BBC SPECIAL: ‘నాకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు నాకు లేదా?’

  • 11 మార్చి 2018
హదియా Image copyright Reuters

హదియాతో తన పెళ్లి విషయమై సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిన షఫీన్ జహాన్ తాను ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చాలా క్లుప్తమైన వివరణ ఇచ్చారు.

''మేమిద్దరం భారతీయులుగా జన్మించాం. మాకు ఇష్టమైన వ్యక్తితో, ఇష్టమైనట్లు జీవించడానికి మాకు హక్కు ఉంది. నాకు ఆమె నచ్చింది. అందువల్ల మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం'' అని షఫీన్ బీబీసీతో చెప్పారు.

హదియా అలియాస్ అఖిలా అశోకన్‌ను మత మార్పిడికి ప్రోత్సహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో షఫీన్ ఇలా సమాధానం ఇవ్వడం, అదీ ఇలా సాధికారింగా, ఇదే మొదటిసారి.

హదియా వాదనను తాము ప్రత్యక్షంగా వినాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు ఆమె పేరు మాత్రమే ఎక్కువగా మీడియాలో ప్రచారమైంది.

శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం - కేరళ హైకోర్టు హదియా, షఫీన్‌ల వివాహాన్ని రద్దు చేయకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడింది. అంతకు ముందు సుప్రీం, పరస్పర అంగీకారంతో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పెళ్లిని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉందా అని కూడా ప్రశ్నించింది.

Image copyright Sonu AV
చిత్రం శీర్షిక హదియా, షఫీన్ జహాన్

‘ఇష్టపడే ఇస్లాంలోకి..’

తన కూతుర్ని షఫీన్ ఇస్లాంలోకి మార్చాడంటూ హదియా తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఈ వివాదం మొదలైంది.

అయితే తనంతట తానే ఇష్టపడి ఇస్లాంను స్వీకరించానని హదియా కోర్టుకు చెప్పారు. ''నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరించే హక్కు నాకు లేదా?'' అని ఆమె ప్రశ్నించారు.

ఆ తర్వాత హదియా తండ్రి ఆమెను ఇతర దేశాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని అనుమానిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.

దాని తర్వాత షఫీన్ హదియాను వివాహం చేసుకున్నారు.

అయితే విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ -హదియా మత మార్పిడి వెనుక ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వాదించారు. దీంతో కేసును జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ చేశారు.

Image copyright PTI
చిత్రం శీర్షిక షఫీన్ జహాన్

సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ వెంటనే షఫీన్ కేరళలోని కొల్లం నుంచి అక్కడికి 500 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని సేలంలో హోమియోపతి చదువుకుంటున్న తన భార్య హదియాను తీసుకురావడానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆమెతో కలిసి మళ్లీ మరో 500 కిలోమీటర్లు ప్రయాణించి తన కుటుంబంతో కలిసి గడిపేందుకు కోజికోడ్ వెళ్లారు.

అలిసిపోయి ఉన్న ఆ దంపతులు కోజికోడ్ వెళ్లగానే, పీఎఫ్‌ఐ ఛైర్మన్ అబూబకర్‌ను కలిశారు.

''ఈ వివాదం మొత్తంలో మా వెంట ఉంది పీఎఫ్‌ఐనే'' అని షఫీన్ తెలిపారు.

హదియా అదే పీఎఫ్‌ఐ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంతో - తాము మరో రెండు సంస్థలను సంప్రదించినా, పీఎఫ్‌ఐ మాత్రమే తమ వెన్నంటి నిలబడిందని తెలిపారు.

ఒక రిపోర్టర్ ఆ సంస్థపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా, ''ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు. షఫీన్ కాకుండా మరెవ్వరు నాకు సహాయంగా నిలబడేవారు? అనేక మంది వ్యక్తులు, నేను పేర్లు చెప్పను కానీ, చాలా ముస్లిం సంస్థలు కూడా నాకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు'' అని జవాబు చెప్పారు.

''నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన సంస్థలను అడ్డుకున్న సంస్థలు కూడా ఉన్నాయి'' అని హదియా తెలిపారు.

Image copyright SONU AV

ఆ ఉద్యోగం కూడా పోయింది..

ప్రస్తుతం సుప్రీంకోర్టు వాళ్లిద్దరి పెళ్లికి ఆమోదముద్ర వేసినా, వాళ్లు ఇప్పుడిప్పుడే భార్యాభర్తలుగా కలిసి ఉండే అవకాశం లేదు.

''ఆమె కాలేజీకి మూడు రోజులు సెలవులు ఇచ్చారు. మూడు రోజుల తర్వాత ఆమె మళ్లీ తిరిగి వెళ్లాలి'' అని షఫీన్ తెలిపారు.

''ఆమె ఇంకా హౌస్‌సర్జెన్సీ చదువుతోంది. మేమిద్దరం కలిసి ఉండేది ఆ తర్వాతే'' అన్నారు.

''నేను మస్కట్‌లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పని చేసేవాణ్ని. అయితే ఈ కేసు కారణంగా నా ఉద్యోగం పోవడంతో కేరళలోనే ఉండిపోయాను'' అని తెలిపారు.

Image copyright PTI

‘ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లా..’

ఈ కేసు వల్ల ఇద్దరూ అలసిపోవడంతో భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిని ఆలోచించడానికి తనకు కొంత సమయం అవసరం అని షఫీన్ భావిస్తున్నారు

అయితే మరి షఫీన్ ఎన్‌ఐఏకు విచారణలో సహకరించొచ్చుగా?

''వాళ్లు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వెళ్లాను'' అని చెప్పారు షఫీన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)