గ్రౌండ్ రిపోర్ట్: ‘‘భయపడొద్దమ్మా, జంతువులు నన్నేమీ చేయలేవు’’ అని చెప్పేవాడు

  • 16 మార్చి 2018
పూల మాల వేసిన మధు ఫోటో
చిత్రం శీర్షిక దొంగతనం చేశావంటూ విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు మధును ఆసుపత్రికి తీసుకుపోతుండగా.. జీపులోనే మధు చనిపోయాడు.

ఆ చూపును మరిచిపోవడం కష్టం. సామూహిక చేతనను కలిచివేసిన, కదిలించిన దృశ్యమది. ఆదివాసీ అయినందుకో, మానసిక వికలాంగుడైనందుకో, ఎందుకోగానీ సాటి మనుషుల అమానవీయతకు బలైపోయిన మధు కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాడు.

అక్కడ ఆదివాసీలు ఎలా బతుకుతున్నారు.. మధు అమ్మ ఏం చెబుతున్నారు.. మొత్తంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్ర స్థాయికి వెళ్లింది.

''భోంచేసేటప్పుడు నువ్వే గుర్తొస్తావురా అంటే.. అమ్మా, అడవుల్లో ఉంటున్నానని, కొండ గుహల్లో నిద్రపోతున్నానని నువ్వేం భయపడకు. ఈ జంతువులు నన్నేమీ చేయవులే! అని చెప్పేవాడు''

అంటూ.. కొన్ని నెలల క్రితం కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటూ భోరున ఏడ్చింది ఆ తల్లి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకేరళ గిరిజన యువకుడిని చంపింది ఆకలా? సమాజమా?

ఇంటికి దూరంగా ఆ కొండ గుహల్లో మధు ఉండటం ఆమెకు సుతరామూ ఇష్టం ఉండేది కాదు.

''అడవిలో ఉన్నా.. బాగున్నాను అని వాడు చెబుతుంటే నేను నమ్మేదాన్ని. చివరికి నా కొడుకును దొంగను చేశారు. దొంగ అంటూనే వాడ్ని చంపేశారు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది.. '' అని బీబీసీకి చెప్పారు.

మధు తల్లి పేరు ముల్లి. ఆమె వయసు 56 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక్కగానొక్క కొడుకు మధు.

చిత్రం శీర్షిక ''భోంచేసేటప్పుడు నువ్వే గుర్తొస్తావురా అంటే.. అమ్మా, అడవుల్లో ఉంటున్నానని, కొండ గుహల్లో నిద్రపోతున్నానని నువ్వేం భయపడకు. ఈ జంతువులు నన్నేమీ చేయవులే! అని చెప్పేవాడు''

''వాడు దొంగ కాదు. దొంగతనం వాడికి తెలీదు. వేరొకరి కూడు లాక్కుని తినే అలవాటు మాకు లేదు. వాడికి నిజంగా ఆకలైతే నోరు తెరిచి అడుగుతాడే తప్ప దొంగతనం చేయడు సార్'' అంటూ.. కన్నీళ్లతో తడిసిన మొహాన్ని తుడుచుకుంటూ చెప్పారు ముల్లి.

మధు చనిపోయే ముందు.. ఓ చిన్న సంచితో అడవిలో నడుచుకుంటూ పోతుంటే కొందరు మధును ఆపి, సంచి తెరచి చూశారు. అందులో కొన్ని ఆహార పొట్లాలు కనిపించాయి.

ఈ పొట్లాలను ఎక్కడ దొంగతనం చేశావంటూ విచక్షణారహితంగా కొట్టారు. కొడుతున్నపుడు కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. మధు తీవ్రంగా గాయపడ్డాక పోలీసులకు ఫోన్ చేశారు.

పోలీసులు మధును ఆసుపత్రికి తీసుకుపోతుండగా.. జీపులోనే చనిపోయాడు.

చిత్రం శీర్షిక దొంగతనం చేశావంటూ విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు మధును ఆసుపత్రికి తీసుకుపోతుండగా.. జీపులోనే మధు చనిపోయాడు.

మధు కుటుంబం ఉంటున్న ఆ గిరిజన గ్రామానికి వెళ్లే దారి మరీ ఘోరంగా ఉంది. ఆ గిరిజన ప్రాంతంలో ఏమేర అభివృద్ధి జరిగిందో చూస్తేనే అర్థమైపోతుంది.

పాలక్కడ్ జిల్లా మన్నార్కాడ్ నుంచి ముక్కలికి వెళ్లాక ఎవ్వరైనాసరే.. తమ కారును పక్కన పెట్టి అక్కడ ఉండే బాడుగ జీపుల్లోనే ముందుకు పోవాలి. అక్కడ రోడ్డు అంటూ ఏదీ లేదు.

