ప్రభుత్వ ఉచిత శానిటరీ నాప్కిన్లు ఎలా ఉండాలంటే..!

  • 9 మార్చి 2018
శానిటరీ నాప్కిన్ Image copyright Getty Images

విద్యార్థులకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అవి నాణ్యంగా ఉండాలని విద్యార్థులు పేర్కొంటున్నారు.

శానిటరీ నాప్కిన్ల పై 12% జీఎస్టీ ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యార్థులకు వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ. 127 కోట్లు కేటాయించింది.

ఒడిశా, మహారాష్ట్రల తరువాత ఇలా శానిటరీ నాప్‌కిన్ల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన రాష్టం ఏపీనే.

ఫిబ్రవరిలో ఒడిశా ప్రభుత్వం 'ఖుషి' అన్న కార్యక్రమం కింద రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదివే 17 లక్షల బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంపిణి చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 'అస్మిత' అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని కింద విద్యార్థినులకు ఎనిమిది శానిటరీ నాప్కిన్లు ఇస్తారు. ఇతరులకు రూ.24కే అందుబాటులో ఉండేట్లు చూస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా 5వ పూర్తి బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. 'కౌమార బాలికలు ఋతుస్రావ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రతిపాదన' అని తెలిపారు.

ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలలోని కౌమార బాలికల కోసం రూ.27 కోట్లు, ఎస్ హెచ్ జి మహిళలకు, ఇతర కౌమార బాలికల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.

చిత్రం శీర్షిక మౌనిక

దీనిపై బీబీసీ తెలుగుతో కొందరు విద్యార్థినులు మాట్లాడారు. ఇలా ఇవ్వడం చాల మంచి పరిణామం కానీ ఇచ్చే శానిటరీ నాప్కిన్స్ క్వాలిటీని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

విజయవాడ లోని సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థిని మౌనిక మాట్లాడుతూ.. కేవలం బడ్జెట్ కేటాయింపు కాదు దానిని పక్కగా అమలు చేయాలని కోరారు. "ప్రతి పబ్లిక్ ప్లేస్‌లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషిన్స్ పెడితే ఇంకా బాగుంటుంది.'' అని సూచించారు.

బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!

మరో విద్యార్ధిని స్నిగ్ధ మాట్లాడుతూ.. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య గురించి ఆలోచించడం శుభ పరిణామమన్నారు.

"చాల సార్లు చూస్తాం సరైన శానిటరీ నాప్కిన్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అందరు వాటిని కొని వాడే పరిస్థితి లేదు. కనుక కేవలం అందుబాటు లో పెట్టడం కాకుండా, ఎవరికీ ఎలా అవసరం ఉంటదో అలా వేరు వేరు సైజుల్లో మంచి క్వాలిటీతో అందించాలని కోరారు.

చిత్రం శీర్షిక దీప్తి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా 2012లో ఇటువంటి కార్యక్రమం ప్రవేశ పెట్టారు కానీ దాన్ని అమలు చేయలేదు. కనుక ఇపుడు కేటాయించిన బడ్జెట్ నిధులను పక్కగా వెచ్చించి అందరికీ మంచి క్వాలిటీ ఉన్న శానిటరీ నాప్‌కిన్లను అందించాలని మరో విద్యార్ధిని దీప్తి తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)