మిత్రపక్షాలు రెచ్చిపోవడం సరికాదు : అమిత్ షా

  • 22 మార్చి 2018
Image copyright Getty Images

రెచ్చిపోవడం మంచిది కాదు : అమిత్ షా

ఇంతవరకూ ఏపీకి చాలేనే ఇచ్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నట్లు ఈనాడు పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆ రాష్ట్రానికి గత నాలుగేళ్లలో ఇచ్చినన్ని నిధులను సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి పైసాకూ లెక్క చెబుతామని బుధవారం 'టైమ్స్‌ నౌ' ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఎన్డీయే నుంచి చంద్రబాబును తాము వెళ్లగొట్టలేదని, ఆయనే బయటకు వెళ్లారని వ్యాఖ్యానించారు. కూటమిలో ఇంకా 30 పార్టీలున్నాయని, ఎన్డీయే ఏ మాత్రం బలహీనపడలేదని ధీమా వ్యక్తం చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 300కు పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. చంద్రబాబు వెళ్లటం వల్ల బీజేపీ దక్షిణాది కలలకు ఆటంకం కలిగిందా అన్న ప్రశ్నకు అమిత్‌ షా సమాధానమిస్తూ...అక్కడ ఇంకా బలపడచ్చేమో అన్నారు. మిత్రపక్షాలు ఎవరినీ తాము బయటకు పంపాలని అనుకోలేదని, చంద్రబాబు వెళ్లాలనుకున్నప్పుడు ఎలా ఆపగలమని వ్యాఖ్యానించారు.

‘‘మిత్రపక్షాలు రెచ్చిపోవటం మంచిది కాదన్నది మా భావన. కానీ వారే వెళ్లిపోతే మేమేం చేయగలం. మాకు కేంద్రంలోనూ, యూపీలోనూ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలను ప్రభుత్వంలో చేర్చుకుని వారికి గౌరవాన్ని ఇచ్చాం. అవిశ్వాసానికి మేం భయపడటంలేదు’’ అని అమిత్ షా వివరించినట్లు ఈనాడు కథనం తెలిపింది.

Image copyright Getty Images

‘మేం శత్రువులం కాదు..’

ఎన్డీయే నుంచి టీడీపీ నిష్క్రమణను తొలుత 'లైట్‌'గా తీసుకున్న బీజేపీ వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆ కథనంలో..

ఎన్డీయేకు కటీఫ్‌ చెప్పిన టీడీపీపై బీజేపీ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి ఒకరు మంగళవారం టీడీపీ ఎంపీల్లో కొందరితో మాట్లాడారు.

''టీడీపీని దూరం చేసుకోవాలని మాకు లేదు. మమ్మల్ని శత్రువుగా చూడవద్దు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఆ సమస్య పరిష్కరిస్తాం. హోదాకు సమానమైన ప్రయోజనాలతో ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇవ్వాల్సిన నిధులు కూడా ఇస్తాం అని చెప్పినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

టీడీపీతో మాకు ఇతరత్రా విభేదాలు ఏవీ లేవు. మీకు కూడా వేరే కారణాలు ఉన్నాయని మేం అనుకోవడం లేదు. కేంద్రంలో మీ మంత్రుల రాజీనామాకు ముందు ప్రధాని మీ ముఖ్యమంత్రికి ఫోన్‌ చేసి చర్చలకు రావాలని కోరారు. వస్తే బాగుండేదని ఆయన అన్నారు.

ఈ విషయాలను ఎంపీలు బుధవారం తమ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు.

''ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పారు. వారికి సమయం ఇవ్వాలని మనం ఎంతో సహనంతో నాలుగేళ్లు ఎదురు చూశాం. ఇంకా అవే మాటలు చెబితే ఎలా?

