ప్రత్యేక హోదా: తొమ్మిది మలుపులు

నరేంద్ర మోదీ

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యేక హోదా మాటను చాలామంది మొదటి సారిగా విన్నారు.

‘రాష్ట్రం విడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీకు ప్రత్యేక హోదా ఇస్తాం’ అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యేక హోదా తమ పాలిట ఓ సంజీవనిలా సామాన్యులు భావించారు.

అలా పార్లమెంట్‌లో మొదలైన 'ప్రత్యేక హోదా' అంశంలో ఎన్నో వివాదాలు, మరెన్నో మలుపులు.

1) ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు : మన్మోహన్ సింగ్

20-02-2014: ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్ర విభజన గురించి రాజ్యసభలో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ‘13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయంగా 5 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఈ హోదా దోహదపడుతుంది’ అని మన్మోహన్ అన్నారు.

కాదు కాదు.. పదేళ్లు కావాలి : వెంకయ్య నాయుడు

ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన తర్వాత.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5సంవత్సరాలపాటు ఇస్తే ప్రయోజనం ఉండదని రాజ్యసభలో వెంకయ్య నాయుడు అన్నారు.

ప్రత్యేక హోదా ప్రయోజనాలతో 5 సంవత్సరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఉత్పత్తి ప్రారంభించడం కష్టమవుతుందని.. కాబట్టి, కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు.

2) వెంకయ్య చెప్పిందే నేనూ చెబుతున్నా : మోదీ

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నరేంద్ర మోదీ ఏప్రిల్ 30, 2014న తిరుపతికి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.

సీమాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రణాళిక తన మస్తిష్కంలో సిద్ధంగా ఉందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే బాధ్యత తమదేనని మోదీ అన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు చేసిన డిమాండ్లను మరోసారి ప్రస్తావించడానికే తాను తిరుపతి వచ్చినట్లు మోదీ నొక్కి చెప్పారు.

3) హోదా కుదరదు.. ప్యాకేజీ ఇస్తాం : జైట్లీ

2016 సెప్టెంబర్‌ 7 అర్ధరాత్రి నార్త్‌బ్లాక్‌లో విలేకరుల సమావేశం పెట్టి.. రాష్ట్రానికి హోదా ఇవ్వడం కుదరదని, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జైట్లీ వివరించారు.

2014 ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ప్రకటన అనంతరం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వెంకయ్య నాయుడు, తాను.. రాజ్యసభలో మాట్లాడిన మాట వాస్తవమే అయినా.. ఈశాన్య రాష్ట్రాలకు, పర్వత ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వాలని 14వ ఆర్థికసంఘం చెప్పడంతో రాష్ట్రానికి ఆ హోదా ఇవ్వలేకపోతున్నామని జైట్లీ వివరించారు.

అయితే.. ప్రత్యేక హోదాకు సమానంగానే 5 సంవత్సరాలపాటు ఆర్థిక సాయం ఉంటుందని జైట్లీ తెలిపారు.

4) సరే.. కానీ ఆ ప్యాకేజీకి చట్టబద్దత ఉండాలి : చంద్రబాబు

సాంకేతిక కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని జైట్లీ ప్రకటన పట్ల చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు.

ప్రత్యేక హోదా ఇస్తే సంతోషమని, అది కుదరని పక్షంలో ప్యాకేజీ ఇవ్వడం కూడా మంచిదేనని చంద్రబాబు అన్నారు. ప్యాకేజీని నిరాకరిస్తే నష్టపోతామని ఆయన అన్నారు.

అయితే.. హోదా స్థానంలో ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ విషయంపై స్పష్టత ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చేందేవరకూ చేయూతనివ్వాలని కోరానని, ఆ చేయూత ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

అయితే.. కేంద్రం ఇచ్చే ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

5) ప్యాకేజీ స్వాగతించడానికి చంద్రబాబు ఎవరు?

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించడం వైఎస్సార్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

ప్రత్యేక హోదా ఇవ్వరన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రుల చేత రాజీనామా చేయించాల్సిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ముఖ్యంగా ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు భయపడుతున్నారని జగన్ విమర్శించారు.

ఆ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ, వెంటనే చంద్రబాబు రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు వైఖరికి నిరసనగా.. వైకాపా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

6) హోదాకు ఏదీ సాటి రాదు : పవన్

పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.

ఓసారి ప్రత్యేక హోదా అని, మరోసారి ప్యాకేజీ అని ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని పవన్ అన్నారు. హోదాకు ప్యాకేజీ భర్తీ చేస్తుందని ఒకసారి చెప్పి.. ఇప్పుడు ఆ ప్యాకేజీ కూడా రాలేదంటూ మాట్లాడటం సరికాదని పవన్ అన్నారు.

కొందరు సభ్యులతో జేఎఫ్ఎఫ్‌సి (సంయుక్త నిజనిర్ధరణ కమిటీ) ఏర్పాటు చేసి, విభజన హామీలపై ఓ నివేదికను తయారు చేశారు. ప్రత్యేక హోదాకు ఏ ప్యాకేజీ సాటి రాదని పవన్ అన్నారు.

7) కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి

2018 కేంద్ర బడ్టెట్‌పై టీడీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు సంవత్సరాలవుతున్నా, కేటాయింపుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదని టీడీపీ తెలిపింది.

2018-19 బడ్జెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర వైఖరి పట్ల వ్యతిరేక పవనాలు వీచాయి. ఒక వైపు హోదా విషయంలో ప్రతిపక్షం, పవన్ కల్యాణ్ వేగాన్ని పెంచడం, మరోవైపున కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక హోదాపై టీడీపీ కాస్త దూకుడు పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

8) హోదా.. అస్సలు కదుదరదు : జైట్లీ

2018 మార్చి 7వ తేదీన అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేక హోదా అసంభవం అని తేల్చారు.

ప్రత్యేక హోదా అన్నది సెంటిమెంట్‌గా మారిందని, సెంటిమెంటు వనరుల పరిమాణాన్ని పెంచలేదని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని జైట్లీ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖ

9) కేంద్ర మంత్రుల రాజీనామా

‘‘కేంద్రం నుంచి వైదొలుగుతున్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులను రాజీనామా చేయమని చెప్పాం. కేంద్రంలో మా మంత్రులు ఉండరు. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి మేం వైదొలుగుతున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ముగిశాక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ఇద్దరు మంత్రులను రాజీనామా చేయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సెంటిమెంటుతో ఫండ్స్ రావు అని జైట్లీ చెప్పడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

రాజీనామాలు చేయించాలన్న నిర్ణయం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. మోదీ అందుబాటులోకి రాలేదు.

8వ తేదీన టీడీపీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఇద్దరూ తమ రాజీనామాలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు.

ఆ తర్వాత ప్రధాని, చంద్రబాబు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. మోదీతో ఫోన్ సంభాషణ ముగిశాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)