పచ్చని ఆకులు తినాల్సిన జింకలు ప్లాస్టిక్ తింటున్నాయ్

  • 18 మార్చి 2018
జింకలు, చెన్నై Image copyright Aarthi Gopalan
చిత్రం శీర్షిక చెత్తను తింటున్న జింకలు

చెన్నైలోని గిండీ నేషనల్ పార్క్ సమీపంలో రోడ్డు పక్కన కుక్కలతో కలిసి చెత్తను తింటున్న జింకల ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎంట్రప్రెన్యూర్, టెకీ అయిన ఆర్తీ గోపాలన్ జింకలు చెత్తను తింటుండడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నగరం అటవీ ప్రాంతాన్ని కూడా మింగేస్తుండడంతో జింకలకు తిండి లేకుండా పోతోంది. దీంతో ఆ జింకలు చెత్తను తింటున్నాయి. కొన్నిసార్లు అవి మెయిన్ రోడ్‌కు మరీ దగ్గరగా వస్తున్నాయి. ఎవరైనా వాటిని రక్షించి గిండీ పార్కుకు తరలించగలరా అని ఆర్తీ తన ఫేస్ బుక్ పోస్టులో రాశారు.

జింకలు చెత్తను తింటుండడం తనను కలచి వేసిందని ఆర్తీ బీబీసీకి తెలిపారు.

Image copyright Aarthi Gopalan
చిత్రం శీర్షిక చెత్తను తింటూ ఆర్తీ కంటపడిన జింకలు

ఆర్తీ పోస్టును కొన్ని వందల మంది షేర్ చేయడంతో అది వన్యప్రాణి సంరక్షకులు, పర్యావరణవేత్తలు, అటవీ అధికారుల దృష్టికి కూడా వచ్చింది.

ప్రస్తుతం ఆ జింకలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెన్నై అటవీ శాఖ అధికారి గీతాంజలి తెలిపారు. అయితే వాటిని పట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు.

''అవి చాలా సున్నితమైన, బాగా భయపడే జంతువులు. వాటిని పట్టుకునే సమయంలో అవి భయపడి గుండెపోటుతో మరణించే ప్రమాదం కూడా ఉంది'' అని ఆమె తెలిపారు.

వాటిని పదిరోజుల్లో పట్టుకుంటామని గీతాంజలి అన్నారు. నాలుగేళ్లలో సుమారు 300 జింకలను రక్షించి వాటిని వండలూర్ జూకు తరలించినట్లు ఆమె తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అడవులు తగ్గిపోతుండడంతో జింకలకు తిండి కరువైపోతోంది

గిండీ హైవేకు దగ్గరలో ఉండే సుమతి, కొన్నిసార్లు వాటిని కుక్కలుగా పొరబడుతుంటామని తెలిపారు. చాలా తరచుగా అవి తమ కంట పడుతుంటాయని వివరించారు. ప్రభుత్వం వాటిని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తరలించాలని ఆమె కోరారు.

జింకలు ఇలా చెత్తను తినడానికి కారణం భవనాల నిర్మాణాల కోసం అడవులను విచక్షణారహితంగా కొట్టివేయడమే కారణమని పర్యావరణవేత్త నిత్యానంద జయరామన్ అభిప్రాయపడ్డారు.

ఆహారం విషయంలో జింక ఆవులాంటివేనని, ఆహారాన్ని తినే క్రమంలో అవి పొరబాటున ప్లాస్టిక్‌ను కూడా మింగేస్తాయని తెలిపారు.

రెండు దశాబ్దాల క్రితం ఐఐటీ క్యాంపస్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటూ ఆయన, ''అప్పట్లో క్యాంపస్ చాలా దట్టంగా ఉండేది. అనేక జంతువులు ఆ చెట్ల మధ్య తిరుగాడేవి. ఇప్పుడు అక్కడంతా కమర్షియల్ ఫుడ్ సెంటర్లు, కొత్త కొత్త భవనాలు నిర్మించారు. అడివి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు. జింకలాంటి ప్రాణులకు గడ్డి కూడా కావాలి. అందువల్ల జింకలను మరోచోటికి తరలించడం కంటే, నిర్మాణాలను నిలిపివేయాలి'' అని ఆయన సూచించారు.

జంతు హక్కుల కార్యకర్త ఆంటోనీ రూబిన్ మద్రాస్ ఐఐటీ నుంచి ఆర్టీఐ ద్వారా రాబట్టిన సమాచారం ప్రకారం, 2013-16 మధ్య కాలంలో క్యాంపస్‌లో వివిధ కారణాలతో 220 జింకలు, 8 కృష్ణ జింకలు మరణించాయి.

''జింకలు మృత్యువాత పడుతున్న విషయాన్ని పరిశీలించాలని నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 2018లో ఎన్జీటీ జడ్జి రిటైర్ కావడంతో ఆ కేసు ఇంకా పెండింగులో ఉంది'' అని రూబిన్ తెలిపారు.

దీనిపై బీబీసీ, ఐఐటీ మద్రాసు అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా మెయిల్ ద్వారా కానీ, మౌఖికంగా కానీ ఎలాంటి సమాధానమూ రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)