హోదా ఇవ్వడానికి ముందుకు వచ్చి ప్రకటన చేయమనండి. విభజన హామీలన్నీ నెరవేర్చమనండి. స్వాగతిద్దాం. అది తప్ప మరో మాట లేదు. అదే మన వైఖరి'' అని చంద్రబాబు స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Getty Images

జయలలిత బాత్రూంలో కింద పడ్డారు : శశికళ

జయలలిత బాత్రూంలో పడి స్పృహ కోల్పోయాకే ఆమెను హాస్పిటల్‌కు తరలించామని శశికళ తెలిపినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా నిర్ణయించిన తరువాత జయ ఆరోగ్యం క్షీణించిందని, దాంతో ఆమె 2014 నవంబర్ నుంచి 2016 సెప్టెంబర్ మధ్యన దాదాపు 20 మంది డాక్టర్ల వద్ద చికిత్స తీసుకున్నారని శశికళ పేర్కొన్నారు.

జయ మృతిపై నిజనిర్ధరణ కోసం ఏర్పాటైన జస్టిస్ ఆర్ముగసామి కమిషన్‌కు.. 55 పేజీల అఫిడవిట్‌ను శశికళ గతవారం సమర్పించారు.

2016 సెప్టెంబర్ రాత్రి 9 గంటలపుడు జయ తన ఇంట్లో బాత్‌రూమ్‌లో పడి స్పృహ కోల్పోగా తాను తీసుకువెళ్లి మంచంపై పడుకోబెట్టానని. తరువాత ఆమెను అపోలో హాస్పిటల్‌కు తరలించామని, అప్పుడు కూడా ఆమె స్పృహలో లేరని శశికళ అఫిడవిట్‌లో తెలిపారు.

ఆ మరునాడు మాత్రం జయ ఆరోగ్యం బాగుపడి మాట్లాడారని పేర్కొన్నారు. జయ దవాఖానలో ఉండగా నాటి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రెండుసార్లు వచ్చి చూశారని, జయ ఆయనను చూసి చేయి ఊపారని పేర్కొన్నారు.

నాటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై, కార్మికమంత్రి నిలోఫర్ కఫీల్‌తోపాటు, పలువురు మంత్రులు పార్టీ నాయకులు దవాఖానకు వచ్చారని తెలిపారు.

జయ క్రమంగా సాధారణ పోషకాహారం తీసుకొంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేశారని, ఉప ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే అభ్యర్థుల అఫిడవిట్లపై వేలిముద్ర వేసినపుడు జయ స్పృహలోనే ఉన్నట్లు శశికళ అఫిడవిట్‌లో పేర్కొన్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.

Image copyright facebook/kcr

మేం అడిగిందెంత? మీరిచ్చిందెంత?

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు అడిగితే కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారని నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

తాము ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం వద్దకు పోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉండి, పైరవీలు చేస్తేగాని కేంద్రం వద్ద పనులు జరగడం లేదన్నారు.

నిధుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. మన దేశం అప్పు రూ.82 లక్షల కోట్లకు చేరిందని, అందులో మోదీ ప్రభుత్వం రూ. 24 లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడించారు. ఈ అప్పును దుబారా అనగలమా? కేంద్రం బడ్జెట్‌లో మూడో వంతు అప్పులకే పోతుందని సీఎం అన్నారు.

తెలంగాణ అప్పుల పాలైందని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని, రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మాట్లాడటం హాస్యాస్పదమని.. బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే విమర్శలు చేయడం సరికాదన్నారు.

అమెరికా, జపాన్‌ దేశాలు అప్పుల్లో ఉన్నా ప్రపంచాన్ని శాసిస్తున్నాయని చెప్పారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 మధ్యకాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెట్టింది రూ. ఒక లక్ష 29 వేల కోట్లు మాత్రమేనని.. అదే తెలంగాణలో ఈ నాలుగేళ్లలో ఖర్చు చేసింది రూ. ఒక లక్షా 24 వేల కోట్లు అని కేసీఆర్ అన్నారని నవతెలంగాణ కథనాన్ని ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)