ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?

  • 16 మార్చి 2018
చంద్రబాబు, జగన్ Image copyright Tdp.ncbn/YSJagan

నెలరోజుల్లో అనేక పరిణామాలు. ఎత్తులు పై ఎత్తులతో ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎవరు ఎవరితో బంధం నెరుపుతున్నారో, పైన ఏముందో లోపల ఇంకేముందో తెలీనంతగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇంతకీ జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? అవిశ్వాస తీర్మానాల వెనుక ఉన్న రాజకీయాలేంటి?

నెలరోజుల క్రితం

కేంద్రం నుంచి ఆశించిన సాయం అందట్లేదని తెలుగుదేశం నేతలు తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తు కార్యాచరణకు ప్రాతిపదిక సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. కానీ మిత్రబంధం అయితే కొనసాగుతూ ఉండింది. ఈ లోపు వైసిపి అధ్యక్షుడు జగన్ పాదయాత్రతో జనంలో తిరుగుతూ తెలుగుదేశం బిజెపితో కుమ్మక్కవడం వల్లే ఆంధ్రకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అటు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇటు చంద్రబాబు పాదయాత్రల తర్వాత అధికారంలోకి రావడంతో పాదయాత్ర అనేది అధికార మార్గమనే భావన ఒకటి నెలకొని ఉంది. ప్రత్యేకించి ప్రత్యేకహోదాను లైవ్లీగా ఉంచేందుకు జగన్ ప్రయత్నిస్తూ వస్తున్నారు. ప్రత్యేకహోదా రాకపోతే నష్టమేమీలేదు, ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుంది అని అంతకుముందు ప్రకటించిన తెలుగుదేశం అంచనాలు తప్పినట్టు కనిపించింది.

ప్రత్యేక హోదాను భావోద్వేగపరమైన అంశంగా నిలిపి ఉంచడంలో వైసిపినే కాకుండా అందుకోసం ఏర్పడిన ఇతర సంస్థలు, కాంగ్రెస్ బలంగా ప్రయత్నిస్తూ వచ్చాయి. అపుడపుడు ఏదో ఒక సామాజిక సమస్య గురించి మాట్లాడుతూ అక్కడ పర్యటన జరిపి ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకురావడానికి ప్రెషర్ గ్రూప్ పాత్రకు మాత్రమే పరిమితమైన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో ప్రయాణం సాగిస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం చేతిలో పావు మాత్రమేనని వైసిపిని దెబ్బకొట్టడమే ఆయన లక్ష్యమని జగన్ శిబిరం ప్రచారం చేస్తూ ఉండింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్లాల్సి వస్తుందని అందుకనే కేంద్రంపై గట్టిగా పోరాడకుండా రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ ఆరోపిస్తూ వచ్చారు. దానికి ప్రతిగా వైసిపి అధినేత జగన్ సిబిఐ కేసుల నుంచి బయటపడేందుకు బిజెపితో లోపాయికారీ వ్యవహారం నడుపుతున్నారని అందుకే మోదీ సర్కారును పల్లెత్తుమాట అనకుండా కేవలం తెలుగుదేశాన్ని మాత్రమే నిందిస్తున్నారని టిడిపి నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు.

Image copyright JANASENAPARTY/FACEBOOK
చిత్రం శీర్షిక 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా మోదీ, పవన్

నెలరోజులుగా..

పవన్ కల్యాణ్ హఠాత్తుగా క్రియాశీలకమయ్యారు. తాను చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఎన్ని? ఎన్ని హామీలు నెరవేర్చారు? ఏవి నెరవేర్చలేదు? అనేవి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ సందర్భంగా మాజీ ఎంపి ఉండవల్లి ఒక ప్రతిపాదన తెచ్చారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడితే చర్చ జరుగుతుంది, ఏపీకి జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుంది, కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది అని అన్నారు. పవన్ కల్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్లి వైసిపిపై అస్ర్తంగా విసిరారు. మాట తప్పిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కదా అని ఛాలెంజ్ చేశారు.

