మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?

  • 22 మార్చి 2018
Image copyright Getty Images

- ఒక తల్లి పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. ఒక్కడ ఓ ఎగ్జిక్యూటివ్ ఆమె బంధువుల దగ్గరికి వచ్చి ‘స్టెమ్ సెల్ బ్యాంక్’ లాభం గురించి చెప్తూ తమ దగ్గర ‘కార్డ్ బ్లడ్’ దాచుకోవాలని కోరతాడు.

- ఒక విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. వార్షిక పరీక్షలు మొదలవకముందే ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు వస్తుంటాయి. ‘మేం ఫలానా కాలేజీ.. మీ అబ్బాయిని, అమ్మాయిని మా కాలేజీలో చేర్చండి’ అంటూ.

- ఒక ఉద్యోగి వ్యక్తిగత రుణం కోసం ఒక బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. రోజు గడవకముందే వరుసగా ఫోన్ కాల్స్ వస్తాయి. ‘మా బ్యాంకుల్లో అన్ని రకాల అప్పులు తక్కువ వడ్డీకే ఇప్పిస్తాం’ అంటూ.

- ఒక విద్యార్థి కొత్త ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయనేది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తాడు. ఇక అతడు ఫేస్‌బుక్ మొదలుకుని ఏ పేజీ ఓపెన్ చేసినా.. ఆ ఫోన్ అమ్మే వెబ్‌సైట్ల ప్రకటనలు ఊరిస్తూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

ఇలాంటివే ఎన్నో ఉదంతాలు. మనలో చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. బిడ్డ పుట్టకముందే ఎన్నో ఆఫర్లు.. పిల్లాడి స్కూల్ పరీక్షలు మొదలవకముందే కాలేజీల ఫోన్లు.. ఒక బ్యాంకుకు దరఖాస్తు చేస్తే వేరే బ్యాంకుల నుంచి ఈ-మెయిళ్లు.. ఆన్‌లైన్‌లో ఒక సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు.. ఇవన్నీ అసలు ఎలా ముంచెత్తుతాయి?

Image copyright Getty Images

ఒక తల్లి ఏ ఆస్పత్రికి వెళుతోంది? ఏ చికిత్స తీసుకుంటోంది? ఆమె వివరాలేమిటి? ఒక పిల్లవాడు ఏం చదువుతున్నాడు? అతడి పేరు ఏమిటి? వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారి ఫోన్ నంబర్లు ఏమిటి? అడ్రస్ ఎక్కడ? వంటి వివరాలన్నీ ఆ తల్లి, పిల్లవాడు, వారి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు.

అలాగే.. ఒక ఉద్యోగి వివరాలు.. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే వివరాలు అన్నీ కూడా.

ఇలాంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఎంత గోప్యంగా ఉంటోందో పై సంఘటనలే స్పష్టం చేస్తున్నాయి.

‘వ్యక్తిగత సమాచారం’ అనేది ఇప్పుడు అంగడి సరుకు. ఈ సమాచారాన్ని విశ్లేషించి.. మార్కెట్ వ్యూహాలను రూపొందించే డాటా మైనింగ్ అనేది ఓ భారీ వ్యాపారం. అదో వృత్తి నైపుణ్యం.

పుట్టని బిడ్డల వివరాల నుంచి, స్కూళ్లలో విద్యార్థుల జాబితా, ఉద్యోగుల లావాదేవీలు, సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రొఫైళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి సమస్త కార్యకలాపాలనూ వేలాది కళ్లు నిరంతరం నిశితంగా శోధిస్తున్నాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నేడు ఇది వ్యక్తిగతం అనేందుకు ఏదీ మిగలకుండా పోయింది.

నిజానికి భారతీయుల్లో ‘వ్యక్తిగత గోప్యత’ అనే భావన ‘శరీరం, సంసారం’ వంటి చాలా తక్కువ విషయాలకే పరిమితమని చెప్పవచ్చు.

సమాజంలో అత్యధికుల జీవన విధానం బహిరంగమే. ఇక సమాచార గోప్యత అనేది ‘గొప్పవారికి’ ప్రత్యేకమైనదనే అనుకోవడం మామూలే.

