జేఎన్‌యూలో మళ్లీ ఎందుకీ ఆందోళనలు?

  • 23 మార్చి 2018
నిరసన

దేశవ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో రెండేళ్ల క్రితం వార్తల్లోకెక్కిన జేఎన్‌యూలో ఇప్పుడు మరోసారి ఆందోళనలు రాజుకున్నాయి.

దిల్లీలోని ఈ ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే అతుల్ జోహ్రీ అనే ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 8 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

పలు ఆందోళనల జరిగాక ఐదు రోజుల తర్వాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గంట సేపట్లోనే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ప్రొఫెసర్ అతుల్ జోహ్రీ తమను అసభ్యంగా తాకేవారనీ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారనీ, అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి వేధించేవారనీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన ఎనిమిది మంది అమ్మాయిలు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ వర్సిటీలో ఈ సమస్య ఒక్కటే లేదు. అనేక సమస్యలతో విద్యార్థులు, అధ్యాపకుల్లో అసంతృప్తి, అసహనం పెరిగిపోతున్నాయి.

తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ అతుల్ జోహ్రాపై ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడంపై, అరెస్టు చేసిన గంటలోపే బెయిల్‌పై విడుదల చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, తమను సంప్రదించకుండానే విశ్వవిద్యాలయ యాజమాన్యం కొత్త నిబంధనలను అమలులోకి తెస్తోందంటూ అధ్యాపకులు మండిపడుతున్నారు. నిరసన దీక్షలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో జేఎన్‌యూలో అసలేం జరుగుతోంది? అని తెలుసుకునేందుకు విద్యార్థి, అధ్యాపక సంఘాలతో బీబీసీ మాట్లాడింది.

వారు చెప్పిన విషయాల ప్రకారం, 2016 తర్వాత విశ్వవిద్యాలయంలో యాజమాన్యం అనేక కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వాటిపై విద్యార్థులు, అధ్యాపకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అప్రజాస్వామికంగా, ఆచరణ సాధ్యంకాని నిబంధనలను తెచ్చారని అంటున్నారు.

చెప్పకుండానే నిర్ణయాలు చేసేస్తున్నారు!

ఎవరినీ సంప్రదించకుండానే నిర్వాహక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని జేఎన్‌యూ అధ్యాపకుల సంఘం కార్యదర్శి సుధీర్ కుమార్ ఆరోపించారు.

"గతంలో ఏ నిర్ణయం అయినా అందరినీ సంప్రదించి తీసుకునేవారు. అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేది. కానీ, కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఆ పరిస్థితి కనిపించడంలేదు. నిర్వాహక మండలి సభ్యులు వాళ్లకు వాళ్లే సమావేశం అవుతున్నారు. మాకెవరికీ తెలియకుండానే వాళ్లకు తోచిన నిబంధనలను ప్రవేశపెడుతున్నారు" అని సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన జీఎస్‌క్యాష్(జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అగనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్) కమిటీని రద్దు చేయడంపై కూడా విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

"గతేడాది జీఎస్‌క్యాష్ కమిటీని యాజమాన్యం రద్దు చేసింది. దాని స్థానంలో ఐసీసీని ప్రవేశపెట్టింది. ఇందులో సభ్యులందరినీ యాజమాన్యమే నియమించింది. ఆ సభ్యులపై నమ్మకం లేక న్యాయం కోసం అమ్మాయిలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు" విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సైమన్ జోయా ఖాన్ అన్నారు.

అధ్యాపకుల నిరాహార, సత్యాగ్రహ దీక్ష

యాజమాన్యం దిగివచ్చి తమతో చర్చలు జరపాలంటూ అధ్యాపకులు సత్యాగ్ర దీక్ష చేపట్టారు.

"ఎం.ఫిల్, పీహెచ్.డీలో స్కైప్ ద్వారానే వైవా నిర్వహించాలని నిబంధన పెట్టారు. దాంతో పాటు పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ మరో నిబంధన తీసుకొచ్చారు. వీటిపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం స్పందించడంలేదు. వాళ్లకు తోచింది చేసేస్తున్నారు" అని అధ్యాపకుల సంఘం అధ్యక్షులు సోనాఝారియా మింజ్ అన్నారు.