వైసిపి దాన్ని అందిపుచ్చుకుంది. తెలుగుదేశం చేయించిన సవాలే అని ఒకవైపు మద్దతుదారులతో ప్రచారం చేయిస్తూనే మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ దాన్ని స్వీకరించారు. ఈ రకంగా బిజెపితో లోపాయికారీ వ్యవహారం అనే తెలుగుదేశం ఆరోపణను తిప్పికొట్టడమే కాక ఆ పార్టీని ఇరుకున పెట్టొచ్చని అనుకున్నారు. అవిశ్వాసం పెడతాం కానీ మద్దతు కూడగడతారా అని ప్రతి సవాల్ విసిరారు. దానికి పవన్ కల్యాణ్ సై అన్నారు. అంతవరకూ తెలుగుదేశం మిత్రుడిగా ఉన్న పవన్ భారీ బహిరంగసభ జరిపి మరీ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. ముఖ్యంగా చంద్రబాబు కుమారుడిపైన అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఒక్కముక్కలో తెలుగుదేశంతో బంధం తెంచుకున్నారు. తాను తెలుగుదేశం చేతిలో పనిముట్టు కాదని స్పష్టం చేసుకునే ప్రయత్నం చేశారు.

వైసిపి అవిశ్వాస తీర్మానం, పవన్ కల్యాణ్‌లో మార్పు తెలుగుదేశంపై ఒత్తిడి పెంచాయి. వైసిపి అవిశ్వాసం ప్రతిపాదన తర్వాత కేంద్రప్రభుత్వం నుంచి వైదొలిగి మంత్రుల చేత రాజీనామాలు చేయించిన తెలుగుదేశం ఇపుడు ఏకంగా ఎన్డీయే నుంచి తప్పుకుంది. ప్రత్యేక హోదా సెంటిమెంటును నిలిపి ఉంచడంలో అటు జగన్, ఇటు పవన్ గట్టిగా ప్రయత్నిస్తూ ఉండడంతో తాను కూడా మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకోక తప్పలేదు. ఇక్కడ రాజకీయం మలుపులు తిరిగింది. తెలుగుదేశంపై ఒత్తిడి పెరిగింది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అందుతుందని అనుకున్నాం, కేంద్రం మోసం చేసింది అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఇపుడు తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు. 2019 ఎన్నికల లోపు పొత్తుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఉన్నప్పటికీ తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి అందర్నీ ఈ పరిణామాలు నెట్టేశాయి. వైసిపి అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అసెంబ్లీలో గురువారం ప్రకటించారు.

అయితే దాని వల్ల వైసిపికి మైలేజ్ పోతుందనే ఆలోచన పెరిగింది. రాత్రి సాగిన మంతనాల వల్ల శుక్రవారం ఉదయానికి వైఖరిలో మార్పు వచ్చింది. తామే సొంతంగా అవిశ్వాసం పెడతామని, వైసిపిని నమ్మలేమని ఇవాళ ఉదయం ప్రకటించారు. విచిత్రమేమిటంటే ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు అధికారిక ప్రకటన రాకముందే అవిశ్వాసం ప్రకటన మాత్రం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్డీయే నుంచి వైదొలుగుదున్నట్టు ప్రకటన ఏదీ రాలేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశాం అన్న సిఎం రమేష్ ప్రకటన తప్ప, పార్టీ నుంచి కానీ.. పార్టీ అధ్యక్షుల నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు.

