అభిప్రాయం: ఎన్నికల వేళ కర్ణాటకలో 'మైనారిటీ' రాజకీయాలు

  • 20 మార్చి 2018
సిద్ధరామయ్య Image copyright fb.com/CMofKarnataka

మన దేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ప్రధాన చిరునామా అయికూర్చున్నాయి.ఎన్నికలలో గెలిచేందుకు అనేక వ్యూహ ప్రతి వ్యూహాలు. పోలింగ్ బూత్ స్థాయి నుండి అనేక సామాజిక వర్గాలను రకరకాలుగా సమీకరించడం ప్రధానంగా ఎన్నికలలో విజయ సాధనకు మార్గాలు అవుతున్నాయి.

కర్ణాటకలో శాసనసభకు జరగబోతున్న ఎన్నికలు దీనికి మినహాయింపు ఏమీ కాదు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్చి 19న నాలుగు గంటల పాటు వాడివేడిగా సాగిన కేబినెట్ సమావేశం తరువాత.. లింగాయతులకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో తమ ప్రభుత్వం ‘‘లింగాయతుల’’ను (బసవ తత్వాన్ని అనుసరించే) వారిని 1994 కర్ణాటక రాష్ట్ర మైనారిటీ చట్టం సెక్షన్ 2 (డి) కింద అల్పసంఖ్యాక మతంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.

ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచందర్ తమ ప్రభుత్వం లింగాయతులను జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం ద్వారా జాతీయ స్థాయిలో మైనారిటీగా గుర్తించాలని కోరుతుందని చెప్పారు

Image copyright fb.com/CMofKarnataka

ప్రభావం చూపగల సత్తా ఉన్న వారు

2018 మే నెలలో కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయతులు.. మొత్తం 224 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గం. చాలా కాలంగా.. కర్ణాటకలో శైవం పునాదిగా ఉన్న లింగాయతులు తమది ప్రత్యేక మతం అని వాదిస్తూ ఉన్నారు.

స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి ఈ సామజిక వర్గం పైకి ఎదగడం ప్రారంభమయింది. ప్రముఖ రాజనీతి శాస్త్ర పరిశోధకుడు రజనీ కొఠారీ తన ''కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'' పుస్తకంలో దేశంలో ఎదిగి వస్తున్న ప్రముఖ కులాల్లో కర్ణాటకలో లింగాయతులు, ఒక్కలిగలు ఉన్నారని పేర్కొన్నాడు. కర్ణాటకలోని తీర ప్రాంతం మినహాయిస్తే మిగతా అంతటా వీరు తమ రాజకీయ ప్రభావం చూపగల సత్తా ఉన్న వర్గంగా ఎదిగారు.

వీరికి ప్రస్తుతం మత మైనారిటీ హోదా కల్పించడం ద్వారా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందజూస్తున్నది.

ఈ సామజిక వర్గం వారు కాంగ్రెస్‌కు దగ్గర‌గా ఉండే వారు. గత రెండున్నర దశాబ్దాలుగా వీరు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా మారారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ వర్గానికి చెందిన నాయకుడే.

Image copyright MANJUNATH KIRAN/AFP/GETTY IMAGES

చాలా కాలంగా లింగాయత మతస్తులు ప్రత్యేకమైన మత గుర్తింపును ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులు చాలా సందర్భాలలో ఈ ఆలోచనకు మద్దతు తెలిపిన వారే. ఇది బీజేపీ ప్రాతినిధ్యం వహించే 'అఖండ హిందూ' మతం అనే భావనకు పొసగదు. మైనారిటీ హోదా వస్తే భారత రాజ్యాంగంలోని 25, 28, 29, 30 అధికరణల కింద లభించే అనేక సదుపాయాలు పొందవచ్చునని లింగాయత వర్గ పెద్దల భావన.

సిద్దరామయ్య ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నగమోహన్‌దాస్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని గత డిసెంబర్‌లో ఏర్పాటు చేసింది. కమిటీ తన రిపోర్టును ఈ నెలలో ఇచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం వెంటనే ఈ సిఫారసులను ఆమోదించింది.

రాష్ట్ర స్థాయిలో లింగాయతులకు మైనారిటీ హోదా ఇస్తున్నామని ఆచితూచిన మాటలతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్రం స్థాయిలో లింగాయత మతం మైనారిటీ స్థాయిని ఇప్పట్లో అందుకోలేదని తెలిసి.. కేంద్రం ఆ పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఇది రాజకీయ గడుసరితనం.

ఎన్నికల ఎత్తుగడలో భాగంగా లింగాయతులు - వీరశైవ సామాజిక వర్గాల మధ్య గల అంతరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నది. ఐతే ఈ ఎత్తుగడ అనుకున్న ఫలితాలను ఇస్తుందా అన్నది వేచి చూడవలసిందే.

Image copyright GOPICHAND TANDLE

ఏమిటీ లింగాయత మతం?

భారత ఉపఖండంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల భక్తి ఉద్యమ కాలంలో పన్నెండవ శతాబ్దానికి చెందిన వీరశైవ మహా సంస్కర్త బసవేశ్వరుడు. ఆ నాటి వర్ణ వ్యవస్థ, దానిలో గల ఆధిపత్యాలను తిరస్కరించి, కులాల అంచెలతో, పుట్టుకతో వచ్చే హెచ్చుతగ్గులను తిరస్కరించి సామజిక సమానత్వం పునాదిగా, లింగాయత మతాన్ని ప్రారంభించాడు.

శ్రమయే దైవం అని, దేహమే దేవాలయం అని, స్త్రీ పురుషులు సమానం అని, మొత్తంగా పుట్టుక పునాది ఆధిపత్య విలువలతో ఉన్న తన సమకాలీన మత సామజిక స్థితి మీద తిరుగుబాటు చేశాడు. అనుభవ మంటప అనే చర్చా వేదిక ఏర్పాటుచేసి కుల భేదం, లింగ భేదం లేకుండా.. మత, ఆధ్యాత్మిక సాంస్కృతిక, జీవన వ్యవహారానికి సంబధించిన విషయాలను స్వేచ్ఛగా చర్చించుకునే వీలు కల్పించాడు. విగ్రహారాధన స్థానంలో ఇష్ట లింగ ఉపాసన అనే మానసిక ఉపాసనను ప్రవేశాపెట్టాడు బసవన్న.

ఒక్క మాటలో అనాడు అమలులో ఉన్న గురువుల, మఠాల ఆధిపత్యంలో ఉన్న మతాన్ని కాదని.. శివతత్వాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామికత వైపు నడిపిన సంప్రదాయం బసవన తత్వం. వేదాల పవిత్రతను, ప్రామాణికతను, దానికి సంబంధించిన ఆచారాలను తిరస్కరించి సంస్కృత ప్రాధాన్యత లేని కన్నడ భాషలో లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను, సామజిక నీతిని కలిపిన శరణ సాహిత్యాన్ని బసవన సంప్రదాయం సృష్టించింది.

తరువాతి కాలంలో ఈ బసవన సంప్రదాయం కూడా పలు కులాలుగా విడిపోయింది. ఒక అంచనా ప్రకారం లింగాయతుల్లో తొంభై రెండు కులాలు ఉన్నాయి. వారిలో వీర శైవులు ఉన్నారు.

భక్తి ఉద్యమం తరువాత సిక్కు మతం ప్రత్యేక మతంగా రూపు దిద్దుకున్నది. అయితే చాలా పురోగామి స్వభావం ఉండి, వైదిక మత పద్ధతుల నుండి దూరం జరిగినప్పటికీ లింగాయతులను శైవంలో ఒక పాయగా భావించబడటం వలన అది ప్రత్యేక మతంగా బలమైన గుర్తింపును పొందలేకపోయింది. భారత రాజ్యాంగ నిర్మాణ పరిషత్‌లో కూడా లింగాయత మతానికి ప్రత్యేక మతంగా గుర్తింపు ఇవ్వాలని చర్చ జరిగినా అది సాధ్యం కాలేదు.

ముఖ్యంగా వీరశైవ లింగాయతులు తమ మఠాలు బసవన్న కంటే ప్రాచీనం అని పేర్కొంటారు. వీరి పంచాచార్య మఠాలు కాశీ, ఉజ్జయని, శ్రీశైలం, బాలే హొన్నూరు, కేదారనాథ్‌లలో ఉన్నాయి. ఇవి ఇతర హిందూ మతస్తులకూ దర్శనీయ స్థలాలు. బసవన మార్గం నమ్మే వారు ఈ మఠాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు.

మల్లిఖార్జున కల్బుర్గి, గౌరీ లంకేష్‌లు బసవన్న శరణు మార్గానికి, ఈ వీరశైవ మతాలకు పొత్తు కుదరదు అని గట్టిగా విశ్వసించిన వారు కావడం గమనించవలిసిన విషయం. వారి వాదనలు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించే ఏక రూప హిందూ మతం అనే వాదానికి వ్యతిరేకం అని వేరే చెప్పనవసరం లేదు.

Image copyright KPCC

న్యాయపరమైన సవాళ్లు

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉత్తర్వును వ్యతిరేకించే వారు ప్రభుత్వ నిర్ణయం కేవలం రాజకీయాలతో ప్రేరేపితం అయినదని, బసవన్న మార్గం విశాల హిందూ సంప్రదాయాలలో శైవ వాహినిలో అంతర్భాగం అని వాదించే అవకాశం ఉంది.

ఒకవేళ ఎదైనా కారణాల వలన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గితే.. లింగాయత బృందాలు తమ ప్రత్యేకత ప్రాతిపదికను కోర్టు ముందుకు తీసుకుపోవచ్చును. హిందూ మతం అనేది ఒకే పుస్తకం.. ఒకే ప్రవక్త.. ఒకే దైవం అనే భావనల పునాది మీద ఉన్న మతం కాదని, అది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రామకృష్ణ మిషన్ వారు 1995 వరకూ తాము మైనరిటీలం అనే వాదనను వినిపించినా కోర్టును ఒప్పించలేకపోయారు.

ఏది ఏమైనా ఈ నిర్ణయం హిందూ మతం అంటే ఏమిటి? దానికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏమిటి? అన్న చర్చని మరోసారి న్యాయస్థానం ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది.

కర్ణాటకలో ఎన్నికల వేళ తీసుకున్న ఈ నిర్ణయం.. మిగితా కులాల వారికీ, మతాల వారికీ ఒరగబెట్టేది ఏమీ లేదని.. ఇది ఇప్పటికే ఆధిపత్య స్థానంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కింది కులాల మీద, దళితుల మీద, ఎంతో పెత్తనం చేస్తున్న కులానికి ఇస్తున్న కొత్త తాయిలం అన్న భావన కూడా వ్యక్తం అవుతున్నది.

మొన్ననే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలు అందజేస్తుందా లేక పుట్టి ముంచుతుందా అనేది చూడాలి. అయితే.. ఎన్నికల జోస్యులకు మాత్రం చేతినిండా పనికల్పించింది అనిపిస్తున్నది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ట్రంప్‌ ట్వీట్‌కు ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక ట్యాగ్‌ తగిలించిన ట్విటర్‌.. ఈ వివాదానికి కారణమేంటి

కరోనావైరస్: అంటార్కిటికాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ‘భారతి మిషన్’ పరిశోధకులు ఎలా ఉన్నారు?

సైకిల్‌ జ్యోతి: తిన‌డానికీ స‌మ‌యం దొర‌క‌ట్లేదు, బిహార్‌లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి.. ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది

కరోనావైరస్ కేసులు: టాప్‌ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది

పాకిస్తాన్ విమాన ప్రమాదం - ‘జీవితాంతం వెంటాడుతుంది’

వైజాగ్ విమానాశ్రయంలోకి ముగ్గురు ఎల్జీ పాలిమర్స్ నిపుణులు.. దేశం దాటడానికి ఎవరైనా సహకరిస్తున్నారా

ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు