సైన్స్ కాంగ్రెస్‌కు దలైలామా ఎందుకు హాజరుకాలేదు?

  • 19 మార్చి 2018
టిబెట్, చైనా, దలైలామా Image copyright Getty Images

1959లో దలైలామా భారతదేశానికి వచ్చినందుకు గుర్తుగా భారతదేశంలోని టిబెటన్లు రెండు కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు. ఒకటి - రాజ్ ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకస్థలం వద్ద సర్వమత సమావేశం. రెండోది - త్యాగరాజ్ స్టేడియంలో 'థాంక్యూ ఇండియా' అన్న సమావేశం.

అయితే మొదటి కార్యక్రమం రద్దు కావడం, రెండో దానిని ధర్మశాల (టిబెటన్ ప్రవాస ప్రభుత్వ ప్రదేశం)కు తరలించడం చూస్తే, ఇది చైనా ఒత్తిడి వల్ల జరిగిందా? దలైలామా, టిబెటన్ ఉద్యమం విషయంలో భారతదేశం ధోరణి మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ అంశంపై భారతదేశంలోని చాలా మంది టిబెటన్ల ప్రతినిధులు తమను తాము నిలువరించుకొని, భారతదేశ దౌత్యపరమైన ఒత్తిళ్లను తాము అర్థం చేసుకోగలమని, నిజానికి మెరుగైన చైనా-భారత సంబంధాల వల్లే టిబెటన్ ఉద్యమానికి మేలు జరుగుతుందని అన్నారు.

కొంతమంది మాత్రం, భారత ప్రభుత్వ విధానాల వల్లే ఒక కార్యక్రమాన్ని రద్దు చేసి, ఇంకోదాన్ని మరో చోటికి తరలించారని పరోక్షంగా సూచించారు.

Image copyright Getty Images

ఇదంతా గతంలో బీజింగ్‌లో భారత రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే కొత్త విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించంతో ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రతినిధులంతా టిబెటన్లు నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన కేబినెట్ కార్యదర్శికి ఒక నోట్ జారీ చేశారు.

గోఖలే ఈ నోట్‌ను తాను ఫిబ్రవరి 28న చైనాకు వెళ్లడానికి వారం రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న రాయడం చూస్తే ఈ పరిణామాల వెనుక చైనా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చైనా నాయకులు భారత్‌ను సందర్శించేప్పుడు టిబెటన్ల విషయంలో ప్రభుత్వ అధికారులు ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం కొత్తేమీ కాకున్నా, ఇది జరిగిన సందర్భమే ప్రత్యేకం.

గతంలో హోమ్ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు 2017 ఏప్రిల్‌లో తవాంగ్‌కు దలైలామాతో కలిసి వెళ్లడమే డోక్లాంలో 73 రోజుల పాటు భారత చైనాల మధ్య ఘర్షణ నెలకొందని వార్తలు వెలువడ్డాయి. అందువల్ల డోక్లాం 2.0ను నివారించడానికే ఇది జరిగిందా?

అయితే టిబెటన్ల కార్యక్రమాలలో విదేశాంగ కార్యదర్శి జోక్యం చేసుకోవడానికి డోక్లాం 2.0 కారణం కాదనే ఇతర అనుమానాలూ ఉన్నాయి.

విదేశాంగ కార్యదర్శి ఫిబ్రవరి 22న ఆ నోట్ విడుదల చేసిన మరుసటి రోజే, చైనా ఉగ్రవాదులకు నిధులను అందించే దేశాలను పర్యవేక్షించే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్)కు వైస్ ఛెయిర్‌గా ఎన్నికైంది. అదే సమయంలో ఫిబ్రవరి 23న భారత్ కోరినట్లుగా చైనా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ను 'గ్రే లిస్ట్'లో చేర్చింది.

Image copyright Getty Images

జైషే మొహమ్మద్ చీఫ్ అజర్ మసూద్‌ను ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో చేర్చాలన్న భారత డిమాండ్‌‌పై రెండేళ్లుగా మౌనం వహిస్తున్న చైనా ఈ నిర్ణయం తీసుకోవడం భారత్‌కు ఊరటనిచ్చేదే. పాకిస్తాన్‌పై చైనా ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా భారత్‌కు సహకరించిందని భావిస్తున్నారు.

చైనా ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ చెయిర్ కావడానికి అమెరికా సహకరించడం, టిబెట్ విషయంలో చైనా కఠిన వైఖరి అవలంబించడాన్ని భారత్ చూసీ చూడనట్లు ఉండడం.. ఇదంతా క్రిడ్ ప్రో కో వ్యవహారం.

1988 డిసెంబర్‌లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చరిత్రాత్మక పర్యటన నుంచి ప్రారంభిస్తే, టిబెట్ చైనాలో అంతర్భాగమని భారతదేశం అంగీకరించింది. మిగతాదంతా ఆ దిశగా జరుగుతున్న చిన్న చిన్న మార్పులే. అందువల్ల ప్రస్తుత బీజింగ్ అనుకూల విధానం కొత్తేమీ కాదు.

1991లో చైనా ప్రీమియర్ లీ పెంగ్ పర్యటన సందర్బంగా కూడా అనేక మంది టిబెటన్లను నిర్బంధించడం, చాలామందిని కొట్టి, లాకప్‌లో వేయడం జరిగింది.

నాటి నుంచి భారతదేశం దలైమామాకు గౌరవాన్ని ఇస్తూ, ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చంటూ కొన్ని మినహాయింపులు ఇస్తూ టిబెటన్లకు కేవలం మాటమాత్రపు సాయం చేస్తోంది.

Image copyright Getty Images

టిబెట్ విషయంలో ఇలా మారింది భారత వైఖరి మాత్రమే కాదు. ఇలాంటి చైనా అనుకూల ధోరణులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.

చైనా, భారతదేశం, టిబెటన్లు - ముగ్గురూ ఈ మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోగలరు. గత కొన్ని రోజులలో జరిగిన పరిణామాలు దీనిని నిరూపిస్తున్నాయి.

మణిపూర్ యూనివర్సిటీలో ప్రారంభమైన సైన్స్ కాంగ్రెస్‌లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ, దలైలామాలను ముఖ్య అతిథులుగా పేర్కొన్నారు. దీంతో మోదీ, దలైలామా ఇద్దరూ వేదికపై ఉంటే చైనా ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

అయితే పర్యవసానాలు ఊహించిన టిబెటన్ నాయకత్వం ముందుగానే దలైలామా ఈ కార్యక్రమంలో పాల్గొనరని ప్రకటించింది. దలైలామా అనారోగ్యం వల్లనో లేదా ఇతర కారణాల వల్లో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకున్నా, విశ్లేషకులు మాత్రం దీని వెనుక ఉన్న కారణాలను పరిశోధించకుండా వదలరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)