ప్రెస్ రివ్యూ: దక్షిణాది సొమ్ములతో.. ఉత్తరాదికి సోకులా?

  • 13 మార్చి 2018
Image copyright MONEY SHARMA

దక్షిణాది రాష్ట్రాల పన్నులతో ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. దక్షిణ భారతదేశం నుంచి పన్నుల రూపంలో డబ్బులు కేంద్రానికి ఎక్కువగా వస్తాయని... కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశానికే ఎక్కువ ఖర్చు చేస్తోందని సోమవారం శాసన మండలిలో చంద్రబాబు తెలిపారు.

'మీరు అభివృద్ధి చెందుతున్నారు' అంటూ రాష్ట్రానికి సహాయం చేయకపోవడం సరికాదన్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరమని... ఆ తర్వాత రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుంటే మరింత బాధ వేస్తోందని అన్నారు.

జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోరాదని, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ కూడా కాంగ్రె్‌సలాగా చేస్తే ఏమాత్రం మంచిది కాదన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన 18 హామీలను అమలు చేయాల్సిందే అని పునరుద్ఘాటించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright AFP

విశాఖ రైల్వే జోన్ అసాధ్యమని తేల్చేసిన అధికారులు

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు అసాధ్యమని రైల్వే అధికారులు కుండబద్దలు కొట్టారని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.

కొత్త జోన్‌ లాభదాయకం కాదని ఇప్పటికే నివేదిక వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. దానివల్ల మీకేం లాభం ఉంటుందని ఏపీ అధికారులను ప్రశ్నించారు.

జోన్‌ ఏర్పాటు వల్ల కొత్తగా ఒక జనరల్‌ మేనేజర్‌ వచ్చి కూర్చోవడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అనవసరంగా పరిపాలన ఖర్చులు పెంచుకొనే స్థితిలో రైల్వేబోర్డు లేదని వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఏర్పాటుపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా, అదనపుకార్యదర్శి టీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌... వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, ఏపీ, తెలంగాణ అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని రైల్వేశాఖ అధికారులు విస్పష్టంగా చెప్పారు.

విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులను పాత విధానం ప్రకారమే చేపట్టాలని ఏపీ అధికారులు కోరగా, కొత్త విధానం వచ్చాక పాతదాని ప్రకారం వెళ్లడం కుదరని హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా తేల్చిచెప్పారు.

Image copyright FB/TelanganaCMO

కోమటిరెడ్డి దాడి, స్వామి గౌడ్‌ కంటికి గాయం

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజునే అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్లకార్డులు, కాగితాలు, హెడ్‌సెట్‌లతో కాంగ్రెస్‌ సభ్యులు దాడికి దిగటంతో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయంటూ సాక్షి కథనం ప్రచురించింది.

గవర్నర్ ప్రసంగం మొదలైన 3 నిమిషాలకే కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

'రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. దళిత వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..'అని నినాదాలు చేశారు.

నినాదాలు చేస్తూ ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్‌ను విరిచేసి గవర్నర్‌ వైపు విసిరారు. అది శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలింది.

దాంతో స్వామిగౌడ్ కుడి కన్ను కార్నియా దెబ్బతిన్నట్టు సరోజినీదేవి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవీందర్‌ గౌడ్‌ చెప్పారని సాక్షి తెలిపింది.

స్టాక్ మార్కెట్ Image copyright INDRANIL MUKHERJEE/gettyimages

ఆంధ్రా బ్యాంకు షేర్ ఢమాల్

ఆంధ్రా బ్యాంకు షేరు మదుపర్లకు చుక్కలు చూపించింది. సోమవారం ఒక దశలో 15 శాతానికి పైగా క్షీణించి దాదాపు 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

అయితే.. చివర్లో కాస్త కోలుకున్నా, మార్కెట్‌ విలువ రూ.231 కోట్ల మేరకు క్షీణించిందని ఈనాడు పేర్కొంది.

గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయెటెక్‌ కంపెనీ రుణాల రూపంలో చేసిన దాదాపు రూ.5,000 కోట్ల కుంభకోణం కేసులో తాజాగా ఆంధ్రా బ్యాంకు మాజీ డైరెక్టర్‌ అనుప్‌ ప్రకాశ్‌ గార్గ్‌పై ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఈ పరిణామం బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపగలదన్న అంచనాలతో మదుపర్లు షేర్లను విక్రయించారు.

సోమవారం బీఎస్‌ఈలో రూ.37 వద్ద ప్రారంభమైన షేరు ధర రూ.32.55- 37.20 మధ్య కదలాడింది. 6.88 శాతం నష్టంతో రూ.35.85 వద్ద ముగిసింది.

నిఫ్టీలో 6.74 శాతం క్షీణించి రూ. 35.95 వద్ద ముగిసింది.

2018లో ఇప్పటి వరకూ ఆంధ్రా బ్యాంకు షేరు దాదాపు 41 శాతం నష్టపోయింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా