ఈ ఎంబీబీఎస్ సర్పంచి గురించి తెలుసా?

  • 15 మార్చి 2018
షహనాజ్ ఖాన్ Image copyright SHAHNAZ KHAN/ BBC

రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లా కామ పంచాయతీలో బడికి వెళ్లే బాలికల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే కొందరు బడి బాట పడుతున్నారు. ఆ ఊళ్లో కొద్దిమంది మాత్రమే డిగ్రీ, బీఎడ్ చేసిన వాళ్లున్నారు.

కానీ, వెనుకబడిన ఆ ఊరి నుంచే షహనాజ్ అనే యువతి ఒక కొత్త రికార్డు సృష్టించారు. అతి పిన్న వయసు ఎంబీబీఎస్ సర్పంచిగా ఆమె ఈ గ్రామం నుంచి ఎన్నికయ్యారు.

24 ఏళ్ల ఈ యువ సర్పంచి ఇప్పుడు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదవుతున్నారు.

ఈ నెలాఖరుతో ఆమె ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఆ తర్వాత గురుజ్‌రాం సివిల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌లో చేరుతారు. భవిష్యత్తులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలన్నది ఆమె ఆలోచన.

Image copyright SHAHNAZ KHAN/ BBC

కానీ, షహనాజ్ డాక్టర్ కాకముందే ఊహించనిరీతిలో సర్పంచి అయ్యారు.

పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలని ఆమె భావిస్తున్నారు. అయితే దానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు.

Image copyright SHAHNAZ KHAN/ BBC

''ఆరు నెలల నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు మా తాతయ్య సర్పంచిగా ఉండేవారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన ఎన్నికను కోర్టు కొట్టివేసింది. దీంతో తాతయ్య స్థానంలో ఇంట్లోంచి ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను సిద్ధమయ్యాను'' అని షహనాజ్ తన రాజకీయ ప్రస్థానం గురించి బీబీసీకి వివరించారు.

రాజస్థాన్‌లో సర్పంచిగా పోటీ చేయాలంటే పదో తరగతి పాసవడం తప్పనిసరి.

షహనాజ్ తాతయ్య పదో తరగతి పాసైనట్లు ఎన్నికల అఫడివిట్‌లో దొంగ సర్టిఫికేట్ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి ఎన్నికను కోర్టు రద్దు చేసింది.

Image copyright SHAHNAZ KHAN/BBC
చిత్రం శీర్షిక షహనాజ్ ఖాన్

షహనాజ్‌ది రాజకీయ కుటుంబం. వీళ్ల తాతయ్యే 55 ఏళ్లుగా ఆ గ్రామ సర్పంచి. ఇక నాన్న ఊళ్లో పెద్దమనిషి.

అమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు షహనాజ్ కూడా సర్పంచిగా ఎన్నిక కావడంతో ఆమె కుటుంబంలోని నాలుగో తరం కూడా రాజకీయాల్లోకి వచ్చినట్లయింది.

Image copyright SHAHNAZ KHAN/BBC

వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం కాదా?

ఈ ప్రశ్న పూర్తిగా అడగకముందే షహనాజ్‌ స్పందించారు. ''నేను సర్పంచి అయ్యాకే మా ఊళ్లో చదువుకునే బాలికలు సంఖ్య బాగా పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్లు కూడా వాళ్ల పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమ్మ చూపిన దారిలోనే నేను వెళుతున్నా. ఆమె కట్టుబాట్లను అధిగమించి ఈ గ్రామం నుంచే రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లారు.

ఎంబీబీఎస్ చేస్తుండటంతోపాటు పిన్న వయసులోనే సర్పంచి కావడంతో గ్రామంలో షహనాజ్ పేరు మారుమోగిపోతోంది. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.

Image copyright SHAHNAZ KHAN/ BBC

అయితే, రాజస్థాన్‌లోని ఈ ప్రాంతంలో బాలికల విద్యకు సరైన ప్రోత్సాహం లేదు.

భరత్‌పుర్ జిల్లాలో70.01 శాతం అక్షరాస్యత ఉంది. రాష్ట్ర అక్షరాస్యత (66.1 శాతం)తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. కానీ, ఇక్కడ బాలికలతో పోల్చితే బాలుర అక్షరాసత్య రేటు చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

Image copyright SHAHNAZ KHAN/ BBC

షహనాజ్ ఐదో తరగతి వరకు జైపూర్‌లో చదవుకున్నారు. గురుగ్రామ్‌లోని శ్రీరామ్ స్కూల్ అరావళిలో పదో తరగతి పూర్తి చేశారు.

మారుతి కుంజ్‌లో ఇంటర్ చదివారు. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నారు.

తరగతులకు హాజరుకావాల్సి రావడంతో ఆమె కేవలం వేసవి సెలవుల్లోనే కామ గ్రామానికి వస్తుంటారు.

ఉపఎన్నికల్లో కేవలం 195 ఓట్ల మెజారిటీతోనే షహనాజ్ గెలిచారు.

'మా కుటుంబం వారసత్వ రాజకీయాలకు ఉదాహరణ కాదు. బాగా పనిచేస్తేనే ఎవరైనా ఎన్నికల్లో మళ్లీ మళ్లీ విజయం సాధిస్తారు. దానికి మా కుటుంబమే ఉదాహరణ'' అని తన కూతురు విజయంపై తల్లి జహీదా బీబీసీకి చెప్పారు.

Image copyright SHAHNAZ KHAN/ BBC

హర్యానాలోని మేవాట్, రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పుర్ ప్రాంతంలో మేవా సంతతి ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వీరు చాలా వెనకబడినవారని భావిస్తుంటారు.

అలాంటి కుటుంబం నుంచి వచ్చిన షహనాజ్ ఇప్పుడు డాక్టర్ కాబోతుండటంతో పాటు, గ్రామానికి సర్పంచిగా పనిచేస్తుండటం కామలోని బాలికలకు స్ఫూర్తినిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)