ప్రెస్‌రివ్యూ: ‘టీడీపీ లేకుండా మోదీ ఎక్కడి నుంచి వచ్చారు?’ - చంద్రబాబు

  • 21 మార్చి 2018
మోదీ, చంద్రబాబు Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

'అసలు టీడీపీ లేకుండా మోదీ ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్సేతర భావజాలాన్ని టీడీపీ పెంచడం వల్లే మోదీకి చాన్స్‌ వచ్చింది’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీలోనూ ఇదే అంశంపై ప్రసంగించారు. బీజేపీ, వైసీపీ, జనసేనలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

''పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో చెప్పింది బీజేపీయే కదా! మరి ఇప్పుడెందుకు ఇవ్వరు? రాజకీయ పార్టీలన్నీ అడుగుతున్నా ఎందుకు ఇవ్వరు? నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మీరే ఇబ్బంది పడతారు. గతంలో ఆగస్టు సంక్షోభం... తర్వాత విభజన సంక్షోభం... ఇప్పుడీ సంక్షోభాన్ని చూస్తున్నాం. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టడం సరికాదు. ప్రజలు నాపై సంతోషంగా లేరట. మోదీపట్ల సంతోషంగా ఉన్నారని జగన్‌ చెప్తున్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కీలక సమయంలో పవన్‌ ఎవరి కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? అంతా ప్రజలు గమనిస్తున్నారు. హోదా గురించి మోదీ చెప్పలేదు... యూపీఏ చెప్పిందని పవన్‌ అనడం వెనక అర్థమేంటి? ఆయన ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నారు?'' అని ప్రశ్నించారు.

‘ఎంత తిడితే అంత లాభం’

బీజేపీ, వైసీపీ, జనసేనలు ఎంత తిడితే అంతగా టీడీపీకి లాభమన్నారు. వాళ్లు ఎంత తిడితే... ప్రజల్లో వారిపట్ల అంత కక్ష పెరుగుతుందన్నారు. వైసీపీ, జనసేనలు తనపై విమర్శలు తప్ప... మోదీపై ఈగను కూడా వాలనివ్వడం లేదని ఆరోపించారు. 'అసలు టీడీపీ లేకుండా మోదీ ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్సేతర భావజాలాన్ని టీడీపీ పెంచడం వల్లే మోదీకి చాన్స్‌ వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఒక్కమాట కూడా వాళ్లు అనడం లేదు. ఎవరేం చేస్తున్నారో.. ఏ పార్టీ ఏం చేస్తోందో... నిన్న ఏం మాట్లాడారో... ఈ రోజు ఏం చెప్తున్నారో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Image copyright bura.narsaiah/facebook

‘పక్కింట్లో పెళ్లయితే మన ఇంటికి రంగులేసుకుంటామా?’

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరికీ సామంత రాష్ట్రం కాదన్నారు. రాజకీయ స్వార్థంలో భాగంగా ప్రజల మద్దతు పొందేందుకు ఏపీకి చెందిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై అవిశ్వాసమంటే పిల్లలాట కాదన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్‌ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని విలేకరులు అడగ్గా.. 'పక్కింట్లో పెళ్లయితే మా ఇంట్లో రంగులు ఎందుకేస్తాం' అని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. టీడీపీ తమతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం పెడితే ఎలా మద్దతిస్తామని ప్రశ్నించారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తమ నిరసన అడ్డంకి కాదని వినోద్‌ తెలిపారు. స్పీకర్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్దతిచ్చేవారి పేర్లు అడిగి మరీ చర్చకు తీసుకొచ్చే అవకాశముందన్నారు.