ఆ బండరాళ్ల గూండా 4-6 కిలోమీటర్లు వెళ్లాక ఓ గిరిజన ఆసుపత్రి కన్పిస్తుంది. దానికి ఎదురుగా ఓ తోవ అడవిలోకి వెళుతుంది. ఆ దారెంబడి వెళ్లి మధు ఇల్లు ఎక్కడంటే ఎవ్వరైనా చెబుతారు.

అది ముల్లి అత్తగారిల్లు. మధు నాన్న మరణించాక పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి చేరారు. పిల్లలు కాస్త పెద్దయ్యాక తిరిగి అత్తారింటికి వచ్చారు.

చిత్రం శీర్షిక ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక్కగానొక్క కొడుకు మధు.

ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి వరకూ చదువుకున్నాడు మధు. ఆ తర్వాత చదువు మానేసి, తేనె, మూలికలు సేకరించడానికి అడవుల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. తాను సేకరించిన వాటిని ‘కురుంబ గిరిజనుల కో-ఆపరేటివ్ సొసైటీ’లో అమ్మేవాడు.

16 ఏళ్ల వయసులో మధు ప్రవర్తనలో మార్పు వచ్చిందని మల్లి చెప్పారు. కాసేపు మౌనంగా ఉండేవాడు. వెంటనే విచిత్రంగా ప్రవర్తించేవాడు. కొజికోడ్‌లోని మానసిక వైద్యశాలలో మధుకు వైద్యం చేయించారు. అక్కడి డాక్టర్లు కొన్ని మందులు రాసిస్తే, వాటిని కొన్నాళ్లు వాడి మానేశాడు.

''అడవుల్లోకి వెళుతూ వెళుతూ ఆ గుహల్లోనే ఉండటం మొదలుపెట్టాడు. వాడు ఓసారి కనిపించకుండాపోతే పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. చివరికి ఏదో గుహలో వాడు పోలీసులకి చిక్కినాడు. ఇంటికి రమ్మంటే రానన్నాడు'' అని మల్లి చెప్పుకొచ్చారు.

''నేనిప్పుడు నెలకు 6వేలు సంపాదిస్తున్నాను. పిల్లలకు రోజూ రెండు పూటలా తిండి పెడుతున్నాను. వాడు అడవిలో ఉన్నా, తిండికి మాత్రం కొదవ లేదు''

చిత్రం శీర్షిక వాడు ఓసారి కనిపించకుండాపోతే.. పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. ఏదో గుహలో వాడు పోలీసులకి చిక్కాడు. ఇంటికి రమ్మంటే రానన్నాడు.

మధును ఎందుకు చంపారు?

''మధు కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అందుకే ఆకలితో అలమటించి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ హాని చేసిన దాఖలాల్లేవు'' అని జిల్లా వైద్యాధికారి డా. ప్రభుదాస్ అన్నారు.

''గిరిజన సంస్కృతిలో ఆహారం పట్ల వారి దృష్టి కోణమే వేరే. ఆహారం ఏ ఒక్కరికో ఇద్దరికో చెందినదని వాళ్లు భావించరు. అందుకే ఎవ్వర్నీ అడక్కుండా ఆహారాన్ని తీసుకోవడం దొంగతనం అని అతనికి తెలియకపోవచ్చు'' అని ప్రభుత్వాధికారి సీమా భాస్కర్ వివరించారు.

ఆ ప్రాంతంలో మానసిక వ్యాధితో బాధపడుతున్నవారు చాలామందే ఉన్నారు.

''జిల్లా మానసికి ఆరోగ్య పథకం కింద మొత్తం 350 మందిని గుర్తించి, వారి పేర్లను రిజిస్టర్ చేశాం. కానీ కేవలం 50మంది మాత్రమే సక్రమంగా చికిత్స పొందుతున్నారు'' అని డా.దాస్ తెలిపారు.

ఒక సామాజిక కార్యకర్త మాట్లాడిన మాటలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

''మధు హత్యకు దారి తీసింది ఆకలి కాదన్నది సుస్పష్టం. బహుశా అతని మానసిక అనారోగ్యం కారణం అయ్యుండొచ్చు. లేదా చట్టవిరుద్ధమైన విషయాన్ని చూసుండొచ్చు. ఎందుకంటే మధు ఉంటున్న గుహకు వెళ్లడం అంత సులభం కాదు. అటవీశాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్లాలంటే పై అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే! అలాంటిది అంతమంది అక్కడకు ఎలా వెళ్లగలిగారు?''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు