పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తారా?: ఎడిటర్స్ కామెంట్

  • 14 మార్చి 2018
పవన్ కల్యాణ్, జాతీయ జెండా Image copyright janasenaparty/facebook

మరో సినిమా స్టార్, మరో రాజకీయ పార్టీ. తెలుగు నాట 'కొత్త' రాజకీయపార్టీకి తెరలేచింది. సాంకేతికంగా పవన్ కల్యాణ్ పార్టీ నాలుగేళ్లు పూర్తిచేసుకుని ఐదో యేట అడుగుపెట్టి ఉండొచ్చు. కానీ వాస్తవికమైన అర్థంలో ఇపుడే అది పూర్తి రాజకీయ స్వరూపం సంతరించుకున్నట్టు భావించొచ్చు. అటువంటి సంసిద్ధత, ఏర్పాట్లు ఇపుడిపుడే కనిపిస్తున్నాయి.

ఇప్పటికైతే పవన్ పార్టీ జనసేన మీద రాజకీయ ప్రపంచంలో పెద్ద అంచనాలేమీ లేవు. నిర్మాణమే లేదు కాబట్టి అపుడే అంచనాకు రాలేం. కాకపోతే నాయకుడిగా కూడా ఆయన ఇంతవరకు ప్రత్యేకముద్ర చూపించిన దాఖలా పెద్దగా లేదు. అసలు రాజకీయ నాయకుడిగా వ్యవహరించాలని ఇప్పటివరకూ అనుకున్నారా లేదా అనేది కూడా తెలీదు.

ఆయన నిర్వహించిన సభలు సినిమాటిక్‌గానే సాగుతూ వస్తున్నవి. సినిమాలో హీరో ప్రవేశం మాదిరే ఆయన వేదికమీదకు దూసుకొస్తారు -లిటరల్‌గా! అంతే సినిమాటిక్‌గా నిష్ర్కమిస్తారు. మధ్యలో కొన్ని పంచ్ డైలాగులు వదులుతారు. ఆవేశం సరేసరి, అది ఆయన ఇంటిపేరుగా మారిపోయి ప్రచారంలో ఉంది.

మీడియాతో వ్యవహరించేటప్పుడు కూడా కీలక అంశాలపై నిర్దుష్టమైన వైఖరి ప్రకటించకుండా సాధారణీకరించి మాట్లాడతారు. సీరియెస్ పొలిటికల్ జీవుల్లో ఆయన పట్ల సానుభూతి ఉన్న వారైతే మనిషి నిజాయితీ పరుడే కానీ స్పష్టత ఉండదు లాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు కూడా పొడిపొడిగా అదేదో కానిపని అయిష్టంగా చేస్తున్నట్టుగా తప్ప నిండా అందులో మునిగినట్టు ఎన్నడూ కనిపించరు.

ఉద్దానం గురించైనా, ఆక్వా పుడ్ పార్క్ గురించి అయినా రాజధాని రైతుల గురించి అయినా ఏ ఇష్యూ తీసుకుని జనాన్ని కలిసినా అదొక ఎన్జీవో యాక్టివిటీలాగా తప్ప రాజకీయ పార్టీ ఆచరణ లాగా అనిపించదు. అపుడపుడు ప్రెషర్ గ్రూప్‌గా పనిచేసి ఉండొచ్చు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కదలికలో ఆయన పాత్ర కూడా ఉన్నది. అది వేరే విషయం. కానీ నిరంతర రాజకీయ కార్యక్రమం ఏదీ లేదు. నాలుగేళ్లు పూర్తయినా ఇంతవరకూ మ్యానిఫెస్టో ప్రకటించని పార్టీ జనసేన.

Image copyright janasenaparty/facebook

సన్నద్ధత - సంసిద్ధత

వీటన్నింటివల్లే రాజకీయాల పట్ల ఆయనెంత సీరియెస్‌గా ఉన్నారు అనే ప్రశ్న ఇప్పటివరకూ తలెత్తుతూ వస్తున్నది. ఆయన కూడా ఎప్పుడూ వీటిని అంతగా పట్టించుకున్నట్టుకానీ ఆ ఇమేజ్‌ని మార్చుకోవాలని ప్రయత్నించినట్టు కానీ నిన్న మొన్నటిదాకా అనిపించలేదు. కానీ ఇటీవల రాజకీయాలను పూర్తిస్థాయి సీరియెస్ వ్యాపకంగా భావిస్తున్నారు అనేదానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నవి. ప్రత్యేకహోదా, ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేసింది, చేయలేదు అనేది అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో కొంత సీరియెస్ నెస్ ఉన్నది. ఆ వెంటనే ఆయన తన మకాం ఆంధ్ర రాజధానికి మార్చడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మహాసభతో సీరియెస్‌గా రాజకీయ ప్రయాణాన్ని మొదలెడుతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నవి. యూత్‌లో పాపులర్ అయిన ఫాలోయింగ్ ఉన్న సినీ స్టార్ జనంలోకి అడుగుపెడుతూ ఉండడం ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యమైన సన్నివేశమే అవుతుంది.

కాంగ్రెస్ వాళ్లను పంచెలూడదీసి కొడతాం అన్న పవన్ కల్యాణ్ అప్పట్నించి ఎంతో కొంత దూరం ప్రయాణం చేసినట్టే అనిపిస్తున్నది. డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు తరహాలో రాజకీయాలను అధ్యయనం చేస్తున్నట్టే అనిపిస్తున్నది. కానీ రాజకీయాల్లో రాణించడానికి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రయాణించడానికి అవసరమైన సంసిద్ధత, వ్యూహాలు- ఎత్తుగడలతో కూడిన సన్నద్ధత, స్పష్టమైన భావజాలం ఎంతవరకు ఉన్నాయనేది ఇంకా ప్రశ్నార్థకమే!

చిరంజీవికి ఆ సంసిద్ధత సన్నద్ధత లేకపోవడం వల్లే త్వరగా సైడ్ లైన్ కావాల్సివచ్చింది. ఇమేజ్, పంచ్ డైలాగులు జనాన్ని తాత్కాలికంగా ఆకట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. జనాన్ని నిలబెట్టుకోవడానికి తనతో నడిపించుకోవడానికి స్పష్టమైన విధానాలు అవసరం. ఇపుడున్న వారికంటే భిన్నంగా ఉండడమొక్కటే సరిపోదు. తమ ఆశల్ని ఆయనలో చూసుకోవడం అనేంత పెద్దమాట కాకపోయినా ఇతరులకంటే మేలు చేకూరుస్తారు అనే కనీసమైన నమ్మకం అయితే కలిగించ గలగాలి. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయం అనే భరోసా కలిగించాలి. అది సాధ్యం కావాలంటే పటిష్టమైన యంత్రాంగం, వనరులు, దిశా దశా నిర్దేశించే నాయకత్వం కావాలి.

నాటి బంధం ఏమవుతుంది?

పవన్ కల్యాణ్ ఏర్పాట్ల తీరు చూస్తే ఆయన నిజంగా 2019కి సన్నద్ధమవుతున్నారా లేక 2024కి ప్రిపేర్ అవుతున్నారా అనే సందేహం తలెత్తుతుంది. తెలుగుదేశంతో సంబంధాలు ఎంతవరకు- ఎంతమేరకు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణ్ ఉపయోగపడిన మాట వాస్తవమే కావచ్చును కానీ చంద్రబాబుకు మద్దతుగా జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు అని కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానం లాజికల్ అనిపించుకుంటుందా!

పవన్ కల్యాణ్ లాంటి పాపులర్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు వెంటే నడవాలని అనుకుంటారు? దాని వల్ల ఆయనకు కొత్తగా ఒనగూరే ప్రయోజనమేంటి? సినిమాల్లో టాప్ స్టార్‌గా ఉన్న వ్యక్తి వాటిని తగ్గించుకునో మానివేసో రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఏదో పెద్ద లక్ష్యమే ఉండాలి కదా! తెలుగుదేశంతో కలిసి ప్రయాణించడం వల్ల అదెలా సాధ్యమవుతుంది?.

Image copyright janasenaparty/facebook

బలపడాలన్నా, స్థిరపడాలన్నా.. ‘రోడ్డున పడాలి’

ప్రత్యామ్నాయం అనిపించుకోవడం అంత సులభమైన పనికాదు. విద్యాధికుడు, నిజాయితీ పరుడు అని పేరున్న జయప్రకాశ్ నారాయణ్ ఎంత ప్రయత్నించినా ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అనిపించుకోలేక పోయారు. ఆయనకు లేని సినీ ఇమేజ్ పవన్ కల్యాణ్‌కు ఉన్నప్పటికీ ఇపుడున్న వాతావరణంలో తెలుగుదేశం, వైసీపీ బలంగా స్థిరపడిపోయిన స్థితిలో తాను నిజంగా ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

జనంలోకి దూకి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. తానేంటో తానేం చేయబోతారో క్లియర్ చేయాల్సి ఉంటుంది. కులానికి మతానికి వ్యతిరేకంగా జాతీయ భావనతో కవితలతో ఆవేశపూరితంగా మాట్లాడడం వల్ల మాత్రమే ఇమేజ్ మారదు. రాజకీయ నిరాశ్రయులకు వేదికగా మారడం, అన్నీ ఆ తానులో ముక్కలే అనిపించుకోవడం అనేది ఎంత ప్రమాదమో అతి జాగ్రత్తలకు పోయి రాజకీయ వాసన లేకుండా, సమర్థ యంత్రాంగం లేకుండా ఏకం సర్వం అనిపించుకోవడం కూడా అంతే ప్రమాదం. ఎన్టీఆర్‌ను ఇపుడు రిపీట్ చేయడం సాధ్యం కాదు. ఆయనొచ్చిన నాటి పరిస్థితులు వేరు.