Image copyright Telangana-Prisons/facebook

తెలంగాణ జైళ్ల శాఖ కేరళ థాయ్ మసాజ్ సెంటర్లు

స్వయం సమృద్ధి సాధించడానికి జైళ్ల శాఖ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా జైలును సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ వైద్యశాల, కేరళ థాయ్ మసాజ్ సెంటర్, జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కు, సందర్శకుల వెయిటింగ్ హాలును ప్రారంభించారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఈ సందర్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనేక జైళ్లలో పలు రకాల ఉత్పత్తి కేంద్రాలను స్థాపించామన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైలులో నోట్‌బుక్, ఫినాయిల్, స్టీలు కర్మాగారం వంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా ఆయుర్వేదిక్ వైద్యశాలతో పాటు కేరళ థాయ్ మసాజ్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ మసాజ్ సెంటర్‌లో పక్షవాతం, దీర్ఘకాలిక జబ్బులకు చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యే వైద్య నిపుణులను నియమించి, మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తామని తెలిపారు. జైలు జీవితం గడిపిన వారు వాల్మికిలా మారి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

Image copyright Getty Images

14 ఏళ్ల తర్వాత పీవీని స్మరించుకున్న కాంగ్రెస్

సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ నేతల స్మృతి పథం నుంచి కూడా చెరిగిపోయిన మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావును ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాలు ఒక్కసారిగా తెరపైకి తెచ్చాయి.

ఆర్థిక సంస్కరణల రూప కర్తగా పేరుగాంచిన పివి నరసింహారావు మృతి చెందిన తరువాత దాదాపు పధ్నాలుగేళ్ళపాటు రాజకీయ 'బహిష్క రణ'కు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల సంద ర్భంగా అకస్మాత్తుగా గుర్తు తెచ్చుకుంది అని ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది. అంతకు ముందె న్నడూ కూడా కాంగ్రెస్‌ పోస్టర్లపై కాని, ప్లీనరీ సమావేశాల సందర్భంగా గాని, సంవత్సరాల తరబడి చేసిన తీర్మానాల సమయంలో గాని ఒక్కసారి కూడా కనిపించని పి.వి. 'ఊసు' అకస్మాత్తుగా ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ ప్లీనరీ సమావేశంలో స్మరణకు రావడం విస్మయాన్ని కలి గించక మానదు.

ప్లీనరీ సమావేశాలలో భాగంగా శనివారం ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం సందర్భంగా పి.వి. నర సింహారావు ప్రస్తావన వచ్చింది. 1991 లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా ప్లీనరీ పేర్కొంది. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు నిజంగా చారిత్రాత్మక మైనవి. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చి వేశాయి.'' అంటూ రాజకీయ తీర్మానం పేర్కొంది. అదేవిధంగా విదేశీ విధానానికి సంబంధించి ప్రవేశపెట్టి తీర్మానం కూడా పి.వి. సేవలను కొనియాడింది. సోనియా గాంధీ మాత్రం 2010లో ఒక ప్రసంగం సందర్భంగా పి.వి. గురించి ప్రస్తావించారు. ఆ తరువాత కాలక్రమంలో సంవత్సరాల తరబడి కనీసం ఆయన పుట్టిన రోజు నాడైనా పార్లమెంట్‌లో నివాళులు అర్పించే కార్యక్రమానికి తిలోదకాలు పలికింది.

Image copyright Reuters

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సత్వర అరెస్టులొద్దు

ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం-1989 దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ చట్టం కింద తప్పుడు ఆరోపణలతో అమాయకులను ఇరికించడం, అనవసరంగా అరెస్టులు చేయడం తగదని అభిప్రాయపడింది అని నవ తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదయితే నిందితులను వెంటనే అరెస్టు చేయడం తప్పనిసరి కాదని న్యాయమూర్తులు ఆదర్శ్‌ గోయల్‌, యుయు లలిత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఈ చట్టం కింద ప్రభుత్వ అధికారిపై ఫిర్యాదులు వస్తే.. ముందుగా డీఎస్పీ, ఆపై ర్యాంకు అధికారి నేతృత్వంలో ప్రాథమిక విచారణ చేసి, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి అర్హత ఉందో లేదో తేల్చాలని వెల్లడించింది. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా నిందితులను వెంటనే అరెస్టు చేయడం తప్పనిసరి కాదని తెలిపింది.

ప్రభుత్వోద్యోగిని అరెస్టు చేయాలంటే సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పక తీసుకోవాలని తెలిపింది. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కానట్లయితే.. అతడిని అరెస్టు చేయడానికి సీనియర్‌ ఎస్పీ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడానికి గల కారణాలు, అనుమతుల వివరాలను నిందితుడికి, అతడిని హాజరుపర్చబోయే న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)