమైన రాజకీయ అంశంగా కేంద్ర స్థానంలో నిలబెట్టటంలో ప్రజల 'సెంటిమెంటు'ను దానికి అనుగుణంగా బలపడేలా చేయటంలో వ్యూహాత్మకంగా సఫలమైంది వైసీపీ. అయితే.. ఈ క్రమంలో కేంద్రం మీద ఒత్తిడి పెరిగేలా ప్రజాందోళనలను రూపొందించటం కన్నా.. కేంద్రం నుంచి సాధించటంలో విఫలమయిందంటూ టీడీపీ మీద పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చింది. హోదా ఇవ్వకపోతే మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని, ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు బయటకు రావాలని జగన్ పదే పదే డిమాండ్ చేయటం అందులో భాగమే’’ అని వైసీపీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడొకరు పేర్కొన్నారు.

మరోవైపు టీడీపీ సైతం తను భాగస్వామిగా ఉన్న మోదీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హోదా సాధించే విషయంలో బలంగా ఒత్తిడి తేలేకపోయింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం అంటే.. ప్రత్యేక ప్యాకేజీకైనా సరే అని అంగీకరించింది. అలాగే.. ఎన్‌డీఏ నుంచి తాము బయటికి వస్తే వైసీపీ ఆ కూటమిలో చేరాలని తహతహలాడుతోందని ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో 'ఓటుకు నోటు కేసు'కు భయపడి మోదీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకున్నారని జగన్ ఆరోపిస్తుంటే.. ఆస్తుల కేసులో జైలుకు వెళ్లకుండా ఉండటానికి మోదీకి జగన్ సరెండర్ అయ్యారని చంద్రబాబు ప్రత్యారోపణ చేస్తున్నారు.

Image copyright drksrinivas.bjp/tdp.ncbn.official/PMRBJP/facebook

విడివిడిగా పోరాటం.. కేంద్రంతో మాత్రం కాదు.. !

టీడీపీ, వైసీపీలు ప్రజల దృష్టిలో 'చాంపియన్ ఆఫ్ ద కాజ్' అనే హోదా కోసం పరస్పరం పోరాడుతున్నాయి కానీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటున్న ఉమ్మడి లక్ష్య సాధన కోసం.. విడివిడిగా అయినా కేంద్రంతో పోరాడిన దాఖలాలు ఎక్కడా లేవు. పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఈ రెండు ప్రధాన పార్టీలూ వేటికవే 'హోదా డిమాండ్'తో నిరసనలకు దిగటం ప్రహసనంగా మారిందని విమర్శలు ఉన్నాయి.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలకు ఉనికి లేకపోవటం, ఉన్నవి రెండు కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు కావటం దీనికి కారణం. తమిళనాడులోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కానీ వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా దిల్లీ వెళ్లి సాధించుకొచ్చిన సందర్భాలు గతంలో చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ముందు స్వప్రయోజనాలు, తర్వాత రాజకీయ ప్రయోజనాలు, ఆపైన సమయం మిగిలితే రాష్ట్ర ప్రయోజనాలకు వెచ్చించే పార్టీలే మనకు కనిపిస్తున్నాయి’’ అని భండారు శ్రీనివాసరావు విశ్లేషించారు.

‘‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు.. రాజకీయ పార్టీలు తమలో తామూ పోరాడతాయి. కేంద్రంతో కూడా పోరాడతాయి. ఈ రెండూ పరస్పర విరుద్ధమేం కాదు. అయితే.. రెండు పార్టీలకున్న సమస్య ఏమిటంటే.. ఎన్‌డీఏతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది. బీజేపీతో తమకు సంబంధం లేదని వైసీపీ ఇప్పటికీ చెప్పలేకపోతోంది’’ అని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పేర్కొన్నారు.

‘‘ఈ పార్టీలు జాతీయ రాజకీయాల్లో ఒకవైపు తమకున్న అవకాశాలని.. ఏ పార్టీతో కలిస్తే ఎంత పర్సెంటేజీ ఓటింగ్ వస్తుంది అనే జమాలెక్కలు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాయి తప్ప.. ఆ జమాలెక్కలు లేకుండా మాట్లాడే పరిస్థితి రాజకీయ పార్టీలకు లేదు. ఎందుకంటే చివరికి ఏదైనా ఎన్నికలకు ఉపయోగపడాలి. ఏ వైఖరి తీసుకుంటే ఎన్నికలకు ఉపయోగపడుతుందనే జమా లెక్కలు వేసుకుంటూనే వాళ్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు పరస్పరం దూషించుకుంటూ కూడా కేంద్రంతో పోరాడటానికి ముందుకు రావాలి’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.

Image copyright Twitter

జనసేన, కాంగ్రెస్, వామపక్షాలదీ వేరే పోరే...

ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి. బీజేపీ, టీడీపీలకు మద్దతు తెలిపిన పవన్‌కళ్యాణ్.. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ఈ అంశాలపై మేధావులతో వేదికను ఏర్పాటు చేసి.. కేంద్రం ఏమిచ్చింది? ఎంతిచ్చింది? అనే లెక్కలు వేస్తూ.. ప్రకటనలు చేస్తూ.. తానూ 'ప్రత్యేక హోదా' ఉద్యమంలో 'చాంపియన్'నే అని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది.

ఇక.. దేశమంతటా వేగంగా విస్తరిస్తున్న బీజేపీ కూడా దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవటం మీద దృష్టి పెట్టింది. అయితే.. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి ఉద్ఘాటించింది. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రాష్ట్రానికి అందించాల్సిన సాయం అందిస్తున్నామంటూ రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో అవే డిమాండ్లు బలపడతాయని.. ఆయా రాష్ట్రాల్లో తనకు రాజకీయ ఇబ్బందులు వస్తాయని.. అందువల్ల హోదా జోలికి వెళ్లరాదని ఆ పార్టీ ఆలోచనగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు తమకు రాజకీయంగా ఒరిగే లాభం కానీ జరిగే నష్టం కానీ పెద్దగా లేదనేది వారి భావన’’ అని భండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో టీడీపీకి తమతో పొత్తు అవసరం ఉంటుందని.. ఒకవేళ టీడీపీ వైదొలగినా మరొక పార్టీ తమతో చేరటానికి సిద్ధంగా ఉందనే ధీమా బీజేపీలో కనిపిస్తోందనీ పరిశీలకులు చెప్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే హోదా డిమాండ్‌తో 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష' పేరుతో దిల్లీలో ధర్నా చేస్తోంది. రాహుల్‌గాంధీ ఆ ధర్నాలో పాల్గొని ''మేం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా'' ఇస్తాం అని ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రకటించారు. అదే సమయంలో వామపక్ష పార్టీలు కూడా హోదా డిమాండ్‌తో వేరుగా దిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

అసలు లక్ష్యం 'రాజకీయ మైలేజీ'యే..!

మొత్తంమీద.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ 'ప్రత్యేక హోదా' డిమాండ్‌తో విడివిడిగా చేస్తున్న పోరాటాల అసలు లక్ష్యం జనం సెంటిమెంట్‌ను తమవైపు ఆకర్షించటానికి తద్వారా 'రాజకీయ మైలేజీ' పొందటానికి పరస్పరం చేస్తున్న పోరాటమేననేది పలువురు రాజకీయ విశ్లేషకుల మాట.

