ప్రెస్ రివ్యూ : ఆంధ్రప్రదేశ్ మాట మార్చింది: అరుణ్ జైట్లీ

  • 17 మార్చి 2018

మేం ఎదురు చూస్తూనే ఉన్నాం!

ప్రత్యేక ప్యాకేజీ నిధుల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. నిధులిచ్చే విషయంలో తమవైపు నుంచి ఏవిధమైన ఆలస్యం లేదన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చే విధివిధానాలపై 2016 సెప్టెంబర్‌లోనే అంగీకారం కుదిరిందని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో నిధుల స్వీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందన్నారు.

నాబార్డు ద్వారా నిధులివ్వాలని కోరిందని, అయితే దీనివల్ల ఆర్థికలోటు ఎక్కువై అప్పులు చేయడానికి ఇబ్బంది వస్తుందని జైట్లీ తెలిపారు. అందువల్లే నాబార్డ్‌ నుంచి నిధుల మళ్లింపునకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు.

దీనిపై కార్యాచరణతో వస్తామని ఫిబ్రవరి 7న రాష్ట్ర అధికారులు చెప్పారని, ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. 2015 నుంచి 2020 వరకూ ఏపీకి ఉండే రెవెన్యూ లోటును 14వ ఆర్థిక సంఘం లెక్కించి ఇస్తుందన్నారు.

Image copyright Ncbn / kcr

కేసీఆర్ దారెటు?

తాజా రాజకీయాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎటువైపు వెళుతుందనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోందంటూ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

టీఆర్ఎస్ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేం అవిశ్వాసానికి అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదని ఓ ఎంపీ చెప్పగా.. మద్దతిచ్చే ప్రసక్తే లేదని మరో ఎంపీ చెప్పడం గమనార్హం. ఇక పార్టీ ఎమ్మెల్సీ ఒకరు అవిశ్వాసంపై అధిష్ఠానానిదే నిర్ణయమని చెప్పారు.

నేతల భిన్న ప్రకటనలతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ శుక్రవారం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ..

'మేం అవిశ్వాసానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మా పార్టీ అధిష్టానం రిజర్వేషన్ల సమస్యలపై నిరసన తెలపమని ఆదేశించడంతోనే మేం వెల్‌లోకి వెళుతున్నాం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాం' అని చెప్పారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు హైదరాబాద్‌లో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. అవిశ్వాసానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.

''అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఇది కేవలం రాజకీయ గిమ్మిక్కు. అవిశ్వాస తీర్మానాన్ని గెలిచేంత బలం వారికుందా? ప్రత్యేక హోదాపై కేంద్రంతో చర్చలు జరపాలి. అవిశ్వాసానికి కారణమే కనిపించడం లేదు'' అని కేకే పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు మాత్రం మద్దతిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హైదరాబాద్‌లోని టీఆర్‌‌ఎస్ఎల్పీలో విలేకర్లతో మాట్లాడుతూ.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఎటువైపు ఓటు వేయాలనే అంశంపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇలా నేతలు తలో మాట చెప్పడంతో అసలు అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ వైఖరేంటనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright facebook/janasena

48గంటలు సమయమిస్తున్నా!

గుంటూరులో కలుషిత నీరు తాగి మృతి చెందిన ఘటనపై 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే తానే గుంటూరుకు వచ్చి బంద్ నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించినట్టు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

మృతుల కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పవన్ కల్యాణ్ పరామర్శించారు. గుంటూరులో ఇన్ని ప్రాణాలు పోవడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎప్పుడో వేసిన భూగర్భ డ్రైనేజీలో తాగునీటి పైపులైనులుండడం, కార్పొరేషన్ అధికారుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంవల్లే ఈ అనర్థం జరిగిందన్నారు.

గుంటూరులో తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇవే మరణాలు ఎంపీ, మంత్రుల కుటుంబాల్లో జరిగితే ఇలాగే స్పందిస్తారా అని ప్రశ్నించారు. గుంటూరు నగరపాలక సంస్థకు 8 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదని, మీరు గెలుస్తామనుకుంటేనే ఎన్నికలు పెడతామనడం సరికాదన్నారంటూ సాక్షి పత్రిక కథనం.

Image copyright Screen grab

‘రామసేతుకు హాని జరుగనివ్వం’ : కేంద్రం

జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పురాతన రామసేతు కట్టడానికి ఎలాంటి ప్రమాదంగానీ, నష్టంగానీ జరుగనివ్వమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపినట్టు నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మక సేతుసముద్రం షిప్ చానల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని, అయితే ఈ నిర్మాణం వల్ల రామసేతు కట్టడానికి ప్రమాదం పొంచి ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.

ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, రామసేతు కట్టడానికి హాని జరుగకుండా చర్యలు చేపడుతామని, అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయడానికి సిద్ధమేనని తెలిపింది.

ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. షిప్ చానల్ ప్రాజెక్టు వల్ల రామసేతుకు ప్రమాదం పొంచి ఉన్నదని, దీనిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యా న్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజాన్ని విచారించిన ధర్మాసనం.. కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

కేంద్ర నౌకాయాన శాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ షిప్ చానల్ ప్రాజెక్టు ప్రభావం రామసేతుపై పడనివ్వమని, ఎలాంటి నష్టం జరుగనివ్వమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)