అట్రాసిటీ చట్టం: సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న వాదనలు

  • 21 మార్చి 2018
సుప్రీంకోర్టు Image copyright SAJJAD HUSSAIN/AFP/Getty Images

ఎస్‌సీ/ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం కావడం పట్ల సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేస్తూ, ఈ కేసుల్లో తక్షణ అరెస్టు కూడదని స్పష్టం చేసింది. ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరని చెప్పింది.

ప్రాథమిక దర్యాప్తు వారం రోజుల్లోగా పూర్తి కావాలని జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఇచ్చిన తీర్పులో ఆదేశించింది.

ఈ చట్టాన్ని విమర్శించేవారు ఇది దుర్వినియోగమవుతోందని చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.

అయితే ఈ చట్టాన్ని సమర్థించేవారు మాత్రం ఇది తరతరాలుగా దళితులు ఎదుర్కొంటున్న అవమానాలకు అడ్డుకట్ట వేయగల ఆయుధంగా భావిస్తున్నారు. ఈ తీర్పు తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందంటూ అసంతృప్తి వెలిబుచ్చారు.

అట్రాసిటీ చట్టం దుర్వినియోగమవుతున్న ఉదాహరణలున్నంత మాత్రాన దానినే సాధారణీకరించడం సరికాదని నేషనల్ అలయెన్స్ ఆఫ్ దళిత్ ఆర్గనైజేషన్స్ (నాడో)కు చెందిన చార్లెస్ వెస్లీ మీసా బీబీసీతో అన్నారు.

ఈ చట్టం దుర్వినియోగమవుతోందనడానికి సుప్రీంకోర్టు ఏ లెక్కలపై, ఎవరి విశ్లేషణపై ఆధారపడిందో అర్థం కావడం లేదని మానవ హక్కుల కార్యకర్త కార్తిక్ నవయాన్ అన్నారు.

మరోవైపు, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల్లోని ముఖ్యాంశాలు...

1. ఈ చట్టం కింద ఏ వ్యక్తి పైనైనా కేసు నమోదైతే ఏడు రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలి.

2. ప్రాథమిక దర్యాప్తు జరిగినా, కేసు నమోదైనా నిందితుడి అరెస్టు అనివార్యం కాదు.

3. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడిని అరెస్టు చేయడానికి అతడిని ఉద్యోగంలో నియమించిన వ్యక్తి అనుమతి తప్పనిసరి.

4. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే అరెస్టు చేయడానికి ఎస్ఎస్‌పి స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరి.

5. ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిలుకు వీలు లేదు. కోర్టు తన ఆదేశంలో ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద పెట్టిన కేసు దురుద్దేశపూరితంగా పెట్టిందని న్యాయ సమీక్షలో తేలితే ముందస్తు బెయిల్‌కు వీలు ఉంటుంది.

Image copyright Getty Images

ఏమిటీ కేసు?

డాక్టర్ సుభాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఏఎన్ఆర్ కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రకు సంబంధించిన ఈ కేసులో ఎస్‌సీ కులానికి చెందిన ఒక వ్యక్తి తన ఉన్నతాధికారులపై ఈ చట్టం కింద కేసు పెట్టారు.

ఎస్‌సీయేతర కులాలకు చెందిన ఆ అధికారులు తమ వార్షిక నివేదికలో ఆ వ్యక్తిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి వారిపై చర్య తీసుకోవడం కోసం వారి ఉన్నతాధికారిని అనుమతి కోరగా, ఆయన నిరాకరించారు.

దాంతో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎస్‌సీ కులానికి చెందిన ఒక వ్యక్తి గురించి నిజాయతీతో వ్యాఖ్యలు చేయడమే నేరమైతే పని చేయడం కష్టమవుతుందని 'డిఫెన్స్' న్యాయవాదులు వాదించారు.

Image copyright iStock

చట్టం దుర్వినియోగంపై భిన్న వాదనలు

సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ఈ చట్టం దుర్వినియోగానికి సంబంధించి మరోసారి చర్చ మొదలైంది.

'నాడో' ప్రతినిధి చార్లెస్ బీబీసీతో మాట్లాడుతూ చట్టం దుర్వినియోగమవుతోందన్న వాదనలో తప్పు లేదన్నారు. అయితే దానిని సాధారణీకరించడం మాత్రం సరికాదని చెప్పారు.

"దుర్వినియోగం జరుగుతోందన్నది నిజమే, అయితే అందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో 'అగ్ర' కులాలకు చెందిన భూస్వాములు తమ వ్యతిరేకులపై కక్ష తీర్చుకోవడం కోసం కేసులు పెట్టించిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఆ మాటకొస్తే ఇంకా చాలా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అలాగని వాటిని నీరుగార్చలేం కదా" అని చార్లెస్ వ్యాఖ్యానించారు.

ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఊరటనిచ్చేవిగా ఉన్నాయన్నారు. వీటిని గ్రామాల్లో ఉండే అందరికీ వర్తింపజేసే విధంగా ఉత్తర్వులు వస్తే మరింత బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కరుణాకర్ రెడ్డి 2003 నుంచి ఎస్‌సీ/ఎస్‌టీ చట్టాన్ని సవరించాలనే డిమాండ్‌తో పనిచేస్తున్నారు.

"వివక్ష ఎక్కువగా ఉండేది గ్రామాల్లోనే. కానీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది పట్టణాల్లో. కింది ఉద్యోగులు తమ పై ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఈ చట్టాన్ని వాడుకుంటున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. అందుకే ఇందులో మార్పు రావాలని మేం డిమాండ్ చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

Image copyright DOUGLAS E. CURRAN/AFP/Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

'చట్టం స్ఫూర్తికే విఘాతం'

దళితులపై తరతరాలుగా జరుగుతున్న వివక్ష, అవమానాల నేపథ్యంలో ఈ చట్టం ఉనికిలోకి వచ్చిందని హక్కుల కార్యకర్త కార్తీక్ నవయాన్ అన్నారు.

ఈ చట్టం వారికి ఒక రక్షణగా ఉంటుందనీ, ఈ చట్టం ఉందన్న భయంతోనైనా వారిపై జరిగే వివక్ష, దాడులు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నది నిజం కాదా అని ఆయన్ను ప్రశ్నించినపుడు, "దుర్వినియోగం ప్రతి చోటా ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఉదాహరణలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో రెడ్డి కులానికి చెందిన ఒక కాంగ్రెస్ నేత, ఒక టీడీపీ నేత వద్ద దళిత కులాలకు చెందిన ఇద్దరు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తమ డ్రైవర్ల ద్వారా అట్రాసిటీ కేసులు పెట్టించారు. పైపైన చూస్తే ఎస్‌సీలే దీనిని దుర్వినియోగం చేసినట్టు కనిపిస్తుంది. కానీ మూలాల్లోకి వెళ్తే అసలు కారణాలు అర్థమవుతాయి" అని కార్తీక్ తెలిపారు.

దళితులపై అత్యాచారాల కేసుల్లో దోషులకు శిక్షలు పడుతున్న ఉదంతాలు చాలా తక్కువని ఆయన చెప్పారు.

"కీళవెన్మణి నుంచి కారంచేడు, చుండూరుల దాకా ఏ కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. అసలు సమస్య అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కావడం కాదు, అది సరిగా అమలు కాకపోవడమే" అని కార్తీక్ పేర్కొన్నారు.

ఈ చట్టంలోని సెక్షన్ 4 బాధితులకు సత్వర న్యాయాన్ని అందించే విధంగా ఉందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు దాని స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)