చంద్రబాబు తాము ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు బుధవారం రాత్రి చేసిన ప్రకటనలో.. 'ప్రత్యేక హోదా' విషయంలో ప్రజల్లో ఉన్న సెంటిమెంటును గౌరవిస్తున్నామని చెప్పటంతో పాటు.. జైట్లీ వ్యాఖ్యలు 'మనలను కించపరిచేలా.. అవమానపరిచేలా' ఉన్నాయని పేర్కొనటం ద్వారా.. ప్రజల్లో 'సెంటుమెంటును' తనకు అనుకూలంగానూ, బీజేపీకి వ్యతిరేకంగానూ మళ్లించటానికి ప్రయత్నించారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్రంలో చేరామని.. ఫలితం లేకపోవటంతో బయటకు వస్తున్నామని చెప్పటం ద్వారా తామూ హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు చాటేందుకు ప్రయత్నించారని వారు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ప్రకటన మీద జగన్‌మోహన్‌రెడ్డి గురువారం స్పందిస్తూ.. 'హోదా సాధ్యం కాదని జైట్లీ చెప్పిన విషయం కొత్తదేమీ కాదు. గతంలో ఇదే మాట అన్నపుడు చంద్రబాబు దానికి ఒప్పుకుని యూటర్న్ తీసుకున్నారు. అప్పుడే రాజీనామా చేసివుంటే ఫలితం ఉండేది' అని విమర్శలు ఎక్కుపెట్టారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారన్న 'మైలేజీ' చంద్రబాబుకు లభించకుండా చేయటానికి ప్రయత్నించారని పరిశీలకులు అంటున్నారు. అలాగే.. పార్లమెంటు సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని, ప్రభుత్వంపై తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలని సూచించటం ద్వారా చంద్రబాబును మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారనేది నిపుణుల అంచనా.

అయితే.. ‘‘పొలిటికల్ మైలేజీ కోసమే చేసినా తప్పేమీ లేదు. రాజకీయ అవసరాల కోసం చేశాయా లేదా అనేదానికన్నా.. చేసింది సరైనదా కాదా అనేది ముఖ్యం’’ అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్టంలో ఉన్నవేవీ అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు రాజకీయ అవసరాలు లేవు కదా అని కేంద్రం వివక్ష చూపుతోంది. ఎన్‌డీఏలో చేరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కేంద్రం ఏ అంశంలోనూ సహకరించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం నుంచి బయటకు రావటం మినహా వేరే మార్గం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

అందరూ కలిసి పోరాడితేనే ప్రయోజనం...

‘‘సమస్య ఏందంటే టీడీపీ ఇంతకాలం బీజేపీతో కలిసివుంది కనుక విశ్వసనీయత లేకుండా పోయింది. ఇప్పుడు విడిపోయారు కనుక వాళ్లు నిర్ద్వంద్వంగా నిస్సంకోచంగా కేంద్రం మీద పోరాడాలి. ఇప్పుడు వైసీపీ చెప్పాలి.. చంద్రబాబును విమర్శిస్తారు తప్ప వాళ్లు మోదీని విమర్శించరు. ఇప్పుడు చంద్రబాబు బయటకు వస్తే నాలుగేళ్లలో ఏం చేశావ్? అంటున్నారు. మరి.. రెండేళ్ల ముందే బయటకొస్తే అప్పుడే వచ్చావా? చివరి వరకూ వెంటపడి తెచ్చుకోవాలి కదా అంటారు? ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చారు. ఇప్పుడు వైసీపీ కూడా బీజేపీతో పోరాడాలి. అన్ని పార్టీలూ కలిసి కనుక కేంద్రంతో పోరాడితే ఏమైనా ఫలితం ఉంటుంది. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకే వేదిక మీదకు వచ్చి తెలంగాణ కోసం పోరాడటాన్ని మనం చూశాం’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో ఉంది. చంద్రబాబుదే బాధ్యత. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు కాబట్టి.. ఇప్పటికైనా.. నాయకత్వం ఎవరిది, ప్రయోజనం ఎవరికి, ఫలితం ఎవరికి అనేది పక్కన పెట్టి అన్ని పార్టీలనూ, ప్రజాసంఘాలను కలగలుపుకుని దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి’’ అని భండారు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

‘‘అందరూ ప్రత్యేక హోదా కావాలనే కోరుతున్నారు. అటువంటపుడు ఎవరి గొంతు వారు వేరుగా కాకుండా.. అందరూ కలిసి ఒకే గొంతుతో నినదిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాకాకపోతే మాత్రం.. రాబోయే సంవత్సరంలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ భావోద్వేగాలను అన్ని రాజకీయ పార్టీలూ రెచ్చగొట్టాయని ప్రజలు అనుకునే ప్రమాదముందనేది వారు గుర్తుంచుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాపై ప్రత్యేక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవికూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు