ప్రెస్‌రివ్యూ : 70 ఏళ్లుగా ప్రజల జీవితాల్లో మార్పు లేదు - కేసీఆర్

  • 20 మార్చి 2018
కేసీఆర్, మమతా బెనర్జీ Image copyright KalvakuntlaChandrashekarRao/Facebook

ముఖ్యమంత్రి కేసీఆర్, మమతా బెనర్జీల సమావేశం గురించి నమస్తే తెలంగాణ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆందులో..

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును సాధించే లక్ష్యంతో.. ప్రజల కోసం ఏర్పడే అతిపెద్ద ఫెడరల్ ఫ్రంట్ తమదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

ప్రత్యామ్నాయ రాజకీయ పునరేకీకరణపై తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు దేశ రాజకీయాలకు శుభ పరిణామమని మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ శక్తి తెరముందుకు రావాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ మమతకు వివరించారు. రాష్ట్రాలు బలోపేతం కావడం వల్లనే దేశం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. డెబ్భై ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజల జీవితాల్లో అనుకున్నమేర మార్పు రాలేదన్న ఏకాభిప్రాయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇది కేసీఆర్ మమతల అజెండా కాదు : కేసీఆర్

''ఏదో మామూలు పద్ధతుల్లో.. బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్, మమతలకు సంబంధించిన ఎజెండా కాదు. ఇది ప్రజల ఎజెండా. మా ఎజెండా దేశ ప్రజల కోసమనేది మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. ఇది ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ఆలోచనావిధానం. దీనికి గొప్ప ప్రాంతమైన కోల్‌కతాలో అంకురార్పణ జరిగింది'' అని కేసీఆర్ అన్నారు.

నిజమే.. ఆ అవసరం ఉంది : మమత

''ఇది ఒక శుభపరిణామం. రాజకీయాలు నిరంతర ప్రక్రియ. మేము ఇండియాను ఒక దేశంగా ప్రేమిస్తాం. మారుతున్న భారత రాజకీయాల నేపథ్యాన్ని, రైతులు, ఇతర వర్గాలకు చెందిన సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై చర్చించాం. మేం ఇప్పుడే చర్చలు ప్రారంభించాం. నిజమే.. బలమైన ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉన్నది'' అని మమత పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

Image copyright jayadev.galla/Facebook

అన్నా డీఎంకే, టీఆర్ఎస్‌లతో కేంద్రం మ్యాచ్ ఫిక్సింగ్’

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని టీడీపీ ఎంపీలు ఆరోపించినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

తెలంగాణ, తమిళనాడులోని అధికార పార్టీ ఎంపీలతో సభలో ఆందోళన చేయిస్తూ.. తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తోందని టీడీపీ ఎంపీలు విమర్శించారు.

'ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందని మేం అవిశ్వాసం పెట్టాం. కేంద్రం న్యాయం చేయట్లేదనే ఆ రెండు రాష్ట్రాల పార్టీలు కూడా ఆందోళన చేస్తున్నాయి. మేం పెట్టిన అవిశ్వాసాన్ని ఆ రెండు పార్టీలు కేంద్రంపై ఆయుధంగా ఎందుకు వినియోగించుకోవు' అని ఎంపీలు ప్రశ్నించారు.

ఇది చీకటి రోజు : జేసీ దివాకర్ రెడ్డి

10 శాతానికి పైగా సభ్యుల సంతకాలతో అవిశ్వాసం నోటీసు ఇస్తే పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. పార్లమెంటు చరిత్రలో ఇది చీకటి రోజు. తెదేపా అవిశ్వాసం నోటీసుకు మద్దతుగా సోనియాగాంధీతో సహా సుమారు 100 మంది ఎంపీలు లేచి నిలబడినా స్పీకర్‌కు కనిపించలేదు. సభలో జరుగుతున్న పద్ధతిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

వారికీ ఇదే పరిస్థితి రావచ్చు : రామ్మోహన్ నాయుడు

‘‘వెల్‌లో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే, తెరాస పార్టీలతో మాట్లాడి సభను సజావుగా నడిపించే సమర్థత కేంద్రానికి లేదా? ఈ రోజు ఏపీకి పట్టిన గతే రేపు ఆ రెండు రాష్ట్రాలకూ రావచ్చు. ఆ పార్టీలు అవిశ్వాసంపై చర్చకు కలిసి రావాలి’’ అని విమర్శించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Getty Images

కల్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు : కేసీఆర్

అమ్మాయిల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. ఆ కథనంలో..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద ఇంతవరకూ రూ.75,116లను అమ్మాయిలకిస్తోంది. ఇప్పుడు ఆ సాయాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.

మన సమాజంలో పెళ్లి అన్నది ఖర్చుతో కూడుకున్న అంశం. అందులోనూ ఆడపిల్ల పెళ్లి మరింత భారంగా పరిణమించింది. ఇంటి మహాలక్ష్మిగా భావించాల్సిన ఆడపిల్లను గుండెలమీద కుంపటిగా పరిగణించే స్థితికి తల్లిదండ్రులు చేరుకుంటున్నారు.

ఆడపిల్ల పెళ్లి కోసం చేయాల్సిన ఖర్చును తలచుకుని కొందరు తల్లిదండ్రులు భ్రూణ హత్యలకూ పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేసీఆర్ అభిప్రాయపడినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

Image copyright RAM MADHAV/FACEBOOK

నాటకాల్లో చంద్రబాబును మించినవారు లేరు : రామ్‌మాధవ్

సొంతమామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రాజకీయ నాటకాల్లో ఏపీ సీఎం చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు.

సోమవారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఇన్నేళ్లుగా రాజకీయ గిమ్మిక్కులు చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్లపై తామెప్పుడూ సానుకూలంగా ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ రాజకీయ నాటకాలు ఆడుతోందని చెప్పారు.

'అవిశ్వాస తీర్మానానికి మేం భయపడడం లేదు. మాకు పార్లమెంటులో సరిపడా బలం ఉంది. ఏ చర్చకైనా మేం సిద్ధం. టీడీపీ నిర్ణయం కేవలం రాజకీయపరమైనది. మాతో చాలా ఏళ్లుగా కలిసి ఉన్నారు. మా భాగస్వాములుగా ఉన్నారు. కలిసి పనిచేశాం. అకస్మాత్తుగా వాళ్లు కొన్ని సెంటిమెంట్‌ అంశాలను లేవనెత్తుతూ అవిశ్వాస తీర్మానం తెచ్చారు. దీనికి వాళ్లే ఏపీ ప్రజలకు, దేశానికి వివరణ ఇవ్వాలి' అని రాంమాధవ్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు. 'హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాం. కానీ టీడీపీ సెంటిమెంట్‌ పేరుతో డ్రామాలు ఆడుతోంది' అని పేర్కొన్నట్లు సాక్షి దినపత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)