‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి? ఈ దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసమా? మద్రాసు నగరం కోసమా?

 • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
 • బీబీసీ ప్రతినిధి
పొట్టి శ్రీరాములు

ఫొటో సోర్స్, MalleswarBSN/twitter

‘అమరజీవి’గా ప్రాచుర్యం పొందిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసమా? మద్రాసు నగరం కోసమా? చనిపోయే దాకా ఆయన దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి? భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?

పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి, నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారు. ఆయనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదు. కానీ, రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ సమస్య. అప్పటికే అది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. అలాంటి రాజకీయ సమస్య కోసం శ్రీరాములు దీక్ష చేయటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పలు గ్రంథాలు, వ్యాసాలను బట్టి తెలుస్తోంది.

 • స్వాతంత్ర్యం అనంతరం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం తరఫున నిర్మాణ కార్యక్రమ ఆర్గనైజరుగా శ్రీరాములు పనిచేశారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రులకు ప్రత్యేకంగా రాష్ట్రం లేకపోవటం వల్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. కాబట్టి రాజకీయ ప్రవేశం చేయాలని, అయితే అది నిర్మాణం కోసమేనని ఆయన తెలిపారు.
 • మహాత్మా గాంధీతో పాటు దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు శ్రీరాములు. ఆయన అహింస సిద్ధాంతాన్ని బాగా విశ్వసించి, పలుమార్లు ఆచరించి.. విజయం సాధించారు. అదే మార్గంలో దీక్ష చేయాలని నిర్ణయించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం విషయంలో ఆయన (నెహ్రూ) దృష్టికి రాగల వాతావరణాన్ని కల్పించి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకొనే అవకాశం లేకుండా.. తనంతటతానుగా దేశం అంతటి క్షేమాన్ని ఆకాంక్షించి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పూనుకొనే పరిస్థితులను కల్పించవలసిన అవసరం కలుగుతున్నది. దీనిని సాధించటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి హింసాయుతము, రెండు అహింసాయుతము. అహింసలో నమ్మకం ఉన్నవారు తమకు ఏమీ పట్టనట్లు నిద్రబోతే, ఏమీ పని చేయకుండా కూర్చుంటే హింసావాదులయినవారు పూనుకొని పరిష్కార దుస్సాధ్యమైన పరిస్థితులను కల్పిస్తారు.’’ (1952అక్టోబర్ 14వ తేదీన మద్రాసు పౌరులకు, ఇతరులకు పొట్టి శ్రీరాములు చేసిన విజ్ఞప్తిలో కొంత భాగం)

ఫొటో సోర్స్, Fox Photos/Getty Images

ఫొటో క్యాప్షన్,

1950లో మద్రాసు అసెంబ్లీ భవనం

‘‘మద్రాసును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి’’

1952 సెప్టెంబర్ 15వ తేదీన శ్రీరాములు నెల్లూరు నుంచి భాగవతుల లక్ష్మీనారాయణకు ఒక లేఖ రాశారు. అందులో.. ‘‘ఆంధ్ర రాష్ట్ర సమస్య అనేక మందికి, అనేక పార్టీలకు, అనేక అభిప్రాయాలకు, అనేక భావాలకు అనేక రకాలుగా పుట్టిల్లు అయ్యింది. ప్రతి ఒక్కరి స్వార్థమూ వేర్వేరుగా ఉంది. ప్రత్యక్ష ఆర్థిక లాభాలున్నాయి. కాబట్టి అందరూ పరమార్థ దృష్టితో ఆలోచిస్తే తప్ప ఏకాభిప్రాయానికి రాలేరు. అధికారంలో ఉన్న మహా నాయకుల దృష్టి మార్చాలంటే సామాన్యం కాదు. ఇందుకు ఒక్కటే మార్గం కనబడుతోంది. నిష్కామ దృష్టితో, ద్వేష రహితంగా, నిశ్చింతగా ప్రాణాలర్పించటమే. ఇక ఈ సమస్యను ఉపేక్షించటం పాపమని నిన్నే (1952 సెప్టెంబర్ 14) అనిపించింది’’.

తర్వాత 15 రోజులకు భీమవరంలో స్వామి సీతారాంను శ్రీరాములు కలిసి, లక్ష్మీనారాయణకు రాసిన లేఖను, దానితోపాటు పంపించిన ‘ఆంధ్ర రాష్ట్రం’ అనే వ్యాసాన్ని చూపించారు. వీటిని పరిశీలించిన స్వామి సీతారాం అక్టోబర్ 2వ తేదీన శ్రీరాములుకు తన స్పందన తెలియజేస్తూ లేఖ రాశారు. దీక్ష చేయాలన్న శ్రీరాములు నిర్ణయాన్ని అభినందిస్తూనే.. ‘‘ప్రస్తుతానికి మద్రాసు నగర భవిష్యత్తును గూర్చి పట్టుబట్టడం ఉచితం కాదు’’ అని సూచించారు. కానీ, ఆయన సూచనను శ్రీరాములు అంగీకరించలేదు. ‘‘మద్రాసు నగర భవిష్యత్తు నిర్ణయించే బాధ్యతను పండిట్ నెహ్రూకు అప్పగించటానికి వీలులేదు. మద్రాసు నగర పౌరులే ఆ నగరం భవిష్యత్తుని నిర్ణయించాలి. నా దీక్ష వలన మద్రాసు నగరంలోని తమిళ ప్రముఖుల్లో కొందరిలోనైనా హృదయ పరివర్తన ఏర్పడి.. మద్రాసు నగరాన్ని కేంద్ర పాలిత రాష్ట్రంగా ఏర్పరచడానికి వారు అంగీకరించగలరని నేను నమ్ముతున్నాను. ప్రజాభీష్టాన్ని అమలు జరపడమే పండిట్ నెహ్రూ వంతు’’ అని పేర్కొన్నారు.

1952 అక్టోబరు 19వ తేదీన తన దీక్ష ప్రారంభించడానికి ముందు పత్రికలకు శ్రీరాములు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘‘మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం సాధించడానికి తీవ్రమైన కృషి జరగాలి’’ అని పేర్కొన్నారు.

దీక్షను విరమించడానికి రెండు షరతులు పేర్కొన్నారు. అవి..

 • 1) మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం ఏర్పడటం.
 • 2) భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటం.

ఫొటో సోర్స్, PottiSriramuluMemorial

ఫొటో క్యాప్షన్,

దళితులకు దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరులో దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు

‘‘కొత్త రాజధాని కోసం రూ.15-20 కోట్లు ఎందుకు పోసుకోవాలి?’’

మద్రాసు నగరం, అది లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశాలపై పొట్టి శ్రీరాములు ఏమనుకునేవారో ఆయన మేనల్లుడు ఎన్ఆర్ గుప్తా మాటల్లో.. ‘‘మద్రాసు సంగతేమిటని మా మామతో చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చాను. అది ఉమ్మడి సొత్తుగా ఉండాలని ఆయన అనుకుంటూవచ్చారు. మద్రాసు మన సొత్తు కావచ్చు. అయితే, వాళ్లు (తమిళులు) మనం చాలాకాలంగా కలసి ఉంటున్నాము. అలాంటప్పుడు మనల్ని వాళ్లు వెళ్లిపొమ్మంటే ఎంత కష్టపడతామో.. వాళ్లను మనం వెళ్లిపొమ్మన్నా అంత కష్టపడతారు. అందువల్ల ఉమ్మడిగా నగరం చేస్తే బాగుంటుందన్నారు.’’

‘‘మరి నిర్వివాద ప్రాంతాలతో చాలామంది రాష్ట్రం కావాలంటున్నారు కదా! అంటే.. ‘మనం మద్రాసు ఎందుకు వదులుకోవాలి? వేరేచోటకు వెళ్లి మట్టిలోను, ఇటుకల్లోను రూ. 15-20 కోట్లు ఎందుకు పోసుకోవాలి? ఇంత డబ్బు ఎందుకు వృధా చెయ్యాలి? త్వరగా రాష్ట్రం వస్తుందని ఉన్న హక్కు ఎవరైనా వదులుకుంటారా? అసలు ఆ మాటకు వస్తే మద్రాసుపై మనకు ఎక్కువ హక్కు ఉంది. ఇదంతా గుర్తించే ధార్ కమిటీ మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని న్యాయంగా తీర్పు చెప్పింది. మన రాజధాని ఈ నగరంలో వద్దు అని అంతా అంటే నేను ఏమంటా? ఆంధ్ర రాష్ట్రపు రాజధాని వేరేచోట పెట్టుకోవచ్చు. అయితే, ఈ వ్యవహారాన్ని సామరస్యంతో పరిష్కరించుకోవాలి.’’

అయితే, మద్రాసు కోసం ఎందుకు ఉపవాసం చేయటం, విడిచిపెట్టవచ్చు కదా! అని తాను అడిగానని, అందుకు శ్రీరాములు స్పందిస్తూ.. ‘‘నేను చచ్చిపోవాలని చెయ్యడం లేదు. మనకు న్యాయమైన హక్కు ఉన్నదనటం కోసం చేస్తున్నాను. అదివస్తే సంతోషిస్తాను. రాకపోతే చచ్చిపోతాను. నేను పోతే దీన్ని సాధించటానికి ఎవరికైనా అవకాశం ఉండవచ్చు’’ అన్నారని గుప్తా తెలిపారు. (ఆంధ్ర పత్రిక: 18 డిసెంబర్ 1952)

ఫొటో సోర్స్, PottiSriramuluMemorial

మొదటి రోజు 53 కేజీలు.. చివరి రోజు 38 కేజీలు

ప్రకాశం పంతులు మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఉపవాసం చెయ్యడానికి ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే అట్టలు కట్టుకొని, వీధుల్లో తిరిగి ప్రాణాలైనా అర్పిస్తానన్న పట్టుదల గల మనిషి శ్రీరాములు’’. ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు బులుసు సాంబమూర్తి ముందుకొచ్చారు.

దీక్షా కాలంలో శ్రీరాములు పాటించిన దిన చర్యను డాక్టర్ కస్తూరి నారాయణ మూర్తి, డాక్టర్ అవధాని, డాక్టర్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించేవారు. గాంధీజీ తన నిరశన వ్రతాల్లో పాటించిన నియమాలనే ఇంచుమించు శ్రీరాములు కూడా అనుసరించారు.

 • ప్రతిరోజూ నాలుగు నిమ్మకాయల రసం, రెండు చెంచాల ఉప్పు, రెండు చిటికెల సోడా టైకార్బొనేట్, రెండు ఔన్సుల తేనె తీసుకునేవారు.

దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆయన్ను వైద్య బృందం పరీక్షించి, ఆ వివరాలను నమోదు చేసేది. శ్రీరాములు బరువు ఇలా తగ్గుతూ వచ్చింది.

 • మొదటి రోజు - 53.9 కేజీలు, 10వ రోజు - 48.5 కేజీలు, 26వ రోజు - 45.8 కేజీలు, 43వ రోజు - 42.6 కేజీలు, 58వ రోజు - 38.1 కేజీలు. (అమరజీవి సమరగాథ)

పొట్టి శ్రీరాములు

 • మద్రాసు (ప్రస్తుత చెన్నై)లోని జార్జిటౌన్, అన్నాపిళ్లై వీధిలోని 163వ నెంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన పుట్టారు. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లి.. నెల్లూరు జిల్లాలో ఉండేవి.
 • శ్రీరాములు ఫిఫ్త్ ఫార్మ్ వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్‌, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు.
 • గ్రేట్ ఇండియన్ పెనిన్స్యులర్ రైల్వే (ప్రస్తుత సెంట్రల్ రైల్వే)లో అసిస్టెంట్ ప్లంబర్‌గా ఉద్యోగం పొందారు.
 • శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ పిల్లాడు ఐదు రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయ రోగంతో సీతమ్మ మరణించింది.
 • అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్‌లో సబర్మతి ఆశ్రయంలో చేరారు.

ఫొటో సోర్స్, NR Gupta/B.Sriramulu

ఫొటో క్యాప్షన్,

అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భంగా.. తనకు ఎదురవుతున్న సవాళ్లను తెలియజేస్తూ శ్రీరాములు రాసిన లేఖకు సమాధానంగా గాంధీజీ స్వదస్తూరితో ఇచ్చిన జవాబు ఇది. ‘అన్ని విధాలుగా ప్రచారాన్ని కొనసాగించు. కానీ ఇప్పుడే దీక్ష వద్దు’ అని గాంధీ పేర్కొన్నారు

 • వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహారు వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు చేశారు. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటికోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు.
 • ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు.
 • 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
 • డిసెంబర్ 16వ తేదీన రెండెడ్ల బండి మీద కట్టిన రథంపై శ్రీరాములు అంతిమ యాత్ర జరిగింది. కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన.. మాళైలోని ఆర్యవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక పెంకుటిల్లు వరండాలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి తదితరులు శ్రీరాములు గురించి ప్రసంగించారు. ‘‘గాంధీజీ తుపాకీ గుండుకు అసువులు కోల్పోగా, ఆయన బోధించిన సత్యం, అహింసల కోసం శ్రీరాములు ఆత్మ బలిదానం చేశాడు’’ అని ప్రకాశం పంతులు అన్నారు.
 • మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 19వ తేదీన లోక్‌సభలో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు వాంఛూ కమిటీని ఏర్పాటు చేశారు.
 • 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
 • 2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, EdgarThurston/Wikipedia

ఫొటో క్యాప్షన్,

1913లో మద్రాసు ప్రావిన్సు మ్యాప్

ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసిన మొదటి వ్యక్తి శ్రీరాములేనా?

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండు 1920ల కంటే ముందు నుంచే బలంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికే ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మద్రాసు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆంధ్రా సభ్యులు కొందరు లేవనెత్తారు. పలువురు దీక్షలు కూడా చేశారు.. చేస్తున్నారు. అందులో ప్రధానమైనది స్వామి సీతారామ్‌గా ప్రచారం పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రిది. ఆంధ్ర జిల్లాల్లో పర్యటించి, తగినంత చైతన్యం వచ్చిందని భావించిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన ఆశ్రమంలో 1951 ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు నిరాహారదీక్ష చేశారు. వినోబా భావే పిలుపుతో దీక్షను విరమించారు. తర్వాత 1952 మే 25వ తేదీ నుంచి మూడు వారాలపాటు మరోమారు దీక్ష చేసి, మరలా విరమించారు. ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మద్రాసు సెక్రటేరియట్ ఎదుట రిలే సత్యాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి. (అమరజీవి సమరగాథ)

పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీనికి ఐదు రోజుల ముందు మద్రాసు పౌరులకు చేసిన విజ్ఞప్తిలో ఆయన ఇలా పేర్కొన్నారు..

‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని తగినంత ప్రచారం, ఆందోళన, లెక్కల సేకరణ మొదలైనవి ఇప్పటికే జరిగాయి. 1916లోనే ఆంధ్రోద్యమ ప్రచారం ముమ్మరం కావటంతో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర స్థాపన సమస్య అందరి దృష్టినీ ఆకర్షించింది. దానివలన కలిగిన తక్షణ ఫలితం అనిబిసెంటు అధ్యక్షతన 1917 డిసెంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘాన్ని ఏర్పాటు చేయడం. ‘ఆ రాష్ట్ర కాంగ్రెసు సంఘం మదరాసు నగరం మీద తక్కిన మదరాసు రాష్ట్ర కాంగ్రెసు సంఘంతో సమానంగా హక్కు కలిగి ఉంటుంది’ అని ఒక తీర్మానం కూడా ఆ సందర్భంగా ఆమోదించబడింది.’’

‘‘భాషా ప్రాతిపదిక మీద దేశంలోని రాష్ట్రాల పునర్విభజన మహాత్మాగాంధీ నాయకత్వం కింద ఒక జాతీయ కార్యక్రమంగా రూపొంది, 1920 డిసెంబరులో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెసు మహాసభలో దేశంలోని రాష్ట్ర కాంగ్రెసు సంఘాలనన్నిటినీ భాషా ప్రాతిపదిక మీద తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఇతర రాష్ట్ర కాంగ్రెసు సంఘాలతో పాటు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల కాంగ్రెసు సంఘాలు కూడా ఏర్పాటయ్యాయి.’’

ఎ శ్రీనివాసన్ ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు..

‘1912వ సంవత్సరం నాటికే ద్రవిడుల అభివృద్ధి నీడలో ఆంధ్రులు కనిపించట్లేదని తెలుగు నాయకులు, పత్రికలు ఫిర్యాదులు చేస్తూ.. ఈ ఇబ్బందులకు పరిష్కారం ప్రత్యేక ప్రావిన్సు ఏర్పాటేనని తెలిపేవారు. అయితే అప్పటికి మద్రాసు నగరం ప్రధానాంశం కాదు. 1940ల నాటికి పరిస్థితి మారింది. విశాఖపట్నంలో (బహుశా 1941 నవంబర్‌లో) జరిగిన మహాసభలో టంగుటూరి ప్రకాశం మాట్లాడుతూ.. ‘‘మద్రాసు ప్రావిన్సు కేబినెట్ కొన్ని నెలల కిందట సమావేశమై, ఆంధ్రా ప్రావిన్సు ఏర్పాటుపై చర్చించింది. ఈ సమావేశానికి గవర్నర్ ఎర్స్కిన్‌ను కూడా ఆహ్వానించారు. ఆంధ్ర, మద్రాసు ప్రావిన్సులు రెండూ నగరం (మద్రాసు)లోనే ఉంటాయని ఆయన సూచించారు. దీనికి తమిళ మంత్రులు సహా అందరూ అంగీకరించారు. కానీ, కేబినెట్‌లోని ఒక ‘చెడ్డ మేధావి’ ఎర్స్కిన్‌ మనసులో విషబీజాలు నాటాడు. దీంతో ‘ఆంధ్ర ఏర్పాటైతే మద్రాసు వీధుల్లో రక్తం పారుతుంది’ అని ఎర్స్కిన్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు’’ అని చెప్పారు.’

ఫొటో సోర్స్, Baron/Three Lions/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్,

నెహ్రూ, రాజగోపాలాచారి

శ్రీరాములు మరణానికి కారకులెవరు?

పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు. నెహ్రూ తండ్రి నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. నెహ్రూ కూడా బుద్ధిమంతుడే. అయితే, ఈ సందర్భంలో న్యాయంగా ప్రవర్తించలేకపోయారు. 58 రోజులు ఇతను ఉపవాసం చేసినా కదలిక పుట్టలేదు. నెహ్రూ కొంత కాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఆంధ్రపత్రిక)

పొట్టి శ్రీరాములు మరణించటానికి వారం రోజుల ముందు.. 1952 డిసెంబర్ 8వ తేదీన పార్లమెంటు లోక్‌సభలో ప్రధాని నెహ్రూ ఇలా అన్నారు.. ‘‘ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయము తేలికగా చూడరాదు. అయినప్పటికీ ముఖ్య నిర్ణయాలు చేసే విషయంలో ఈ విధంగా ఒత్తిడి తీసుకువచ్చే యెడల పార్లమెంటు అధికారము, ప్రజాస్వామ్య పద్ధతులు అంతమవుతాయి. ఇంతకంటే ఉత్తమ పద్ధతుల ద్వారా, ఇంతకంటే ఎక్కువ సక్రమ పద్ధతుల ద్వారా తన ఆశయాన్ని సాధించాలని ప్రాయోపవేశం చేస్తున్న మహాశయుణ్ణి కోరుతున్నాను.’’

9వ తేదీన మద్రాసు శాసన మండలిలో సభ్యులు డి వెంకట్రావు, వి చక్కరాయచెట్టి, ఎస్ రామకృష్ణయ్య, ఎం సీతారామదాస్ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారిని నిందించారు. ‘ముఖ్యమంత్రి ఒకసారి పొట్టి శ్రీరాములును కలిసి, సవివరంగా మాట్లాడకూడదా?’ అని ప్రశ్నించారు.

దీనికి రాజగోపాలాచారి స్పందిస్తూ.. ‘‘అధ్యక్షా, నేను ఈ నిరాహార దీక్షను అంగీకరించను. నిన్న ప్రధానమంత్రి చెప్పిన విధంగా ముఖ్యమైన తీర్మానాల గురించి ఇలాంటి ఒత్తిళ్లు తీసుకొని వస్తే, వాటికి లొంగిపోతే, ఇక పార్లమెంటు గాని, చట్ట సభలు గాని పనిచేయజాలవు. మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఇచ్చుట జరగని పని. దీనికి వారు ఒప్పుకుంటే, మద్రాసుపై వారి హక్కులు వదులుకుంటే, మద్రాసు వర్తమాన భవిష్యత్తులను గురించి వారు షరతులు పెట్టకపోతే ఆంధ్రరాష్ట్రానికి నేను అనుకూలుడనే. (శ్రీరాములును కలిసేపని).. నా తరపున వెంకట్రావు గారే చేయవచ్చును. దీనికి నా అనుమతి ఇస్తున్నాను. (ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి) నేను అభ్యంతర పెట్టలేదే. మహాత్మా గాంధీ నిరశన వ్రతంతో (శ్రీరాములు దీక్షను) పోల్చటం తగదు. సాంఘీక లేక అంతరాత్మ సంబంధమైన విషయాలలో వారు ఈ ఉపవాసం చేయు విషయం వేరు. ప్రస్తుతాంశం దేశ పరిపాలనకు సంబంధించిన విషయం.’’

శ్రీరాములు చనిపోయిన తర్వాత 1953 మార్చి 12వ తేదీన కౌన్సిల్‌లో దామెర్ల వెంకటరావు మాట్లాడుతూ.. శ్రీరాములు ప్రాణాలను ముఖ్యమంత్రి కాపాడగలిగి ఉండేవారన్నారు. దీనికి రాజగోపాలాచారి స్పందిస్తూ.. ‘‘ప్రధాని నెహ్రూ చేసిన ప్రకటన శ్రీరాముల చుట్టూ చేరిన కఠోర హృదయులకు నచ్చలేదు. వారు శ్రీరాముల మరణాన్ని నివారించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆ నిరశన వ్రతాన్ని ఒక సాధనంగా చేసుకుని ప్రజాస్వామ్య పద్ధతులను అమలు జరపాలని చూసేవారిమీద ఒత్తిడి తీసుకువచ్చారు. నేను చాలా తప్పులు చేసి ఉండవచ్చును. కానీ, ఈ విషయంలో మాత్రం నేను నిర్దోషిని. ప్రధాని నెహ్రూ కూడా నిర్దోషే.’’

వాస్తవానికి శ్రీరాములును దీక్ష విరమించాలని ప్రకృతి వైద్యుడు రామకృష్ణరాజు దీక్ష 50వ రోజున కోరారని, నెహ్రూ ప్రకటన చేయనున్నారని అనుకుంటున్నారని చెప్పగా.. ‘‘ఏదో ఒక ప్రకటనను ఆధారంగా చేసుకుని నేను నా ప్రాణాలను కాపాడుకోదలచుకోలేదు. (నెహ్రూ ప్రకటన) విషయంలో నాకు నమ్మకం లేదు’’ అని శ్రీరాములు అన్నారని ‘హిస్టరీ ఆఫ్ ది ఆంధ్ర మూవ్‌మెంట్’ గ్రంథ రచయిత జీవీ సుబ్బారావు పేర్కొన్నారు.

శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు.’’ (ఆంధ్రపత్రిక)

ఫొటో సోర్స్, Andhrapur/Wikipedia

ఫొటో క్యాప్షన్,

1951 నాటికి భారతదేశంలో వివిధ రాష్ట్రాల నమూనా చిత్రం

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?

భాషాప్రయుక్త రాష్ర్టాలకు బీజం వేసిన వ్యక్తి అనేది పొట్టి శ్రీరాములు గురించిన మరొక పాపులర్ మాట.

శ్రీరాములు మరణానంతరం రాష్ట్ర ఏర్పాటుపైనా, మద్రాసు నగరం ఎవరికి చెందాలనే అంశం పైనా చాలా రాజకీయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో 1949లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భాషా ప్రయుక్త ప్రావిన్సుల ఏర్పాటు అంశంపై ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ‘జేవీపీ రిపోర్టు’గా ప్రచారం పొందింది. ఆంధ్రా ప్రావిన్సు ఏర్పాటు చేయాలని, మద్రాసు మాత్రం అందులో భాగం కారాదని ఈ నివేదిక తెలిపింది. అయితే.. మద్రాసు నగరం మద్రాసు ప్రావిన్సులో భాగం అని కూడా ఎక్కడా పేర్కొనలేదని, అది కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని తదనంతర కాలంలో కమిటీ సభ్యుడు, తెలుగువాడైన పట్టాభి సీతారామయ్య చెప్పారు. మద్రాసును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ.. శ్రీరాములు గురించి ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు..

‘‘దురదృష్టవశాత్తూ ఆంధ్రా బయట ఆయనొక మర్చిపోయిన వ్యక్తి. భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై శ్రీరాములు గణనీయమైన (స్వల్పం కంటే ఎక్కువైన) ప్రభావం చూపారు. ఆయన దీక్ష, దాని తదనంతర పరిణామాలు.. భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పున:చిత్రీకరించాయి. పొట్టి శ్రీరాములు భారతదేశ మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు.‘‘

(పొట్టి శ్రీరాములు - జయంతి: మార్చి 16 .. వర్థంతి: డిసెంబర్ 15)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)