మొత్తంగా చూస్తే ఆంధ్రుల ప్రయోజనాల కోసం నిజంగా పాటుపడుతున్నది మేమే, మిగిలిన వారివి కేవలం నాటకాలు అని చెప్పుకునేందకు అందరూ పోటీపడుతున్నారు. 2018 చివరిలో జరగొచ్చని భావిస్తున్న పరిణామాలు ముందుకు జరిగాయి. ఆంధ్ర ప్రజల్లో కేంద్రంపై అనుమానాలను వ్యతిరేకతను పెంచడంలో అన్ని పార్టీలు విజయం సాధించాయి. తాము చేయలేకపోయిన పనులకు బిజెపిని బాధ్యురాలిగా చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది. తమ ఒత్తిడి వల్లే తెలుగుదేశం ఈ మాత్రమైనా కదిలింది లేకపోతే ఆంధ్రకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉండేది, ఎవ్వరూ మాట్లాడేవారు కాదు అని మైలేజి పొందడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం, వైసిపి రెండూ నాటకాలు ఆడుతున్నాయి మేము మాత్రమే నిజంగా జనం కోసం ఉన్నాం అని జనసేన కూడా ముందుకెళ్లొచ్చు. ఇదంతా బిజెపి వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా, వాళ్లు దక్షిణాదిలో బలపడడానికి పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారు. జగన్నో పవన్నో ముందుపెట్టి తెలుగుదేశాన్ని దెబ్బకొట్టి తాము బలపడాలని చూస్తున్నారు అని తెలుగుదేశం ఆల్రెడీ ప్రచారం మొదలెట్టింది.

Image copyright Getty Images

ఇపుడేంటి?

ఎవరు అవిశ్వాసం పెట్టినా బిజెపి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. సభలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. కాకపోతే అవిశ్వాసంపై చర్చ జరిగితే ఆంధ్రకు ఇచ్చిన హామీలు, వాటి అమలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా అయితే మారతాయి. కేంద్రంపై ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో బిజెపి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్, లోక్‌సభలో 48 మంది సభ్యులున్న కాంగ్రెస్ ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో తిరిగి బలపడేందుకు ఆ పార్టీ కొంతకాలంగా ప్రత్యేకహోదాను అస్ర్తంగా మార్చుకుని కార్యక్రమాలను రూపొందిస్తున్నది. వీలైనన్ని రూపాల్లో ప్రయత్నిస్తున్నది.

జాతీయ రాజకీయాల వైపు నుంచి చూస్తే బిజెపిపై అసంతృప్తితో ఉన్న శివసేన లాంటి పార్టీలు ఏ వైఖరి తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారుతుంది. ఎవరు ఎటువైపు అనేది తేల్చుకోవాల్సిన సన్నివేశం ఎదురవుతుంది. అసలు సభలో చర్చ జరిగే అవకాశం బిజెపి ఇస్తుందా, ఏదో ఒక గందరగోళాన్ని సాకుగా చూపి సభను పూర్తిగా వాయిదా వేసే అవకాశముందా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందరూ ఒకరిపై ఒకరు పై చేయి చూపడానికి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఏదీ అసాధ్యం అని చెప్పడానికి లేదు.

అవిశ్వాసాల వల్ల జాతీయ స్థాయిలో చర్చ అయితే రేపగలిగారు. కానీ ఎవరి వెనుక ఎవరున్నారు? బిజెపి అంతిమంగా హామీలను నెరవేరుస్తుందా, తాము కోరుకున్న నేతను ముందుపెట్టి వారికి రాజకీయ ప్రయోజనం అందేలా చేస్తుందా అనేవి ప్రస్తుతం ముందుకొస్తున్న వేయి వరహాల ప్రశ్నలు. ఇప్పుడు సాగుతున్న రాజకీయ క్రీడ అయితే మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. అంతిమంగా అది ఏ రూపం తీసుకుంటుంది, ఎవరు ఎంత మేర లాభపడతారు, నష్టపోతారు అనేది ఇప్పుడే చెప్పలేం. పార్టీల ప్రయోజనాల సంగతి సరే, ప్రజలు ఎంత మేర లాభపడతారు అనేది కూడా తేల్చి చెప్పలేం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)