ప్రెస్‌రివ్యూ: మీ సేవా కేంద్రాల్లో సేవలు ఇక భారం

  • 24 మార్చి 2018
మీసేవ మొబైల్ యాప్ లోగో Image copyright meesevaapp/facebook

మీ సేవా కేంద్రాల్లో ముఖ్యమైన సేవలపై వినియోగ రుసుములు ఒకేసారి భారీగా పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

బిల్లుల చెల్లింపులపై వసూలు చేస్తున్న రుసుముల జోలికి పోకుండా కేటగిరి ఎ, కేటగిరి బి కింద అందించే సేవలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుముపై రూ.10 అదనంగా పెంచారు. ఇప్పటివరకు కేటగిరి ఎ సేవలపై రూ.25, కేటగిరి బి సేవలపై రూ.35 చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ పంపిణీ, పురపాలక, నగరపాలక సంస్థల నుంచి అందించే సేవలు ఎక్కువగా ఉన్నాయి. తాజా నిర్ణయం ప్రకారం కేటగిరి ఎ సేవలపై రూ.35, కేటగిరి బి సేవలపై రూ.45 చెల్లించాల్సి ఉంటుంది.

ఒకేసారి రూ.10 పెంచటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలపై లక్షలాది రూపాయల అదనపు భారం పడనుంది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిర్వహణ భారంగా ఉందని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్న నిరుద్యోగ యువత ప్రభుత్వానికి చేసిన వినతుల మేరకు రుసుం పెంచామని అధికారులు చెబుతున్నారు. పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Image copyright tdp.ncbn.official/Facebook

‘ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి 73 శాతం’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి శాతం 73 శాతానికి చేరిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

గతంలో కంటే ఇది 5 శాతం ఎక్కువ అని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

14 రకాల ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించగా గృహ నిర్మాణ శాఖపై తప్ప మిగతా శాఖలపై 90 శాతం సంతృప్తి ఉందని తేలిందని ఈ కథనం తెలిపింది. రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇసుక విధానంపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. ఉచిత ఇసుక విధానంపై దాదాపు 19 వేల మంది నుంచి అభిప్రాయం తీసుకోగా.. అందులో 3 వేల మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని నిరాధార వదంతులు, ఫిర్యాదులు వస్తే అలా చేసిన వారిని తక్షణం గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Image copyright ISC105.Org
చిత్రం శీర్షిక ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కాలేజీ భవనం

66 వేల డిగ్రీ సీట్లకు కోత!

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

యూనివర్శిటీ పేరు మొత్తం డిగ్రీ సీట్ల సంఖ్య భర్తీ అయిన సీట్ల సంఖ్య
కాకతీయ 24055 4047
ఉస్మానియా 10610 1731
శాతవాహన 7020 876
పాలమూరు 5760 942
తెలంగాణ 3910 628
మహాత్మాగాంధీ 3930 579
మొత్తం 56285 8803

25 వేల సీట్లలో 4 వేలే భర్తీ

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.

లోక్‌పాల్ కోసం హజారే మళ్లీ దీక్ష

లోక్‌పాల్‌ను నియమించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నాహజారే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఈ దీక్షను ప్రారంభించారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

లోక్‌పాల్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన 2011లో రామ్‌లీలా మైదానంలోనే ఆందోళన చేశారు. మళ్లీ ఇదే మైదానం నుంచి ఆయన తన ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను నియమించాలని, రాష్ర్టాల్లో లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలని, స్వామినాథన్ నివేదికను అమలు చేయాలని హజారే డిమాండ్ చేస్తున్నారు.

లోకాయుక్తను ఎందుకు నియమించలేదు?: సుప్రీంకోర్టు

లోకాయుక్త నియామకాలు జరుపకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇంతవరకు లోకాయుక్తను ఎందుకు నియమించలేదని 12 రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రశ్నించిందని నమస్తే తెలంగాణ కథనం వివరించింది.

బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం విచారించింది. లోకాయుక్త నియామకాలను చేపట్టకపోవడానికి తగిన కారణాలేంటో తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలంగాణతో పాటు జమ్ముకశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, తమిళనాడు, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)