ప్రెస్ రివ్యూ: 2019లో బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి?

  • 16 మార్చి 2018
Image copyright Rahul Gandhi/Facebook

ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల విజయం మరోసారి మహాకూటమిపై చర్చకు తెరతీసిందని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం రాత్రి నుంచి వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొంది.

ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఆయన వెల్లడించారు. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శరద్‌పవార్‌తో మాట్లాడారు.

ఈ నెల 28న రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. మహాకూటమి వాస్తవ రూపం దాల్చుతున్నది అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

సోనియాగాంధీ ఇటీవల ఢిల్లీలో ఇచ్చిన విందుకు ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు కోసమే ఆ విందు నిర్వహించినట్టు తెలుస్తున్నది. యూపీ, బీహార్ ఫలితాలు భావసారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యేలా ప్రభావం చూపుతాయని సీపీఐ నాయకుడు డీ రాజా అన్నారు.

అయితే మహాకూటమిపై సాగుతున్న చర్చల గురించి సమాజ్‌వాదీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ మాత్రం వేచి చూడండి అని అన్నారు. ఈ ఫలితాలపై తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని, వారు సంతృప్తి పడితే మరిన్ని ఓట్లు పడుతాయని చెప్పారు.

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని రాహుల్‌గాంధీ గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాన్షీరాం గొప్ప సామాజిక సంస్కర్త అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన స్నేహ హస్తం అందించేవిగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు రాహుల్‌గాంధీ బుధవారం రాత్రి ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా గట్టిపోటీనివ్వాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న శరద్‌పవార్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

Image copyright Soundarya Rajnikanth/Facebook

రజనీకి రాజకీయాల్లో తోడుగా వారసురాలు వస్తోంది?

తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రాజకీయాల్లో సైతం తండ్రికి తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని ‘సాక్షి‘ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన భర్త, నటుడు ధనుష్‌ను తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు ధనుష్‌ అభిమానులు మధురైలో పోస్టర్లు కూడా వేసేశారు.

ధనుష్‌ను రజనీకాంత్‌ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫొటోలతో 'అరసియల్‌ వారిసే' (రాజకీయ వారసుడా) అని పోస్టర్లలో నినాదాన్ని రాశారు. కోలీవుడ్‌లో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. పెద్ద ఎత్తున యువత అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. రజనీకాంత్‌ రాజకీయాలకు ధనుష్‌ తోడైతే రాజకీయ పార్టీకి మరింత ఊపు ఖాయమని అంచనా వేస్తున్నారు.

సాధారణ వ్యక్తిలా తిరిగేందుకు హిమాలయాలకు వచ్చే నేను ఇకపై ఇక్కడ కూడా అలా తిరగడం సాధ్యం కాదని తెలుసుకున్నట్లు నటులు రజనీకాంత్‌ చెప్పారు. రిషికేష్‌లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడి ఇంగ్లీషు చానల్‌ ప్రతినిధితో రజనీకాంత్‌ మాట్లాడారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే జన్మసార్ధకత చేకూరుతుందన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినవారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ దేవుడు నటుడిగా ఇచ్చిన పాత్రను సరిగా పోషించానని, ఇక రాజకీయ నాయకుడిగా కొత్తపాత్రకు నూరుశాతం న్యాయం చేయగలనని నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వాటిని నెరవేర్చేందుకు సిద్ధమన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు