విజయవాడలోని ఈ కమ్యూనిస్టుల విగ్రహాలు ఏం చెబుతున్నాయి?

  • 15 మార్చి 2018
లెనిన్ విగ్రహం

అధికారం చేతులు మారగానే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు నేలకొరుగుతున్నాయి. తాజాగా త్రిపురలోనూ ఆ పరిస్థితి కనిపించింది.

తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వారి విగ్రహాలను కూల్చేయడం అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న అనేక చారిత్రక విగ్రహాల పరిస్థితి ఏంటని బీబీసీ పరిశీలించింది.

(విజయవాడ విగ్రహాల పై ప్రత్యేక వీడియో కథనం చూడండి)

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకమ్యూనిజం ఆనవాళ్లు

క‌మ్యూనిస్టుల‌కు ఒక‌ప్పుడు కంచుకోట‌గా వెలిగిన విజ‌య‌వాడ‌లో నేటికీ ఆ పార్టీవారి విగ్ర‌హాలు, జెండా స్తంభాలు, ఆన‌వాళ్ళు చెక్కుచెద‌ర‌కుండా ఉన్నాయి.

భార‌త‌దేశంలోని అత్యంత అరుదైన లెనిన్ విగ్ర‌హాల్లో ఒక‌టి విజ‌య‌వాడ‌లో ఉంది. 20 అడుగుల పీఠంపై 12.6 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని ర‌ష్యా ప్ర‌భుత్వం అక్క‌డే త‌యారు చేయించి, ఇక్కడి విగ్ర‌హ క‌మిటీకి బ‌హూక‌రించింది.

సీపీఐ ఆధ్వర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దీన్ని ప్రతిష్టించగా స్థానికంగా చుక్క‌ప‌ల్లి పిచ్చ‌య్య దీనికి స‌హ‌కారం అందించారు.

1987లో అప్ప‌టి ర‌ష్యా ఉపాధ్య‌క్షురాలు వి.య‌స్.షివ్ చెంకో ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ విగ్ర‌హంపై తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల‌తో పాటు ర‌ష్య‌న్ భాష‌లో కూడా ఐ.వి.లెనిన్ అనే పేరు చెక్కి ఉంటుంది.

Image copyright Getty Images

లెనిన్ విగ్ర‌హ‌మే కాదు.. కాస్త దూరంలో కార్ల్ మార్క్స్, ఫ్రెడ‌రిక్ ఏంగిల్స్ విగ్ర‌హాలు కూడా ఒకేచోట క‌నిపిస్తాయి. వీటిని 1988లో ప్ర‌తిష్టించారు. అక్క‌డి ఒక రోడ్డుకు ‘కార్ల్ మార్క్స్ రోడ్’ అని పేరు పెట్ట‌గా, లెనిన్ విగ్ర‌హం ఉన్న కూడ‌లిని ‘లెనిన్ సెంట‌ర్’ అని పిలుస్తారు. ఇవే కాకుండా విజయవాడలో పలు చోట్ల ఇలా లెనిన్ విగ్ర‌హాలు, కొన్ని పెయింటింగ్స్ క‌నిపిస్తాయి.

విజ‌య‌వాడ‌కూ క‌మ్యూనిజానికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. భార‌త‌దేశంలో క‌మ్యూనిస్టు సిద్ధాంతం పురుడుపోసుకున్న‌ప్ప‌టి నుంచి, అందులోని అన్ని భావజాలాలూ, శాఖ‌లూ, పాయలకు అన్నిటికీ వేదికగా ఉండేది విజ‌య‌వాడ‌.

తెలంగాణ సాయుధ పోరాట స‌మ‌యంలో విజ‌య‌వాడ ఆశ్రయ కేంద్రంగా ఉపయోగపడింది. ఇక్క‌డ‌ క‌మ్యూనిజం ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎన్నో కొత్త రాజకీయాల‌కు భూమిక‌గా మారింది.

త‌రవాత విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. కుల రాజకీయాలతో పాటు అనేకానేక పరిణామాలు పరిస్థితుల్లో మార్పులు తెచ్చాయి. క‌మ్యూనిస్టు సిద్ధాంతాల‌ వైపు ఆక‌ర్షితులైన‌వారు కూడా కొత్త దారులు వెతుక్కున్నారు. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో క‌మ్యూనిస్టుల ఉనికి మాత్రం ఉంది. కానీ ఆ పార్టీల ప్ర‌భావం అంతగా లేదు.

కానీ, విజ‌య‌వాడ‌లో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల క‌మ్యూనిజం ఆన‌వాళ్ల‌కు ఏ ఇబ్బందీ క‌ల‌గ‌లేదు. ఆధిప‌త్యాలు, సిద్ధాంతాలు మారినా కూల్చివేత రాజ‌కీయాలు ఇక్క‌డ రాలేదు. అలాగ‌ని ఆ విగ్ర‌హాల వెనకున్న భావజాలం, చరిత్ర అక్క‌డివారికి తెలుసా లేదా అనేది చెప్పలేం!

Image copyright Twitter

"విజ‌య‌వాడ‌లో క‌మ్యూనిస్టులు బ‌లంగా ఉండ‌టానికి కార‌ణం ఇది కార్మిక వ‌ర్గానికి కేంద్రం. రిక్షా, ర‌వాణా రంగ కూలీలు ఎక్కువ ఉండేవారు. వారికి యూనియ‌న్లు వ‌చ్చాయి. దాంతో కమ్యూనిస్టుల‌కు ప్రాతిప‌దిక ఏర్ప‌డింది.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కృష్ణా జిల్లావారు బాగా మ‌ద్ద‌తిచ్చారు. తెలంగాణ ఉద్య‌మకారుల‌కు మ‌ద్ద‌తిస్తున్నార‌న్న కార‌ణంతో అప్ప‌ట్లో నిజాం పోలీసులు ఇక్క‌డ‌కు వ‌చ్చిమరీ కాటూరు, ఎల‌మ‌ర్రు గ్రామ ప్ర‌జ‌ల‌ను కొట్టి వెళ్ళారు.

చండ్ర రాజేశ్వ‌ర‌ రావు, కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య‌, కేజీ స‌త్య‌మూర్తి ఈ జిల్లా వారే. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య ఎక్కువ‌సార్లు గెలిచింది గ‌న్న‌వ‌రం నుంచే. విజ‌య‌వాడ మొద‌టి ఎంపీ హరేంద్ర‌నాథ్ చ‌టోపాధ్యాయ‌. ఆయ‌న స‌రోజినీ దేవి త‌మ్ముడు. విజ‌య‌వాడలో క‌మ్యూనిస్టుల మ‌ద్ద‌తుతోనే ఆయన గెలిచారు" అన్నారు గ‌తంలో క‌మ్యూనిస్టు ఉద్యమాల్లో ప‌నిచేసి ఇప్పుడు ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా ఉన్న రంగావ‌ఝుల భ‌ర‌ద్వాజ‌.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు