అభిప్రాయం: అసలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే దేశ కాల పరిస్థితులున్నాయా? కెసిఆర్ ఉద్దేశం ఏంటి?

  • 20 మార్చి 2018
Image copyright KCR/Facebook

రాజకీయాల్లో ప్రతి కదలికకు ఒక అర్థం ఉంటుంది. మాట్లాడే భాషకు, వేషానికి అర్థాలుంటాయి. మీరు వెంటేసుకు వెళ్లే మందీ మార్బలానికి కూడా ప్రత్యేక అర్థాలుంటాయి. మీరు ప్రయాణించే వాహనం కూడా ఒక రాజకీయార్థాన్ని చెబుతుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ కోడ్ లాంగ్వేజీలో ఉంటాయి కాబట్టి అందరికీ అంత సులభంగా అర్థం కావు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) సోమవారం కలకత్తా వెళ్లి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రాజకీయ మంతనాలాడారు. ఇలా చెబితే సాధారణ వార్త అవుతుంది. ఇది అందించే సందేశం ఏమీ ఉండదు. వాస్తవం అంత సింపుల్‌గా లేదు. కెసిఆర్ చాలా దర్పంగా కలకత్తా నగరంలో దిగారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులున్నారు. ఎంపీలున్నారు.

ఇక ఆయన ప్రత్యేక విమానంలో చాలా ఆర్భాటంగా కలకత్తా యాత్ర జరిపి సాదాసీదా మమతా బెనర్జీని కలిశారు. తను చేపట్టిన కార్యం విజయవంతం కావాలని ఆయన కుడి చేతికి మంత్ర శక్తి ఉన్న ఒక పట్టీ కూడా కట్టుకుని కలకత్తాలో ప్రత్యక్షమయ్యారు. తన శక్తి సామర్థ్యాలేమిటో, తనకు అందుబాటులో ఎలాంటి వనరులున్నాయో ఆయన తన తొలి రాజకీయ యాత్రలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చల్లో భాగంగా ఆయన మొదట మమతా బెనర్జీని కలవాలనుకోవడం కూడా విశేషమే. మమతా బెనర్జీ బెంగాలీ కాటన్ చీరలో అమాయకురాలిలా కనబడుతూ ఉంటారు. ఖరీదైన కశ్మీరీ, కంచి, పోచంపల్లి పట్టు చీరలో, చెమట చుక్క కనిపించకుండా మేకప్ చేసుకుని నిగనిగలాడుతూ, చుట్టూ ఉన్న వారి కోసం చిరునవ్వులు చిందిస్తూ ఉండే మనిషి కాదు. దానికి తోడు పెద్ద చదువులు చదివినా అలా కనిపించరు. అంత గొప్ప పార్లమెంటరీ వక్త కాదు. కాబట్టి తనకున్న మేధస్సుతో, తెలంగాణ సాధించిన నేపథ్యంతో మొదట ఆమెను ఒప్పిస్తే దాని ప్రభావంతో తన పని సులువవుతుందని కెసిఆర్ భావించి వుండవచ్చు.

Image copyright KCR/Facebook

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కలుపుకుని ఆమె ఒక ఫ్రంట్ కట్టే పనిలో ఉన్నారు. బెంగాల్‌లో ఆమెకు కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువు కాదు. తెలంగాణలో కెసిఆర్‌కు కాంగ్రెస్ ప్రధాన శత్రువు. తెలంగాణలో ఆయన తలపడాల్సింది కాంగ్రెస్ తోనే. ఇక్కడ ఇద్దరి ఉద్దేశాలు వేరు. కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ నినాదంతో వీళ్లిద్దరూ సైద్ధాంతికంగా కలిసే అవకాశాలు చాలా తక్కువ.

నిజానికి కెసిఆర్ ఉన్నట్లుండి 'థర్ఢ్ ఫ్రంటు' అని ప్రకటించారు. కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ అవసరమని, వీలైతే తానే దానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. రెండు మూడు వారాల్లోనే ఈ పని మీద దేశాటన మొదలు పెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక మూడున్నరేళ్లు ఆయన కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కేంద్రం ఢిల్లీకి పరిమితం కావాలన్నారు.

ఇపుడు దేశ రక్షణ, దేశమంతా తిరిగే రైళ్లు, విమానాల వంటి శాఖలు తప్ప మిగతా వ్యవహారాలలో కేంద్రానికి పనిలేదు, రిజర్వేషన్ల వంటి వ్యవహారాలు పూర్తిగా రాష్ట్రాలే చూసుకోవాలనే చర్చ లేవనెత్తారు. గ్రామాల్లో రోడ్లేసేందుకు, పల్లెల్లో ఉపాధి కల్పించేందుకు ప్రధాని పేర పథకాలేమిటని కడిగేశారు. ఇక ఉద్యమం చేయాల్సిందేనని, దీనికి ఫెడరల్ ఫ్రంట్ అవసరమని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో పడ్డారు.

ఇంత అకస్మాత్తుగా, ఎన్నికల మేఘాలు అలుముకుంటున్నపుడు కెసిఆర్ ఇలా ఫెడరల్ ఫ్రంట్ అంటూ అన్నిరాష్ట్రాలు ప్రత్యేక విమానంలో యుద్ధ ప్రాతిపదికన తిరగాలనుకోవడంలో రహస్యమేమిటి? ఈ ప్రశ్న చాలా మందిని పీడిస్తూ ఉంది. ఇపుడు ఫెడరల్ ఫ్రంట్ అవసరముందా? బిజెపియేతర, కాంగ్రెసేతర కూటముల్లో లేని పార్టీలేవయినా ఉన్నాయా? ఉంటే గింటే అవన్నీ ఒక ఫ్రంటుగా ఏర్పడగలవా? అసలు ఫ్రంట్ ఏర్పడే దేశ కాల పరిస్థితులున్నాయా? కెసిఆర్ ఉద్దేశమేమయి ఉంటుంది?

Image copyright KCR/Facebook

ఇపుడు దేశంలో చాలా పార్టీలు అటు బిజెపితోనో, ఇటు కాంగ్రెస్‌తోనో సఖ్యంగా ఉంటున్నాయి. మిగతా పార్టీలు కూడా ఈ పార్టీలతో మొన్నమొన్నటి దాకా కలసి ఉన్నవే. ఏవో ప్రాంతీయ కారణాల వల్ల విడిపోయాయి. మళ్లీ కలవవనుకోలేం. సంకీర్ణ రాజకీయాల వల్ల ఈ పార్టీలన్నీ ఏదో ఒక సమయంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములయి, మంత్రి పదవులతో అధికారం అనుభవించినవే.

బిజెపి లేదా కాంగ్రెస్ కూటముల్లో ఉన్నందునే ప్రాంతీయ పార్టీలే అయినా కేంద్ర కేబినెట్‌లో కూర్చోగలిగాయి. ఇవన్నీ మర్చిపోయి ఇపుడు కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక కూటమిలోకి ఈ పార్టీలు వస్తాయా? ఇలాంటి తెగింపు ప్రదర్శించాల్సిన అగత్యమేముంది?

కెసిఆర్ చేస్తున్న ప్రయత్నం 1980 దశకంలో తెలుగుదేశం సంస్థాపకుడు ఎన్ టి రామారావు చొరవతో ఏర్పాటైన కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని గుర్తు చేస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో రామారావు విజయవంతమయ్యారు. దీనికి నాటి దేశ కాల పరిస్థితులు బాగా సహకరించాయి.

అది ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన కాలం. దేశ నాయకుల్లో ఎక్కువ మంది ఎమర్జెన్సీ బాధితులే. ఇందిరా గాంధీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న కాలం. దానికి తోడు జనతా పార్టీ ప్రయోగం విఫలమయింది. అందువల్ల మరొక ప్రయోగం అవసరమని అంతా భావిస్తున్నారు. నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు.

Image copyright KCR/Facebook

ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు పెరగడంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలుండాలని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు బలంగా నినాదం ఇచ్చారు. ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం ప్రకారం స్వయం ప్రతిపత్తి కోసం అకాలీ ఆందోళన నడుస్తూ ఉంది. దేశవ్యాపితంగా కేంద్రం తీరు మీద వ్యతిరేకత ఉంది.

ఈ ఒత్తిడి వల్ల కేంద్ర రాష్ర సంబంధాలను సమీక్షించేందుకు 1983లో జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా నేతృత్వంలో కమిటీ వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రామారావు ప్రభుత్వం బర్తరఫ్ అయింది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాపిత ఆందోళన వచ్చింది. దీనికి ఇందిరాగాంధీ తలొగ్గారు. ఆయన ఆ కాకలో మండిపడుతున్నారు.

దేశంలోనే బలమయిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం రావడంతో ఆయన ఇచ్చిన కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ నినాదం అందరిని ఆకట్టుకుంది. ఆయన 'కాంగ్రెస్ హాటావో, దేశ బచావో' అని పిలుపీయగానే పొలోమని 14 పార్టీలు విజయవాడలో ఆయన ఏర్పాటుచేసిన సదస్సుకు వచ్చాయి. దేశమంతా ఆయన వైపు చూసింది. ఆందుకే దేవీలాల్ తరఫున హర్యాణా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. దీనితో ఎన్ టి రామారావు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు మారుపేరు అయ్యారు.

కెసిఆర్‌ను ఇంత కాంగ్రెస్ వ్యతిరేకిగా చూడటం కష్టం. దానికి తోడు కాంగ్రెస్‌నో, బిజెపినో బలపరిస్తే, కేంద్రంలో ఒకటో రెండో మంత్రి పదవులు సంపాయించుకోవచ్చని ప్రతి ప్రాంతీయ పార్టీ చూస్తున్నది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎవరికీ ఇపుడు పెద్ద సమస్య కాలేదు. ఇలాంటపుడు కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ అవసరమని ఎంత మంది భావిస్తారు?

ఉత్తరాది రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ వారికి బిజెపి ప్రధాన శత్రువు కాబట్టి కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని వెళ్లాలనుకుంటున్నాయి. దక్షిణాదిన కాంగ్రెస్‌తో సమస్య ఉన్న ప్రాంతీయ నాయకుడు కెసిఆర్. ఎక్కడయినా కాంగ్రెస్ సమస్యగా ఉంటే ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బిజెపితో చేతులు కలిపే ఉన్నాయి. ఆందువల్ల కొత్త ఫ్రంటులోకి ప్రాంతీయ పార్టీలను తీసుకురావాలంటే, కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక కూటమి అనే నినాదం చాలదేమో అనిపిస్తుంది.

Image copyright KCR/Facebook

మరి కెసిఆర్ 'ఫెడరల్ ఫ్రంట్' ఉద్దేశమేమయి ఉంటుంది?

ఒక వేళ ఫెడరల్ ఫ్రంట్ విజయవంతమయితే తెలంగాణ బిడ్డ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న బీజం ఇక్కడి అభిమానుల మెదళ్లలో కెసిఆర్ నాటేశారు. అపుడే చాలా చోట్ల తెలంగాణ బిడ్డ ప్రధాని కావాలని కెసిఆర్ బొమ్మకు పాలతో అభిషేకం చేశారు. తెలంగాణ బిడ్డ ప్రధాని అనే నినాదంతో రెండో దఫా తెలంగాణ సెంటిమెంటు తీసుకురావచ్చని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు. ఈ నాలుగేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం చెప్పినవన్నీ చేయలేకపోయింది.

రాష్ట్రంలో తెలుగుదేశం మాయమైనా, కాంగ్రెస్ బలంగానే ఉంది. అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ వెనక అధికారం పోయిన రెడ్డి కులస్థుల ఆక్రోశం కూడా ఉంది. ఈ మధ్య వాళ్లు కూడ కుల సంఘాల సమావేశాలు పెట్టి రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ బలమయిన ప్రత్యర్థి అయి కూర్చుంది.

మొదటి దఫా ఉద్యమం తీసుకువచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఇపుడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పడం లేదు. కొన్ని వర్గాలలో అసంతృప్తి మొదలయిందని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దీనికి తోడు కొన్ని అవినీతి ఆరోపణలు వినవస్తున్నవి. వీటిని ఎదుర్కోనేందుకు కెసిఆర్‌కు అదనపు బలం అవసరం.

Image copyright kcr/Facebook

రెండో దఫా తెలంగాణ సెంటిమెంట్ ఉప్పెనలా వస్తే రెండో సారి టిఆర్ఎస్ అధికారంలో కొనసాగేందుకు ఉపయోగపడవచ్చు. 'ఇక్కడ టిఆర్ఎస్‌ను పూర్తి మెజారిటీతో గెలిపించండి, అక్కడ తెలంగాణ బిడ్డ ప్రధాని అవుతాడ'ని నమ్మించే ప్రయత్నం ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలో ఉన్నట్లుంది.

ముందు ముందు కెసిఆర్ ఫ్రంట్, పర్యటనలు చర్చనీయాంశమయిపోయి స్థానిక సమస్యల మీది నుంచి దృష్టి 'ఫెడరల్ ఫ్రంటు', 'తెలంగాణ బిడ్డ ప్రధాని' అనే అంశాలకు మీదకు మళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం, ఎన్నికల్లో నెగ్గి, వారసుడు ఐటి మంత్రి కెటి రామారావు ముఖ్యమంత్రిని చేసేందుకు రెండో దఫా సెంటిమెంటును సృష్టించేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఒక ప్రయత్నమేమో అనిపిస్తుంది.

ఇదే సర్వత్రా వినబడుతూ ఉంది. దీనివల్లే కెసిఆర్ ఫ్రంట్ 'స్లోగన్ నేషనల్, అజండా లోకల్' అనిపిస్తుంది.

(రచయిత జె నాగరాజు సీనియర్ పాత్రికేయులు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)