అందుకే.. కనుపాపలు, వేలిముద్రల వంటి సమస్త వివరాలనూ సేకరించే ‘ఆధార్‘ పథకం స్వచ్ఛందమని ప్రకటించిన ఆరంభ దశలోనే.. అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కావటంతో అది ఎందుకు అనే ఆలోచనే లేకుండా కోట్లాది మంది నమోదు చేసుకున్నారు.

ఈ ఆధార్ దగ్గరి నుంచే ‘వ్యక్తిగత సమాచార గోప్యత‘ (డాటా ప్రైవసీ) అనే భావన కొంత విస్తృతమైంది. ఇక ఫేస్‌బుక్ వంటి సామాజిక మీడియా విస్తరణతో ‘డాటా ప్రైవసీ’ అనేది లేకుండా పోయింది.

ఇప్పుడిప్పుడే డిజిటల్ లిటరసీ ఉన్న వారిలో దీని మీద అవగాహన పెరుగుతోంది. ఇటీవల ఆధార్ సమాచారం చోరీకి గురవుతోందన్న వార్తలు, తాజాగా ఫేస్‌బుక్ నుంచి కోట్లాది మంది డాటాను సేకరించి ఎన్నికలను, ప్రజాభిప్రాయాన్ని సైతం ప్రభావితం చేశారన్న ఆరోపణలు.. ‘డాటా ప్రైవసీ’ మీద ఆందోళనను మరింత పెంచాయి.

Image copyright uidai

ఆధార్ సమాచారం ఎంతవరకూ గోప్యం?

ఆధార్: ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ప్రాజెక్టు ఇది. సుమారు 131.66 కోట్ల మంది (2017 అంచనా) ప్రజల్లో 2018 మార్చి 15 నాటికి 117.79 కోట్ల మందికి ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు యూఐడీఏఐ చెప్తోంది.

తెలంగాణలో 3,80,42,884 మందికి గాను 3,84,15,935 మందికి; ఆంధ్రప్రదేశ్‌లో 5,23,75,124 మందికి గాను 4,84,70,134 మందికి ఆధార్ ఇచ్చినట్లు ఆ సంస్థ గణాంకాలు పేర్కొన్నాయి.

ఆధార్ నమోదు చేసుకున్న వారి ఐరిస్ (కనుపాప)ల స్కాన్లు, వేలిముద్రల వంటి బయోమెట్రిక్ సమాచారంతో పాటు వారి చిరునామా, విద్య, ఉద్యోగం, ఆర్థిక, సామాజిక, హోదా తదితర వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరిస్తున్నారు.

ఒక్కో వ్యక్తికి 12 అంకెలతో కూడిన ఆధార్ నంబర్ ఒకటి కేటాయిస్తున్నారు. ఈ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదముందని ఈ పథకాన్ని విమర్శిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆధార్ ప్రారంభించినపుడు ఇది స్వచ్ఛందమేనని, నిర్బంధం కాదని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రాయితీ పథకాలను అమలు చేయటానికి లబ్ధిదారులు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

అలాగే.. ఆదాయ పన్ను ఎగవేతను అరికట్టటం, నల్లధనం వెలికితీత కోసం పాన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది.

ఇందుకు మార్చి 31వ తేదీని తుది గడువుగా కూడా ప్రకటించింది. ఈమేరకు 2018 మార్చి 5వ తేదీ నాటికి దేశంలో 87.79 కోట్లకు బ్యాంకు అకౌంట్లకు, 16.65 కోట్లకు పైగా పాన్‌లకు ఆధార్‌ను అనుసంధానం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం మార్చి 9న పార్లమెంటులో వెల్లడించింది.

Image copyright Getty Images

వ్యక్తిగత గోప్యత ప్రాధమిక హక్కు

ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు దీని అనుసంధానం తప్పనిసరి చేయటం మీద అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్ సమాచారం లీకైతే.. వ్యక్తుల సామాజిక, ఆర్ధిక ప్రొఫైళ్లను రూపొందించి దుర్వినియోగం చేసే అవకాశముందని పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం 2017 ఆగస్టులో కీలక తీర్పు ఇస్తూ.. వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాధమిక హక్కు అని స్పష్టంచేసింది.

ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలను అరికట్టటంలో భాగంగా యూజర్లు ఆధార్ మీద ఉన్న పేర్లను ఉపయోగించాలని ఫేస్‌బుక్ సూచించటం ఏడాది చివర్లో కలకలం రేకెత్తించింది.

అయితే.. ఇది కేవలం యూజర్ అసలు పేరుతో వారి వారి బంధుమిత్రులు గుర్తుపట్టటం సులభమవతుందని ప్రయోగాత్మకంగా చేపట్టిన చర్యేనని, అది కూడా తప్పనిసరి కాదని, ఆధార్ నంబర్‌తో వాలిడేషన్ వంటిదేమీ లేదని, ఆ ప్రయోగం కూడా ముగిసిందని ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.

ఆధార్‌లోని ప్రజల వ్యక్తిగత వివరాలను రూ. 500 కే అమ్మేస్తున్నారని ఈ ఏడాది జనవరిలో ‘ట్రిబ్యూన్’ పత్రికలో వెలువడిన కథనం సంచలనం సృష్టించింది.

కేవలం రూ. 300 చెల్లించి ఆధార్ ఉన్న ఎవరి వివరాలనైనా ఫోన్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్, ఫొటో వంటి సమాచారాన్ని తస్కరించవచ్చునని ఆ కథనం పేర్కొంది.

ఆ కథనం తప్పని పేర్కొన్న ప్రభుత్వం.. ఐరిస్, వేలిముద్రల సమాచారానికి ఎలాంటి ముప్పూ లేదని భరోసా ఇచ్చింది.

అయితే.. ఆధార్ విషయంలో జరుగుతున్న కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చే వరకూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు మార్చి 13వ తేదీన ఆదేశాలు జారీచేసింది.

అనుసంధానానికి మార్చి 31వ తేదీ వరకూ విధించిన గడువును నిరవధికంగా పొడిగించింది. అయినప్పటికీ మొబైల్ ఫోన్ కనెక్షన్ల నుంచీ, బ్యాంకు ఖాతాలు, రుణాలు, ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు వరకూ ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరిగానే ఉంది.

Image copyright Getty Images

ఇంతకూ మీ సమాచారాన్ని సేకరిస్తున్న వారెవరు?

‘‘ప్రపంచంలో అతి పెద్ద సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్ ఎలాంటి కంటెంట్ తయారు చేయదు. ప్రపంచంలో అతి పెద్ద ట్యాక్సీ కంపెనీ ఊబర్‌కి సొంతంగా ఒక్క వాహనం కూడా లేదు. అత్యంత విలువైన రిటైలర్ సంస్థ అలీబాబా దగ్గర వస్తువులేమీ లేవు. వసతులు అందించే అతి పెద్ద సంస్థ ఎయిర్‌బీఎన్‌బీకి ఎటువంటి హోటళ్లూ లేవు. ఆసక్తికరమైనదేదో జరుగుతోంది. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఊబర్‌కి తెలుసు. మన స్నేహితులెవరు, ఆసక్తులేమిటి అనేది ఫేస్‌బుక్‌కి తెలుసు. మన షాపింగ్ అలవాట్లేమిటనేది అలీబాబాకు తెలుసు. మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామనేది ఎయిర్‌బీఎన్‌బీకి తెలుసు’’ అని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం ఆధారంగానే ఈ వ్యాపారాలన్నీ నడుస్తున్నాయనేది ఈ వ్యాఖ్య సారాంశం.

ఇంటర్‌నెట్ అనుసంధానం, వినియోగం.. ఐపీ అడ్రస్, కీ వర్డ్ సెర్చ్, చూసిన వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పోస్టులు, బ్రౌజర్లు సేకరించే కుకీలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు, మొబైల్ ఫోన్లలో నమోదయ్యే లొకేషన్ వివరాలు.. ఒక వ్యక్తి అలవాట్లు, అభిరుచులు, ఆలోచనా తీరు, జీవన శైలి, ఆదాయవ్యయాలు వంటి సమస్త సమాచారాన్నీ దాదాపు అరచేతిలో పెట్టి అందిస్తున్నట్లే.

అయితే.. ఈ సమాచారాన్ని తమ నుంచి సేకరిస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారు? వారు దానిని ఎలా వినియోగిస్తున్నారు? ఎందుకు ఉపయోగిస్తున్నారు? అనే విషయాలు అసలే తెలియదు.