జేఎన్‌యూలో ఐఐటీ నిబంధనలు

2016లో జేఎన్‌యూ ఉపకులపతిని మార్చారు. గతంలో ఐఐటీ దిల్లీలో అధ్యాపకుడిగా పనిచేసిన జగదీష్ కుమార్‌ని నియమించారు.

ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ 75 శాతం హాజరు ఉండాల్సిందే అన్న నిబంధన ప్రవేశపెట్టారు.

అంతేకాదు, హాజరు నిబంధనలను అమలు చేయడంలేదంటూ గతవారం ఏడుగురు ఛైర్‌పర్సన్లతో పాటు, విశ్వవిద్యాలయం డీన్‌ను బాధ్యతల నుంచి తప్పించారు.

అందుకు నిరసనగా అధ్యాపకులు మూడు రోజులు నిరాహార దీక్ష చేపట్టారు.

మరోవైపు, తమ విశ్వవిద్యాలయంలో ఐఐటీ తరహా నిబంధనలు పెట్టినప్పుడు, వసతులు కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఐఐటీలో ఉన్నట్టుగా జేఎన్‌యూలో ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయం కూడా సరిగ్గా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

వైవాలో 100 శాతం మార్కులొస్తేనే...

2016లో యూజీసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా పరిశోధనా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత నిబంధనలను జేఎన్‌యూ మార్చింది.

దాంతో ప్రస్తుతం అడ్మిషన్ పొందాలంటే రాత పరీక్షలో 50 శాతం, వైవాలో 100 శాతం మార్కులు రావాలి.

అంతేకాదు, సీట్ల సంఖ్యలోనూ భారీ కోత విధించారు. గతంలో 1100 సీట్లు ఉంటే, ఇప్పుడు 300కు తగ్గించారు.

దాంతో విశ్వవిద్యాలయంలో సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని కాలరాసేలా యాజమాన్యం వ్యవహరిస్తోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

50 శాతం మార్కుల నిబంధనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు.

"యాజమాన్యం నిరంకుశత్వం"

జేఎన్‌యూలో ప్రస్తుతం దాదాపు 600 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఎవరినీ సంప్రదించకుండానే కొందరు అధ్యాపకులను ఇతర కళాశాలలకు యాజమాన్యం బదిలీ చేస్తోందని అధ్యాపకుల సంఘం కార్యదర్శి సుధీర్ కుమార్ ఆరోపిస్తున్నారు.

మరోవైపు అధ్యాపకులు, ఉద్యోగుల కోసం ప్రవర్తన నియమావళిని రూపొందించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని ఆయన తెలిపారు.

అనేక విషయాల్లో యూజీసీతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తి జేఎన్‌యూకు ఉంది.

కొత్త కోర్సులు ప్రారంచేందుకు, క్యాంపస్ బయట స్టడీ సెంటర్లు ఏర్పాటుకు, విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు, విదేశీ అధ్యాపకుల నియామకానికి యూజీసీ అనుమతి అక్కర్లేదు.

"ఇది జేఎన్‌యూ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించేందుకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్టుగా ఉంది" అని సోనాఝారియా మింజ్ విమర్శించారు.

పార్లమెంటు వరకు ర్యాలీ

యాజమాన్యం తీరుకు నిరసనగా అధ్యాపకుల సంఘం మార్చి 19 నుంచి 21 వరకు నిరాహార సత్యాగ్రహ దీక్షలు చేసింది. పార్లమెంటు వరకూ నిరసన ర్యాలీ తీసేందుకు సిద్ధమవుతున్నట్టు సుధీర్ కుమార్ తెలిపారు.

ఇలా విశ్వవిద్యాలయంలో నిరసనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపకులపతి యం. జగదీష్ కుమార్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించగా.. ఆయన కొన్నాళ్లుగా కార్యాలయానికి రావడందని తెలిసింది.

ఈమెయిల్ ద్వారా సంప్రదించినా, ఈ కథనం ప్రచురించే వరకూ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు