BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’

  • 11 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’

తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ. లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి భారత విజయాన్ని సగర్వంగా ఆస్వాదించినా, ఆస్ట్రేలియాకే స్లెడ్జింగ్ రుచి చూపించినా.. అది ఈ 'బెంగాల్ టైగర్‌'కే చెల్లింది.

టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లకు అవకాశాలిచ్చి భారత్ క్రికెట్‌ చరిత్రలో 'దాదా'గా స్థిరపడిపోయిన సౌరవ్.. ఆటగాడిగా, సారథిగా తన అనుభవాలు, ఆలోచనలు, వివాదాలు, విజయాలు, జ్ఞాపకాలను తన తాజా పుస్తకం 'ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌'లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా గంగూలీ బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే‌తో మాట్లాడారు.

దూకుడైన సారథ్యంతో సౌరవ్ గంగూలీ భారత్ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. తన కెప్టెన్సీలో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ.

క్లిష్ట పరిస్థితుల్లో 'దాదా' జట్టు పగ్గాలు చేట్టారు. అతని కాలంలోనే అనేక వివాదాలు, విజయాలు భారత్ క్రికెట్‌ను చుట్టుముట్టాయి. సౌరవ్‌పై పొగడ్తల వర్షం కురిసింది, విమర్శల బాణాలూ తగిలాయి.

అయితే, తన తాజా పుస్తకంలో సౌరవ్ ఈ వివాదాల జోలికి పోలేదు.

క్రికెట్‌పై దాదాకు ఉన్న అభిమానం, అతని జీవితంతో ఆట ఎలా పెనవేసుకుపోయిందో తెలుసుకోవాలనుకునే అభిమానులకు మాత్రం ఈ పుస్తకం ఒక మంచి అనుభూతినిస్తుంది.

Image copyright Getty Images

అనుకోని పరిస్థితుల్లో జట్టు పగ్గాలు

2000 సంవత్సరం..

సచిన్ టెండూల్కర్ అనుకోని పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో సారథ్య బాధ్యతలను సౌరవ్ చేపట్టాల్సి వచ్చింది.

గంగూలీ కెప్టెన్‌గా ఉన్న కాలంలోనే భారత్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగు చూసింది. చాలా మంది భారత్ క్రికెటర్లు, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పేర్లు బయటకొచ్చాయి.

'భారత క్రికెట్‌కు సంబంధించి అది చాలా క్లిష్టమైన దశ. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆ చీకటి రోజులు నెమ్మదిగా వెలుగు చూశాయి. అప్పుడు నా జట్టులో అంతా నిరుత్సాహం అలుముకుంది. ఆటగాళ్లందరూ ఆందోళనతో ఉన్నారు. సారథిగా నా పని మరింత కష్టమవబోతుందని గ్రహించా'నని నాటి పరిస్థితిని సౌరవ్ తన పుస్తకంలో వివరించారు.

అయితే, ఈ పుస్తకంలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. కావాలనే వాటిని ప్రస్తావించలేదని గంగూలీ తెలిపారు.

'ఈ పుస్తకం రాసిన ఉద్దేశం వేరు. నా జీవిత చరిత్ర రాస్తే అందులో తప్పకుండా ఆ విషయాలను పేర్కొంటా'నని సౌరవ్ చెప్పారు.

Image copyright Getty Images

అదే విజయ సూత్రం

ఒకవైపు జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టిన కాలంలోనే సారథిగా గంగూలీ భారత్ జట్టును విజయాల బాట పట్టించారు.

ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించి జట్టులో వారికి చక్కటి అవకాశాలు కల్పించారు.

''దేశం నలుమూలల ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారికి జట్టులో చోటు కల్పించా. వారు స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించా. కొత్త ఆటగాళ్లు ఆభద్రత భావంతో ఉంటారు. వారిలోంచి ఆ భయాన్ని పోగొట్టా'' అదే నా విజయం సూత్రం అని గంగూలీ వివరించారు.

Image copyright Getty Images

ఆటనే కాదు దృక్పథాన్ని మార్చారు

2001 సంవత్సరం..

భారత్ క్రికెట్‌ను మలుపు తిప్పిన కాలమది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

ఫాలో ఆన్ ఆడుతూ ఓటమి కొరల్లో చిక్కుకున్న భారత్ జట్టును తన చారిత్రక ఇన్నింగ్స్‌తో వీవీఎస్ లక్ష్మణ్(281 పరుగులు) విజయ తీరాలకు చేర్చారు.

ఆ చిరస్మరణీయ విజయంపై సౌరవ్ తన పుస్తకంలో ప్రస్తావించారు. ''భారత్ క్రికెట్ చరిత్రలోనే అదొక గొప్ప టెస్ట్ మ్యాచ్''అని దాదా అభివర్ణించారు.

ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఆటగాళ్ల దృక్పథం కూడా మారింది. మైదానంలో స్లెడ్జింగ్‌కు పాల్పడే ఆస్ట్రేలియాకు ఆ సిరిస్‌లో అదే భాషలో భారత్ ఆటగాళ్లు సమాధానం ఇచ్చారు.

''క్రికెట్ ఆడటానికి మానసిక సామర్థ్యం కూడా కావాలి. అవకాశం వస్తే ఎదుటి జట్టుపై మానసికంగా పై చేయి సాధించగలగాలి. అప్పుడే విజయాన్ని సొంతం చేసుకోగలం.అయితే ఇది కేవలం మైదానంలో మాత్రమే. బయట మాత్రం నేను అంతర్ముఖుడ్ని. చాలా నెమ్మదిగా ఉంటా. ఆటలో దిగితేనే నాలో దూకుడు కనిపిస్తుంది'' అని తన దృక్పథాన్ని ఆ పుస్తకంలో సౌరవ్ విశ్లేషించారు.

Image copyright Getty Images

జట్టు నుంచి ఉద్వాసన

2005...

అప్పటి కోచ్ గ్రేగ్ చాపెల్‌తో గంగూలీకి ఉన్న అభిప్రాయ బేధాలు బయటపడ్డాయి.

తన కెప్టెన్సీ పోవడానికి చాపెల్ కారణమని గంగూలీ ఆరోపించారు. చాపెల్ కోచ్‌గా ఉన్న కాలంలోనే జట్టు నుంచి కూడా గంగూలీ ఉద్వాసనకు గురయ్యారు.

''అది ఊహించని పరిణామం. అలా జరుగుతుందని అనుకోలేదు. చరిత్రలో అన్ని రికార్డు కావు. జట్టుకు అనేక విజయాలు అందించిన కెప్టెన్‌ను ఊహించని రీతిలో జట్టు నుంచి తొలగిస్తారని అనుకోలేదు. అది కూడా మంచి ఫాంలో ఉంటూ సెంచరీలు సాధిస్తున్నా కూడా.'' అని నాటి ఘటనను గంగూలీ గుర్తు చేసుకున్నారు.

అయితే, జట్టులోంచి వేటు పడ్డాక గంగూలీ దేశీవాళీ బాట పట్టారు. అక్కడ సత్తా చాటి మళ్లీ టీం ఇండియాకు ఎంపికయ్యారు. పునరాగమనానికి ఎంత కష్టపడింది ఈ పుస్తకంలో గంగూలీ వివరించారు.

''సరైన సౌకర్యాలు లేని హోటల్ గదిలో ఉంటూ, ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో ఒక అనామక ఆటగాడిగా క్రికెట్ ఆడా. జట్టులో స్థానం కోసం పరుగులు చేయడం మొదలుపెట్టా. చిన్న చిన్న టోర్నమెంట్లలో కూడా నా బ్యాట్‌కు పనిచెప్పా. బాగా ఆడకపోతే తుది జట్టులో మనకు స్థానం ఉండదు. కానీ, అద్భుతంగా రాణిస్తున్నా, పరుగుల వరద పారిస్తున్నా జట్టులోకి తీసుకోకపోతే.. అది నిజంగా మనల్ని బాధిస్తుంది'' అని గంగూలీ అప్పటి తన అనుభవాలని ఈ పుస్తకంలో పంచుకున్నారు.

Image copyright Getty Images

''నా జీవితంలో అదో కష్టకాలం. వేరే దారి కూడా నాకు లేదు. బాగా ఆడాలి. పరుగులు చేయాలి. అయితే, నా ఆట మీద నాకు నమ్మకం ఉంది. కఠోరంగా శ్రమించా. చివరకు జట్టులోకి వచ్చా.

యువ క్రికెటర్లకు కూడా నేను చెప్పదే అదే. మిమ్మల్ని మీరు నమ్మండి. బాగా కష్టపడండి. క్రికెట్లోనే కాదు ఏ వృత్తిలో ఉన్నాసరే. ఒత్తిడిని చిత్తు చేయండి. కఠోరంగా శ్రమించండి'' అని యువతకు గంగూలీ సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)