స్టీఫెన్‌ హాకింగ్‌కు వచ్చిన వ్యాధి ఏంటి? దాన్ని ఎలా జయించారు?

  • 14 మార్చి 2018
స్టీఫెన్‌ హాకింగ్‌ Image copyright hawking.org.uk
చిత్రం శీర్షిక స్టీఫెన్‌ హాకింగ్‌

ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ అమ్యోట్రొపికల్ లాటెరల్ స్కేర్లోసిస్(ఏఎల్ఎస్) అనే వ్యాధితో జీవితాంతం పోరాడుతూ చనిపోయారు. దీన్నే మోటార్ న్యూరాన్ వ్యాధిగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈ వ్యాధి ఎలా వస్తుంది?

మెదడు, వెన్నుపూసలోని నరాల కణాలను మోటార్ న్యూరాన్‌లుగా పిలుస్తుంటారు. ఇవి దెబ్బతినడమో, పూర్తిగా నశించడమో జరిగితే అది ఏఎల్ఎస్‌ వ్యాధికి దారితీస్తుంది.

కండరాల ద్వారా శరీరంలోని అవయవాలకు సమాచారం చేరవేయడంలో ఈ కణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి లేకుంటే మన శరీరాన్ని మెదడు అదుపు చేయలేదు. కండరాలు పని చేయవు.

90 శాతం కేసుల్లో ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతు చిక్కడం లేదు.ఒక్క ఇంగ్లాండ్‌లోనే ఈ వ్యాధితో 3,500 మంది బాధపడుతున్నట్లు అంచనా.

Image copyright hawking.org.uk

ఈ వ్యాధి లక్షణాలేంటి?

మోటార్ న్యూరాన్‌లు దెబ్బతింటే కండరాలు, మరీ ముఖ్యంగా భుజాలు చచ్చుబడిపోతాయి. నడుస్తున్నప్పుడు పట్టుతప్పి పడిపోవడం, అదుపుతప్పి చేతిలోని వస్తువులను పడేయడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.

కండరాలు వ్యాకోచించడం, తిమ్మిర్లెక్కడం కూడా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్లకి చివరి దశలో మాట్లాడటం కష్టమవుతుంది.

మింగడం, శ్వాస పీల్చడం కూడా చేయలేరు. పక్షవాతంలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ వ్యాధి వచ్చినవాళ్లు సాధారణంగా శ్వాసకోశ కండరాలు పని చేయక మృతి చెందుతారు.

Image copyright hawking.org.uk
చిత్రం శీర్షిక స్టీఫెన్‌ హాకింగ్‌

వ్యాధి నిర్ధారణ ఎలా ?

ఏఎల్ఎస్‌ బారిన పడ్డవారు సాధారణంగా రెండు నుంచి ఐదేళ్లకు మించి జీవించలేరు.సగం మంది రోగులు వ్యాధి బయటపడిన 14 నెలల్లోనే చనిపోతారు.

''ఏఎల్ఎస్ చాలా సంక్షిష్టమైన, అంతు చిక్కని వ్యాధి. తరచూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా లక్షణాలు బయట పడటానికి సంవత్సరాలు పడుతుంద''ని మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్‌కి చెందిన మెల్ బ్యారీ తెలిపారు.

ఏఎల్ఎస్ వచ్చిన ప్రతివారిలో ఒకే తరహా వ్యాధి లక్షణాలు కనిపించవు. అలాగే, వ్యాధి తీవ్రత కూడా రోగులను బట్టి మారుతుంది.

21 ఏళ్ల వయసులో హాకింగ్ ఈ వ్యాధి బారిన పడ్డారు. కానీ, 40 ఏళ్లుగా ఆయన దీనితో పోరాడుతూనే జీవించారు. సుదీర్ఘకాలం ఇలాంటి అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవించడం చాలా గొప్ప విషయంగా అభివర్ణిస్తుంటారు.

ఏఎల్ఎస్ బారినపడ్డ వారిలో కేవలం 5శాతం మందే 10 ఏళ్లకు మించి జీవించగలరని ఒక అంచనా. ''ఈ వ్యాధితో స్టీఫెన్ సుదీర్ఘకాలం జీవించడం నిజంగా అసాధారణం'' అని బ్యారీ తెలిపారు.

Image copyright hawking.org.uk

చికిత్స ఏమైనా ఉందా?

'రిల్యూటెక్' అనే మందును దీని చికిత్సకు ఉపయోగిస్తారు. కేంద్ర నాడీ వ్యవస్థ విడుదల చేసే గ్లుటామేట్ అనే రసాయనాన్ని నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. కానీ, ఈ మందు వల్ల పెద్దగా ప్రభావం ఉండదు.

లిథియం అనే మరో మందు పరీక్షల దశలో ఉంది. ఎలుకలపై సాగించిన పరిశోధనలో ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.

Image copyright hawking.org.uk

హాకింగ్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు ఎలా గుర్తించారు?

హాకింగ్ తన వెబ్‌సైట్‌లో వ్యాధి ఎలా బయటపడిందో ప్రస్తావించారు. ''ఆక్స్‌ఫర్డ్‌లో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు శరీరాన్ని కదిలించడం కష్టమనిపించింది. ఒకసారి అదుపు తప్పి పడిపోయాను. అయితే, కేంబ్రిడ్జ్‌కు వచ్చాకే నా పరిస్థితి అర్థమైంది.

ఆ తర్వాత సంవత్సరం మా నాన్న నా స్థితిని చూసి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లాం. అక్కడే పరీక్షలన్నీ చేశాక నాకు ఈ వ్యాధి ఉన్నట్లు బయటపడింది.'' అని స్టీఫెన్ పేర్కొన్నారు.

Image copyright hawking.org.uk

స్టీఫెన్ ఎలా పోరాడారు?

వ్యాధి బయటపడిన తర్వాత కూడా 1974 వరకు హాకింగ్ తనంతట తానే తినగలిగేవారు. మంచం నుంచి దిగడం, ఎక్కడం చేసేవారు. ఆ సమయంలో భార్య ఆయనకు అండగా నిలిచారు.

1980లలో ఒక నర్సు ఉదయం, సాయంత్రం వచ్చి ఆయనకు సపర్యలు చేసేవారు. 1985లో ఆయనకు శ్వాసకోశ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా విషమించింది. నిరంతరం ఆయనకు నర్సింగ్ సేవలు అవసరమయ్యాయి.

Image copyright AFP

ఆపరేషన్‌కు ముందు ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయేవారు. కొద్దిమందికే ఆయన మాటలు అర్థమయ్యేవి. తాను అనుకున్నది సెక్రటరీకి చెప్పడం ద్వారా పలు విషయాలపై ఆయన పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.

అయితే ఆపరేషన్ అనంతరం ఆయన మాట పూర్తిగా పడిపోయింది. తన వద్ద ఉన్న చిన్న కంప్యూటర్ సహాయంతో, కృత్రిమ గొంతుతో చక్రాల కుర్చీలో కూర్చొని హాకింగ్ మాట్లాడేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)