ప్రెస్‌రివ్యూ : వైరల్‌గా మారిన మోదీ వీడియో!

  • 11 మార్చి 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫైల్ ఫొటో

బీజేపీ అగ్రనేత ఆడ్వాణీ నమస్కారం చేసినా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నమస్కారం చేయలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

త్రిపుర సీఎం విప్లవ్‌దేవ్‌ ప్రమాణ స్వీకారం శుక్రవారం అగర్తలలో జరిగింది.

దీనికి ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు అందరూ హాజరయ్యారు.

వేదిక పైకి వచ్చిన మోదీ అక్కడ ఉన్న వారందరికీ అభివాదం చేశారు.

ఆడ్వాణీకి ముందున్న అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, తర్వాత ఉన్న మాణిక్‌ సర్కార్‌, తదితరులకు నమస్కారం చేశారు.

కానీ, ఆడ్వాణీవైపు మోదీ కన్నెత్తి చూడలేదు. పైగా ఆయన దగ్గరకు వచ్చేసరికి తల తిప్పేశారు.

ఆడ్వాణీకి పక్కనే ఉన్న సీపీఎం మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌తో నవ్వుతూ మాట్లాడారు.

కానీ, ఆడ్వాణీని కనీసం పలకరించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.కేంద్రంపై టీడీపీ మరో అస్త్రం

ఇప్పటికే కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఎన్డీయేకు మరో షాక్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోందని ఆంధ్రప్రభ ఓ కథనాన్ని ప్రచురించింది.

కేంద్ర మంత్రుల రాజీనామాను మొదటి అస్త్రంగా సంధించిన టీడీపీ, కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని భావిస్తోంది.

అందుకోసం చట్ట బద్ధంగా ఇచ్చిన హామీల అమలు, విభజన అంశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న దిశగా శనివారం సచివాలయంలో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు కసరత్తు చేసినట్టు ఆంధ్రప్రభ పేర్కొంది.

ఈడీ జప్తు చేసిన ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ. 34 కోట్లను తిరిగి ఇప్పించడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది.

ఈ వ్యవహారం వెనుక పెద్ద మతలబు ఉందనే దిశగా.. టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో చర్చ జరిగినట్టు ఆ కథనం తెలిపింది.

Image copyright Jamie McCarthy/Getty Images

పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ మోదీతో గుంటూరు వ్యాపారికి సంబంధాలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీతో గుంటూరులోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు ఉన్న సంబంధాలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రజాశక్తి ఓ కథనంలో పేర్కొంది.

గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త గతంలో హైదరాబాద్‌లో గీతాంజలి జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు నిర్వహించారు. ఆ తర్వాత కొద్దికాలానికి దాన్ని నీరవ్‌ మోదీ కొనుగోలు చేశారు.

ఈ లావాదేవీల నేపథ్యంలో వీరి మధ్య ఉన్న సంబంధాలు, ఇతర అంశాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

జ్యూయలరీ పార్కును నీరవ్ కొనుగోలు చేసినా ఈ వ్యాపారి ఇందులో అంతర్గత భాగస్వామిగా ఉన్నారనే సమాచారంపైనా ఆరా తీస్తున్నారని ప్రజాశక్తి వివరించింది.

బంగారం Image copyright Getty Images

వేలానికి 12 టన్నుల బంగారం!

పసిడి నగదీకరణ పథకం(జీఎమ్ఎస్) కింద కేంద్ర ప్రభుత్వం 21 టన్నుల బంగారాన్ని సమీకరించింది. ఇందులో ఎక్కువ భాగం ఆలయాలు, ట్రస్టుల నుంచి తీసుకోగా.. స్వల్పభాగం మాత్రం గృహస్తుల నుంచి స్వీకరించింది. అందులోంచి 12 టన్నుల బంగారాన్ని వేలం వేయాలని భావిస్తోందని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.

19 మార్చి నుంచి వేలం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆధీనంలోని మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎమ్‌ఎమ్‌టీసీ) ద్వారా ఈ వేలం జరగొచ్చు.

భారత్‌ వద్ద 20,000 టన్నుల బంగారం నిల్వలున్నాయని అంచనా. అయితే ఇందులో చాలాభాగం ట్రేడింగ్‌లోకి లేదా నగదీకరణలోకి రాలేదని తెలుస్తోంది.

ఆ తరహా బంగారాన్ని జీఎమ్‌ఎస్‌ ద్వారా చెలామణీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

2016-17లో బంగారం దిగుమతి 700 టన్నులు ఉండగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 950 టన్నులకు చేరిందని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)