ప్రెస్ రివ్యూ: ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు

  • 18 మార్చి 2018
Image copyright Ncbn / kcr

నేనే రాజు.. నేనే మంత్రి

ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించే సమయంలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశకాలం వరకూ సస్పెండ్ చేయగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు కౌన్సిల్ ఛైర్మన్‌ను గాయపరచారని వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కూడా గత సంవత్సరం నుంచి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం హాజరు కావడంలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంలేదనే కారణంతో వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.

అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు.

కారణాలేవైనప్పటికీ ప్రతిపక్షం ఉంటే ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తుందనే భయంతో రెండు రాష్ట్రాల్లోనూ వారిని లేకుండా చేసినట్టు స్పష్టమవుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగావున్న వైసీపీతో పాటు మొన్నటివరకు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ని బీజేపీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నది.

అయితే వారి సంఖ్యాబలం తక్కువ కావడంతో టీడీపీ పెద్దగా భయపడటంలేదు.

తెలంగాణలోకూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకపోవడంతో బీజేపీ, టీడీపీ, సిపిఐ(యం) సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

వీరి సంఖ్యాబలం కేవలం 8 మాత్రమే.. అని నవతెలంగాణ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

Image copyright kcr/Facebook

కేసీఆర్ ‘ఫ్రంట్’ స్టెప్

ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా తొలి అడుగు వేశారని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్‌.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో భేటీ కావాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం ఆయన కోల్‌కతాకి బయల్దేరి వెళ్లనున్నారు.

రాజ్యసభలో టీఆర్‌ఎస్‌పీపీ నేత కె.కేశవరావు, పలువురు సీనియర్లు కేసీఆర్‌తో పాటు బెంగాల్‌ వెళతారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమయంలో కేకే పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేశారు. మమతతో ఆయనకు పరిచయమే కాకుండా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి.

జాతీయ రాజకీయాల్లోకి వెళతానని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై మొదట మమతనే స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెతో మాత్రమే సమావేశమవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

దేశ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మకమైన మార్పు తదితర అంశాలపై మమతతో చర్చించనున్నారు.

ఫ్రంట్‌ ఏర్పాటు ప్రకటన తర్వాత కేసీఆర్‌ హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కూడా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని ఆంధ్రజ్యోతి కథనం.

Image copyright Dr.Jitendra Singh

విదేశాల్లో ఎంబీబీఎస్‌కు ‘నీట్’ నిబంధనపై విద్యార్థుల ఆందోళన

విదేశాల్లో వైద్య విద్య చదివే విద్యార్థులు సైతం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో ఉతీర్ణత సాధించాలనే నిబంధన వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

2018 మే తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించే వారు కచ్చితంగా నీట్‌ అర్హత సాధించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇటీవల నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి మన దేశంలో ప్రాక్టీస్‌ చేయాలనుకునే వారు ఎంసీఐ నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పేరును ఎంసీఐ తాజాగా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్ట్స్‌)గా మార్చింది.

2018లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసే ప్రతి విద్యార్థీ కచ్చితంగా నెక్ట్స్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దేశ, విదేశాల్లో ఎక్కడ ఎంబీబీఎస్‌ పూర్తి చేసినా నెక్ట్స్‌ ఉత్తీర్ణత సాధిస్తేనే మెడికల్‌ ప్రాక్టిస్‌ చేసే అర్హత ఉంటుంది.

ప్రస్తుత ఎఫ్‌ఎంజీఈ కంటే మరింత పకడ్బందీగా నెక్ట్స్‌ నిర్వహించేందుకు ఎంసీఐ ఏర్పాట్లు చేసింది.

అయితే.. విదేశాలకు వెళ్లే వారికి ముందుగానే నీట్‌ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వర్తింపజేయడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

విదేశాలలోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, అక్కడే స్థిరపడాలనుకునే వారు 'నీట్‌'లో అర్హత సాధించడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.

అలాగే 'నీట్‌'అనేది మన దేశానికి సంబంధించిన పరీక్ష అని, ఇతర దేశాలకు దీన్ని వర్తింపజేయడం తగదని అంటున్నారు.

దేశంలోని 18 వేల మంది విద్యార్థులు ఏటా రష్యా, చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్‌లలో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్తున్నారు.

తెలంగాణ, ఏపీ నుంచి ఏటా 3 వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ కోర్సు చదివేందుకు వెళ్తున్నారని సాక్షి దినపత్రిక కథనం.

Image copyright Getty Images

‘ఫ్రంట్’ సపోర్ట్..!

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే తప్పకుండా మద్దతు ఇవ్వాలని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ డిమాండ్‌ చేశారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

కావేరీ నదీ యాజమాన్య బోర్డు (సీఎంబీ), కావేరీ జలాల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) ఏర్పాటు చేసే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు గాను అన్నాడీఎంకే ఈ అవిశ్వాసానికి మద్దతిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించాలని కోరారు.

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 37 అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే తరఫున ఒక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.

ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఆరు వారాల్లోగా సీఎంబీ, సీడబ్ల్యూఆర్‌సీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిందని స్టాలిన్‌ తెలిపారు.

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాటి ఏర్పాటులో తాత్సారం చేస్తోందని ఆరోపించారు.

కావేరి నదీ జలాల అంశంపై తమిళనాడు ప్రజా ప్రతినిధులు వెళ్తే వారిని కలిసేందుకు ప్రధాని అయిష్టత చూపుతున్నారని స్టాలిన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)