జూడో చాంపియన్లు: ఈ యువతులు లోకాన్ని చూడలేకపోవచ్చు... కానీ వీరేంటో లోకానికి చూపుతున్నారు!

  • 13 మార్చి 2018
Image copyright Arko Datto / Noor / Sightsavers

భారత గ్రామీణ ప్రాంతంలో కంటి చూపు లోపాలున్న యువతులు.. ఆత్మరక్షణ టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు.

ఈ యువతులు చూపు లేకపోవటం వల్ల భౌతిక, లైంగిక దాడులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదముంది. చాలా మంది తోడు లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.

అయితే స్వీయ రక్షణ సామర్థ్యం పెంపొందించుకోవటం వల్ల 60 మందికి పైగా యువతులు తిరిగి స్కూల్‌కి, ఉద్యోగాలకు వెళ్లగలుగుతున్నారు. సమాజంలో క్రియాశీలంగా పాలుపంచుకుంటున్నారు.

వీరిలో కొంతమంది జాతీయ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ పాల్గొన్నారు. పతకాలు సాధించారు. ఈ ప్రాంతంలో గల ఇతర అంధ మహిళలకు స్ఫూర్తి అందిస్తున్నారు.

అంధ మహిళల జూడో ప్రదర్శన Image copyright Arko Datto / Noor / Sightsavers
జూడో ప్రదర్శనను తిలకిస్తున్న ఓ మహిళ Image copyright Arko Datto / Noor / Sightsavers
జూడో పోటీలో ఇద్దరు యువతులు Image copyright Arko Datto / Noor / Sightsavers

సుదామ 2014లో జూడో నేర్చుకోవటం మొదలుపెట్టారు. అప్పటి నుంచీ ఆమె విశ్వాసం గణనీయంగా పెరిగింది. ఆమె మళ్లీ స్కూల్‌కు తిరిగి వెళ్లగలిగారు. అంతకుముందు.. ఆమె తల్లిదండ్రులు పని చేయాల్సి రావటం వల్ల, ఆమెను రోజూ బడికి తీసుకెళ్లటానికి ఇంకెవరూ లేకపోవటం వల్ల సుదామ స్కూల్‌కు వెళ్లలేకపోయేవారు.

‘‘జూడో నేర్చుకోక ముందు.. ‘నేను బయటకెలా వెళ్తాను? నా జీవితం ఎలా సాగుతుంది?’ అని ఆలోచించేదాన్ని. ఒంటరిగా స్కూలుకి వెళ్లటానికి భయపడేదాన్ని. స్కూల్ దూరంగా ఉండటం వల్ల అమ్మానాన్నా నన్ను పంపించేవాళ్లు కాదు’’ అని ఆమె చెప్తారు.

బడికి వెళ్లటం మళ్లీ మొదలుపెట్టిన తర్వాత సుదామ తన స్నేహితులకు జూడో నేర్పించటం ఆరంభించారు. ట్రైనర్‌గా కూడా అర్హత సాధించారు. దిల్లీ, గోవా, గురుగ్రామ్, లక్నోల్లో జరిగిన పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ కూడా గెలుపొందారు.

కిటికీ గుండా వీక్షిస్తున్న ఓ బాలిక Image copyright Arko Datto / Noor / Sightsavers
ఓ యువతితో మాట్లాడుతున్న ఒక శిక్షకుడు Image copyright Arko Datto / Noor / Sightsavers
జూడో పోటీ పడుతున్న ఇద్దరు యువతులు Image copyright Arko Datto / Noor / Sightsavers

దిల్లీలో జాతీయ అంధుల జూడో చాంపియన్‌షిప్‌లో పోటీపడిన అనంతరం ఈ యువతులకు తమ సమాజాల్లో గౌరవమన్ననలు ఎంతగానో పెరిగాయి.

అయినా వీరింకా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇరవై ఏళ్ల జానకి రెండేళ్ల శిక్షణ అనంతరం నేషనల్ బ్లైండ్ అండ్ డెఫ్ జూడో చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెలిచారు.

ఇటీవలే ఇంటర్నేషనల్ బ్లైండ్ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఎంపికయ్యారు. కానీ.. టర్కీలో జరిగే ఆ పోటీలకు ఆమెను పంపించటానికి అవసరమైన నిధులు సమకూర్చటానికి ఆమె కుటుంబం ఎన్నో కష్టాలు పడుతోంది.

అయినా జానకి ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ‘‘నా దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిస్తోంది’’ అని అంటారు.

‘‘నేను స్వీయ రక్షణను నేర్చుకోవటం, జూడో ఆడటం వల్ల నా జీవితం ఇంతగా మారిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అని చెప్తారామె.

జారుడు బండ మీద కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు యువతులు Image copyright Arko Datto / Noor / Sightsavers
జూడో నేర్చుకుంటున్న యువతులు Image copyright Arko Datto / Noor / Sightsavers
ఇద్దరు యువతుల ముందుగా నడచి వెళుతున్న నలుగురు బాలుర బృందం Image copyright Arko Datto / Noor / Sightsavers

సైట్‌సేవర్స్ స్వచ్ఛంద సంస్థ, స్థానిక భాగస్వాములు తరుణ్ సంస్కార్ సాయంతో ఈ తరగతులను నిర్వహిస్తున్నారు.

ఫొటోల కాపీ రైట్: ఆర్కో దత్తో నూర్ ఫర్ సైట్‌సేవర్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)