ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి: ‘‘అంతం ఇప్పుడే ఆరంభమైంది’’ - మమతా బెనర్జీ

  • 14 మార్చి 2018
బీజేపీ కార్యకర్త Image copyright EPA/STR

ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మోదీకి వారసునిగా, భవిష్యత్తులో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది.

ఇటీవలే త్రిపురలో ప్రభుత్వాన్ని స్థాపించి, మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీజేపీ ఈ ఎన్నికలలో ఆధిపత్యం కనబర్చలేదు.

ఫుల్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఎస్పీకి 3,42,796 ఓట్లు లభించగా, బీజేపీకి 2,83,183 ఓట్లు దక్కాయి.

గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీకి చెందిన ప్రవీణ్ నిషాద్, బీజేపీకి చెందిన ఉపేంద్ర దత్ శుక్లాపై 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానంలో ఎస్పీకి 4,56,437 ఓట్లు, బీజేపీకి 4,34,476 ఓట్లు లభించాయి.

యోగి ఆదిత్యనాథ్ 2014లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీ అఖండ విజయం సాధించటంతో ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు గోరఖ్‌పూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి.

అదేవిధంగా.. ఫుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులవ్వటంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు.

అయితే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు తమ సొంత స్థానాల్లో పార్టీని నిలబెట్టుకోలేకపోవటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Image copyright Akhilesh Yadav Twitter

అటు బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికలలో భబువా అసెంబ్లీ స్థానంలో బీజేపీ విజయం సాధించగా, జెహానాబాద్ స్థానాన్ని ఆర్జేడీ గెల్చుకుంది. అరారియా లోక్‌సభ స్థానంలో కూడా ఆర్జేడీ ముందంజలో ఉంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.

ఈ ఫలితాలపై జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అఖిలేశ్ యాదవ్, మాయావతిలకు అభినందనలు తెలిపారు. ‘‘2019 తర్వాత ప్రజల గొప్ప భవిష్యత్తుకు హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘‘గొప్ప విజయం, మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లకు అభినందనలు. అంతం ఇప్పుడే ఆరంభమైంది’’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)