వామపక్షధోరణి పట్ల ఇష్టం ప్రకటించే పవన్ కల్యాణ్ తన వేదికల నిండా ప్రదర్శించే ఫొటోల్లో చాలా వైరుధ్యం ఉంటుంది. కొడుక్కి అకిరా కురసోవా లాంటి మాస్టర్ పేరు పెట్టుకుని వేయిమందిని ఒంటి చేత్తో లేపేసే మాస్ మసాలా హీరోగా గుర్తింపు పొందడం లాంటి వైరుధ్యమే అది.

సినిమా అనేది బిజినెస్ కాబట్టి కొన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలు ప్రజలతో కూడిన వ్యాపకం. నిజమైన రాజకీయం బాధ్యతాయుతమైన వ్యవహరం. జనజీవితాలను ప్రభావితం చేసిన వారిని శ్లాఘిస్తూ పాట విడుదల చేయడం అనే సింబాలిజాన్ని దాటి చాలా దూరమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నిపుణులు, విద్యాధికులను సలహాదారులుగా చేర్చుకోవడం వల్ల అవగాహన పెంచుకోవచ్చు. రాజకీయంగా ఎదగాలంటే మాత్రం 'రోడ్డున పడక' తప్పదు.

Image copyright janasenaparty/facebook

విధి, విధానాలు ప్రజలకు మేలు చేస్తాయా?

ఆంధ్రకు జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని అస్ర్తంగా మార్చుకుంటారనే సంకేతాలైతే ఇప్పటికి కనిపిస్తున్నాయి. దాన్ని మరికాస్త విస్తరించి దక్షిణాది సెంటిమెంట్‌ను ముందుకు తీసుకురావచ్చని కూడా అర్థమవుతోంది. ఇప్పటికే ఆయన దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని అని ఉన్నారు. దాన్ని చంద్రబాబు కూడా అందిపుచ్చుకున్నారు. అటు తమిళ నాట కమల్ హాసన్ కూడా ఇదే సెంటిమెంట్ ను ముందుకు తీసుకువస్తున్నారు. బిజెపి విధానాలు ఈ సెంటిమెంట్ పెరగడానికి అవకాశమివ్వడంతో దక్షిణాది నాయకులకు నాయకులు కాగోరే వారికి అదొక ఆయుధంలా మారుతున్నది. ఈ దక్షిణాది సెంటిమెంట్‌కు ఎవరు ఛాంపియన్‌గా మారతారు అనే పోటీ ముందు ముందు తీవ్రం కావచ్చు.

తెలుగు నేల మీద పార్టీలకు అటువంటి భావన లోతుగా లేకపోయినా ప్రత్యేక హోదా, ఇతర హామీల విషయంలో బిజెపి వైఖరిని బోనెక్కించడాడనికి దాన్ని అస్ర్తంగా మార్చుకుంటూ ఉండొచ్చు. బిజెపి తెలంగాణలో సవాల్ విసిరే పరిస్థితే వస్తే ఈ సెంటిమెంట్‌ను కెసిఆర్ ఎత్తుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కాకపోతే మాటకు ముందు మాటకు వెనుక జాతీయ భావనను ప్రస్తావించే పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్ను ఏ రూపంలో ముందుకు తీసుకుపోతారనేది ఆసక్తి కరం. ఇది మరో వైరుధ్యానికి దారితీయకుండా ఉండడానికి ఏం చేస్తారనేది ఆసక్తికరం.

పోయిన ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రజలకు అనేకానేక హామీలిచ్చారు. పూచీ పడ్డారు. ఇపుడు బిజెపి మాట తప్పింది అని చూపించి ఇద్దరూ దానికి దూరంగా జరిగేట్టు కనిపిస్తున్నది. పవన్ కల్యాణ్ అయితే ఇప్పటివరకూ తన దిశ దశను స్పష్టం చేయకుండా దాటవేస్తూ వచ్చారు. అదే సమయంలో ఘాటైన విమర్శలకు దూరంగా పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన నిజంగానే రాజకీయాల్లో సీరియెస్‌గా ప్రయాణించాలి అనుకుంటే అన్నింటికి సిద్ధపడి నేనిది, నా పార్టీ ఇదీ, నా విధానాలు ఇవీ అని కుండబద్దలు కొట్టక తప్పదు.

ఈ నేను, నా ఏమిటి? ప్రజాస్వామ్యంలో వ్యక్తి కేంద్రక రాజకీయాలు ఏమిటి అనే అమాయకమైన ప్రశ్న వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రజాస్వామ్యం ఆ దశలోనే ఉన్నది కాబట్టి వ్యక్తికేంద్రకం ఎలాగూ తప్పదు కాబట్టి ఆ వ్యక్తికేంద్రకమైన పార్టీల్లో కూడా విధానాలు ఎలా ఉన్నాయి, అవి మిగిలిన వారికి ఎంత భిన్నంగా ఉన్నాయి, ఎంత మేర ప్రజలకు మేలు చేసేట్టున్నాయి అనేవి మాత్రమే ప్రాక్టికల్గా చూడగలిగిన అంశాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు