ప్రెస్ రివ్యూ: ఎన్డీఏకు దడ పుట్టిస్తున్న ప్రాంతీయ పార్టీలు

  • 15 మార్చి 2018
ఉత్తర్ ప్రదేశ్ Image copyright FB.com/samajwadiparty

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ పార్టీలు దడ పుట్టిస్తున్నాయంటూ ఈనాడు ఓ కథనం ప్రచురిచింది.

2014 ఎన్నికల్లో భాజపాకి సొంతంగానే ఆధిక్యం లభించినా, ప్రాంతీయ పార్టీల బలంతోనే ఎన్డీఏ విజయం సంపూర్ణమయింది.

కానీ, వివిధ కారణాలతో ఎన్డీఏని ఒక్కొటొక్కటిగా ప్రాంతీయ పార్టీలు విడిపోతుండడం, కొత్తకూటముల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతుండడం బీజేపీని కలవరపరిచే విషయం.

మహారాష్ట్రలో మిత్రపక్షంగా ఉన్న శివసేన భాజపాపై కత్తులు దూస్తోంది. టీడీపీ కేంద్రం నుంచి తమ మంత్రుల్ని ఉపసంహరించుకొంది. దేశవ్యాప్తంగా తృతీయ కూటమి ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప్పు-నిప్పులా ఉండే ఎస్పీ, బీఎస్పీలు తాజా ఉప ఎన్నికల్లో చేతులు కలిపాయి. కాంగ్రెస్‌, భాజపాలకు దూరంగా ఉండాలనేది తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భావన.

బిహార్‌లో జేడీ(యు) భాజపాతో ఎంతవరకు కలిసి ఉంటుందనేది అనుమానమే. ఇలా చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఈనాడు వివరించింది.

Image copyright FB.COM/TelanganaCMO

రూ. 2 లక్షల రుణమాఫీ అసాధ్యం: కేసీఆర్

"రైతులకు రూ. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని కొందరు చెబుతున్నారు. కానీ, అది అసాధ్యం" అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారంటూ ఆంధ్రజ్యోతి పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు 17 వేల కోట్ల రుణాలు ఒకేసారి మాఫీ చేయాలనుకున్నాం.

ప్రధాని, జైట్లీకి నేను 20 లేఖలు రాశా. వాళ్లు ఇవ్వలేదు. అందుకే 4 విడతలుగా మాఫీ చేశాం.

ఇప్పుడు కొందరు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. వాళ్ల జీవితకాలంలో కూడా చేయలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే నెలకు పదిన్నర వేల కోట్లు. అందులో కచ్చితంగా చేయాల్సిన ఖర్చు ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పుణ్యమా అని మన బడ్జెట్‌ నుంచి వారే నెలనెలా కట్‌ చేస్తారు.

ఉద్యోగులు, పింఛనుదారులకు నెలకు రూ.5-6 వేల కోట్ల వరకు చెల్లించాలి. రూ.2 లక్షల రుణం మాఫీ చేయాలంటే 8 నెలల పాటు ఒక్కరూపాయి కూడా ఖర్చుచేయొద్దు. అలా చేయగలమా? అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రశ్నించారు.

Image copyright Getty Images

అక్రమార్కుల భరతం పడతాం: ఆర్‌బీఐ గవర్నర్

వరుసగా వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ మోసాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారంటూ నమస్తే తెలంగాణ ఓ కథనంలో పేర్కొంది.

శివుడు గరళాన్ని మింగినట్లు.. ఆర్బీఐ కూడా అవినీతిని, మోసాలను తుడిచిపెట్టి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని ఉర్జిత్ పటేల్ అన్నారు.

ప్రతీ కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బుధవారం ఆయన ఉపన్యాసం ఇచ్చారు.

బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న మోసాలు, అక్రమాలు తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు.

వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన కొందరు ఇలాంటి చర్యలతో దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా దేవుళ్లు-రాక్షసులు అమృతం కోసం సాగర మథనం చేసినప్పుడు వెలువడిన విషాన్ని పరమేశ్వరుడు ఎలాగైతే మింగేశాడో.. అలాగే అక్రమార్కుల నుంచి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ ఇప్పుడు నడుం బిగించిందన్నారు.

అయితే మోసగాళ్ల భరతం పట్టేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సి ఉందన్నారు.

Image copyright Getty Images

అన్నదాతకు 'రైతులక్ష్మి'

తెలంగాణలో ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇచ్చే పెట్టుబడి పథకానికి 'రైతులక్ష్మి' అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని ఈనాడు తెలిపింది.

ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను ఖరారు చేసి ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధం చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు...

  • ఏప్రిల్ 19, 30, మే 15 తేదీన మూడుసార్లు గ్రామ సభలు పెట్టి రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు.
  • గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)తో పాటు గ్రామ సహాయకుడు గ్రామసభకు హాజరై రైతులను గుర్తించి చెక్కులివ్వాలి.
  • గ్రామసభకు రాని రైతుల చెక్కులను నెలరోజుల వ్యవధిలో తహసీల్దార్‌, వ్యవసాయ సహాయ సంచాలకుని అనుమతితో ఇవ్వాలి. అప్పటికీ రైతు రాకపోతే వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయానికి తిప్పి పంపాలి.
  • రైతు ఆధార్‌ లేదా ఓటరుకార్డు లేదా పట్టాదారు పాసుపుస్తకం చూపితేనే చెక్కు ఇవ్వాలి.
  • ఈ పథకంపై రైతులు ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లోగా పరిష్కరించాలి.
  • చెక్కులు అందిన తరువాత రిజర్వుబ్యాంకు, నాబార్డు నిబంధనల ప్రకారం పక్కాగా ఆడిట్‌ చేయించాలి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)