ఉగాది పొలిటికల్ పంచాంగం: ఎన్నికల ముందు జోస్యాలు ఎంత నిజమయ్యాయి?

  • పృథ్వీరాజ్
  • బీబీసీ తెలుగు
జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, ys jagan mohan reddy/facebook

తెలుగు సంవత్సరాది ఉగాది. రాబోయే సంవత్సరంలో తమ తమ ‘రాశి ఫలాలు’ తెలుసుకోవటానికి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయటం దానిని విశ్వసించే వారు పాటించే సంప్రదాయం.

మనుషులకు మాత్రమే కాదు.. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి.. అన్ని రంగాలలో జరగబోయే పరిణామాలను కూడా ఈ పంచాంగాల్లో జోస్యం చెప్పటం పరిపాటిగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటాయి.

ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు బాగా వేడెక్కిన పరిస్థితుల్లో.. నాలుగేళ్ల కిందట 2014 ఎన్నికలకు మందు ఇదే ఉగాది నాడు జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణాల్లో ఎవరేం చెప్పారనేది చూస్తే అవి ఎంతవరకూ నిజమయ్యాయనేది తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 నుంచి 145 సీట్లు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్ర శాస్త్రి.. ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో జోస్యం చెప్పారు. 'వన్ ఇండియా తెలుగు' వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం.. జగన్ పార్టీకి జయనామ సంవత్సరంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. గ్రహగతులన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందులో సగం సీట్లైనా రాలేదు.

ఫొటో సోర్స్, NAra chandra babu naidu/facebook

జయనామ సంవత్సరంలో చంద్రుడే రాజు - మంత్రి కావడంతో అందరికీ జయం కలుగుతుందని దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ పేర్కొన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక కథనం చెప్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో.. అందరికీ మేలు కలుగుతుందని, సమన్యాయ పాలన వస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గెలుస్తుందని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఆ ఎన్నికల్లో 100 పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Telangana CMO/Facebook

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడతాయని కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పంచాంగ శ్రవణంలో జోస్యం చెప్పారు. దేశానికి కాబోయే ప్రధాని నరేంద్రమోదీయేననీ ఆయన పేర్కొన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం చెప్తోంది. మోదీ ప్రధానమంత్రి అయ్యారు కానీ.. రెండు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు సష్టమైన మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఏపీలో టీడీపీ సర్కారులో బీజేపీ చేరింది కాబట్టి దానిని సంకీర్ణంగా లెక్కించే వాళ్లూ ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Rahul gandhi/facebook

అలాగే.. జయనామ సంవత్సరంలో యూపీఏకు అధికార వియోగం కలుగుతుందని, నరేంద్రమోదీకి రాజయోగం లభిస్తుందని.. అయితే వచ్చే లోక్‌సభ ఐదేళ్ల పాటు ఉండదని శ్రీకాళహస్తీస్వర ఆలయ ఆస్థాన జ్యోతిష పండితుడు ములుగు రామలింగ ప్రసాద్ చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, NArendra modi/facebook

కేంద్ర రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా మారుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో అశాంతి ఏర్పడుతుందని, రాజకీయ సమీకరణలు మారతాయని ఆయన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. అలాగే.. భారత్ - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని, పాకిస్తాన్ కంటే చైనా ప్రధాన శత్రువుగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. యూపీఏ ఓడిపోయింది, మోదీకి అధికారం లభించింది.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర కీలకంగా మారిందా? భారత్ - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగిందా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)