Image copyright Getty Images

సమాచార గోప్యతపై నిర్దిష్టమైన చట్టముందా?

ఈ ఆన్‌లైన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమాచారం వ్యక్తిగతమా? బహిరంగమా? అనే అంశంపై అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంకా చర్చ జరుగుతోంది.

అయినా అక్కడ ‘డాటా ప్రైవసీ’ కోసం కొంత మెరుగైన చట్టాలున్నాయి. ఇక భారతదేశంలో ఈ చర్చ ఇప్పుడే మొదలైంది. కానీ నిర్దిష్టమైన చట్టం ఏదీ లేదు.

‘డాటా ప్రొటెక్షన్’ ముసాయిదా బిల్లును తయారు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ బృందం 2018 మార్చి నాటికి ముసాయిదాను రూపొందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికైతే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 43ఎ సెక్షన్, ఆ సెక్షన్ కింద రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సెన్సిటివ్ పెర్సనల్ డాటా ఆర్ ఇన్ఫర్మేషన్) రూల్స్ 2011 మాత్రమే వర్తిస్తున్నాయి.

‘సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని’ స్వీకరించే ఈ సంస్థ అయినా ఈ నిబంధనలను పాటించాలి. లేదంటే బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Image copyright Getty Images

ఇప్పుడున్న సమాచార గోప్యత నిబంధనలేమిటి?

ఆయా సంస్థలు సమాచారాన్ని అందించే వారందరికీ తమ సంస్థ ‘ప్రైవసీ పాలసీ’ (గోప్యతా విధానం) విధిగా అందించాలి.

సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దేన్నైనా సేకరించటం, వినియోగించటం, బహిర్గతం చేయటానికి ముందు ఆ సమాచారాన్ని అందించే వారి నుంచి లేఖ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఆమోదం పొంది తీరాలి.

సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని కేవలం చట్టబద్ధమైన, ఉపయోగకరమైన అవసరాలకు మాత్రమే సేకరించాలి.

అలాగే.. ఈ సమాచారాన్ని సేకరిస్తున్న విషయం, ఎందుకు సేకరిస్తున్నామో, ఎవరికి చేరుతుందో, సమాచారాన్ని సేకరిస్తున్న సంస్థ పేరు, చిరునామా ఏమిటో, ఆ సమాచారాన్ని తమ వద్ద ఉంచుకునే సంస్థ ఏదో వివరాలన్నీ సదరు వ్యక్తికి తెలిసేలా తప్పనిసరిగా చూడాలి.

ఇలా సేకరించిన సమాచారాన్ని చెప్పిన, అంగీకరించిన అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి.

ఈ సమాచార సేకరణ దశకు ముందుగానే ఆ సర్వీసుల నుంచి వైదొలగటానికి వ్యక్తులకు అవకాశం కల్పించాలి. అలాగే సమాచార సేకరణకు, వినియోగానికి తెలిపిన అంగీకారాన్ని సదరు వ్యక్తి ఏ దశలోనైనా ఉపసంహరించుకునే వీలు కల్పించాలి.

సంస్థలు తమ నుంచి సేకరించిన సమాచారాన్ని సదరు వ్యక్తులు సమీక్షించటానికి, అవసరమైన చోట సవరించటానికి అవకాశం కల్పించాలి.

ఇలా సేకరించిన సమాచారానికి తగిన భద్రత కల్పించాలి. ఈ సమాచారాన్ని సేకరించిన సంస్థలు వాటిని థర్డ్ పార్టీకి (సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తి, సేకరించిన సంస్థ కాకుండా మూడో వ్యక్తి లేదా సంస్థకు) వెల్లడించటం లేదా ప్రచురించటానికి ముందు.. ఆ సమాచారానికి సంబంధించిన వ్యక్తి నుంచి అందుకు ఆమోదం పొంది తీరాలి.

సమాచారం ఇచ్చిన సదరు వ్యక్తితో కాంట్రాక్టు ద్వారా లేదా ప్రభుత్వ చట్టం ద్వారా మాత్రమే ఆ సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు.

సమాచార పరిరక్షణలో విఫలమైన పక్షంలో సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)