మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్: ప్రభుత్వ హామీతో ఆందోళన విరమణ

  • 12 మార్చి 2018
ముంబైలో రైతుల ఆందోళన Image copyright Getty Images

మహారాష్ట్రలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాసిక్ నుంచి ముంబై వరకూ లాంగ్ మార్చ్ చేపట్టిన వేలాది మంది రైతులు ఆదివారం రాత్రి ముంబై నగరానికి చేరుకున్నారు. వారి డిమాండ్లను చాలా వరకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించటంతో ఈ రైతులు సోమవారం ఆందోళన విరమించారు.

సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. రైతుల ప్రతినిధులతో ముంబైలోని శాసనసభ భవనంలో సమావేశమయ్యారు.

అనంతరం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ‘‘రైతుల డిమాండ్లన్నిటికీ మేం ఒప్పుకున్నాం. ఈ మేరకు వారికి విశ్వాసం కల్పించటానికి లిఖితపూర్వకంగా లేఖ అందించాం’’ అని పేర్కొన్నారు.

మరోవైపు.. ‘‘రైతుల డిమాండ్లలో చాలా వాటికి మేం అంగీకరించాం. రాతపూర్వకంగా హామీ ఇచ్చాం’’ అని మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ బీబీసీకి తెలిపారు.

అటవీ భూమి బదలాయింపు హక్కుల అంశాన్ని ఆరు నెలల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతులు, ఆదివాసీలకు రుణ మాఫీ సమస్యలను పరిశీలించటానికి అఖిల భారతీయ కిసాన్ సభ నుంచి ఇద్దరు ప్రతినిధులతో ఒక కమిటీని నియమిస్తామని చెప్పింది.

Image copyright NDRANIL MUKHERJEE / GETTY IMAGES

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రైతు సంఘంతో చర్చలు జరపటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు, ఆదివాసీలు చేస్తున్న డిమాండ్లన్నిటినీ పరిగణనలోకి తీసుకోవటానికి సుముఖంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

సంపూర్ణ రుణ మాఫీ, నదుల అనుసంధానం పథకాన్ని ఆదివాసీ గ్రామాలను దృష్టిలో ఉంచుకుని పునర్‌వ్యవస్థీకరించటం, ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా చెల్లించాలన్న స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయటం తదితర డిమాండ్లతో రైతులు ఈ ఆందోళన చేపట్టారు.

నదుల అనుసంధానం పథకాన్ని.. గిరిజన గ్రామాలను గమనంలో ఉంచుకుని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మాటిచ్చింది.

Image copyright All India Kissan Sabha

వేలాది మంది రైతులు, ఆదివాసీలు మార్చి 6వ తేదీన నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 11వ తేదీకి ముంబై చేరుకున్నారు. వీరు ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్లు పైగా నడిచారు.

ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన రైతులంతా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటుచేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

రైతుల ఆందోళన, ప్రభుత్వ హామీలపై ఎవరేమన్నారు?

‘‘మహాత్మా గాంధీ ఇదే రోజున సత్యాగ్రహం ప్రారంభించారు. మా డిమాండ్లను ఆమోదించకపోయినా, అమలు చేయకపోయినా ఆ తర్వాతి రైతు ఉద్యమం ఆజాద్ మైదాన్ నుంచి మొదలవుతుంది’’ అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు.

‘‘ముంబైలో రైతుల భారీ ర్యాలీ ప్రజల శక్తికి అద్భుతమైన ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దయ వైఖరికి వ్యతిరేకంగా ఈ రైతులు, ఆదివాసీల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల డిమాండ్లను అమలు చేయటం, తన హామీలను నెరవేర్చటం చాలా ముఖ్యం. రైతులు మరోసారి రోడ్డెక్కకుండా ఉండాలంటే ప్రభుత్వం తన హామీలను అమలు చేసి చూపించాలి’’ అని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యాఖ్యానించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)