#UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?

  • ప్రతిమ ధర్మరాజు
  • బీబీసీ కోసం
వీడియో క్యాప్షన్,

ప్రసవిస్తే 3 నెలలు, నెలసరి వస్తే 5 రోజులు ఊరి బయటే ఉండాల్సిందే

మహిళలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. తెలుగు నేలపైన ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో కొనసాగుతున్న వింత ఆచారంపై బీబీసీ ప్రత్యేక కథనం.

దాదాపు 120 నివాసాలు ఉన్న ఈ గ్రామంలో ఊరుగొల్ల, కాడుగొల్ల అనే రెండు కులాలున్నాయి. అందులో కాడుగొల్ల కులంలో ఉన్న ఆచారాలు మహిళలను మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయి.

ఈ ఊరిలో నెలసరి సమయంలో మహిళలు ఇంటి బయటే ఉండాలి. అదే బాలింతలైతే దాదాపు 3 నెలలు ఊరి బయట పొలిమేరలో ఉండాలి.

చదువుకుంటున్న ఆడపిల్లలను కూడా పీరియడ్స్ సమయంలో ఆ ఐదు రోజులు ఊరిబయటే ఉంచుతారు. వంట కూడా వాళ్లే చేసుకొని తినాలి.

గుడికి వెళ్లడానికి ఆడవారికి అనుమతి లేదు. ఇక్కడి ఆలయాల్లో పురుషులు మాత్రమే పూజలు చేస్తారు.

ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో బడి ఉంది. కానీ, నెలసరి సమయంలో బాలికలు ఊరిలోకి వెళ్లకూడదు కాబట్టి, చుట్టూ పొలిమేర మీదుగా 11 కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లి రావాలి.

వాళ్లతో గ్రామస్థులెవరూ మాట్లాడకూడదు. ఒకవేళ వారితో ఎవరైనా మాట్లాడినా, తాకినా వాళ్లు కూడా ఊరిలోకి రాకూడదు.

వాళ్లుండే గుడిసెకు విద్యుత్ సదుపాయం కూడా ఉండదు. ఆ చీకట్లోనే కాలం గడపాలి.

మహిళలు

ఫొటో సోర్స్, Prathima/bbc

ఫొటో క్యాప్షన్,

గ్రామానికి దూరంగా ఉన్న చిన్న కమ్యూనిటీ హాలు

బాలింతల పరిస్థితి మరీ దారుణం. వాళ్లకు నెలలు నిండుతున్నాయనగానే ఆ ఇంటివాళ్లు ఊరి బయట వెదురు బొంగులతో ఒక గుడిసెనో, గుడారాన్నో తయారు చేస్తారు.

ప్రసవించగానే ఆ గుడారంలో తల్లీబిడ్డలను వదిలేస్తారు. పసి బిడ్డతో కలిసి ఆ తల్లి ఆ గుడిసెలోనే 3 నెలలు ఉండాల్సిందే.

వాళ్లని ఎవరూ తాకకూడదు. పనిలో ఎవరూ సాయం చేయకూడదు. వాళ్లే వండుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. బిడ్డని చూసుకోవాలి. వారికి ఎవరూ తోడు ఉండకూడదు.

తర్వాత గుడికి వెళ్లి పూజ చేశాకే గ్రామంలో అడుగుపెట్టాలి. గతంలో అయితే ఐదు నెలలు అలాగే ఉండేవారని స్థానికులు తెలిపారు.

ఊరి నుంచి ఓ అరకిలోమీటరు దూరంలో ఉన్న పొలిమేరకు మేము వెళ్లాము. అక్కడ ఓ చిన్న గది ఉంది. నలుగురు మహిళలు ఆ గది ముందు కూర్చుని ఉన్నారు.

ఓ గుడిసెలో చంటి బిడ్డతో బాలింత శశికళ కనిపించారు.

మహిళ

ఫొటో సోర్స్, Prathima/bbc

ఫొటో క్యాప్షన్,

శశికళ

కటిక చీకటిలో పసిబిడ్డల్ని పెట్టుకుని తాము చాలా బాధపడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆచారాన్ని దైవాజ్ఞగా భావించాలని పెద్దలు చెబుతారు కాబట్టి, వారి మాటల్ని ఎదిరించలేక ఎంత కష్టమైనా భరిస్తున్నామని గ్రామంలోని కొందరు మహిళలు తెలిపారు.

"మేము ఎదిరించలేము, ప్రభుత్వమైనా మా బాధ అర్థం చేసుకుని ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి" అని వారు కోరుతున్నారు.

ఎంత దుర్భరమైన పరిస్థితులనెదుర్కొంటున్నా ఆచారాలను మొత్తంగా ప్రశ్నించగలిగిన స్థితిలో వారు లేరు. కాకపోతే బయట గడిపే ఆ రోజుల్లో కాస్త కనీస సౌకర్యాలు ఉండేట్టు చూడండని వేడుకుంటున్నారు.

తమ ఊరి అమ్మాయిలు, బాలింతలు ఉండేందుకు ప్రభుత్వం గదులు నిర్మించాలని, అందులో కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

"గుడిసెలో గాలిలేక, కరెంటు లేక నా బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది" అంటూ శశికళ తన గోడును బీబీసీతో పంచుకున్నారు.

చిన్నపిల్లాడు

ఫొటో సోర్స్, Prathima/bbc

ఫొటో క్యాప్షన్,

గడచిన ఐదేళ్ల నుంచే పిల్లలు బడికి వెళ్తున్నారని స్థానికులు తెలిపారు.

ఆడవాళ్లు బాధపడుతున్నా తరాల నుంచి కొనసాగుతున్న ఆచారాల మీద నమ్మకంతో తప్పక పాటించాల్సి వస్తోందని గ్రామస్థుడు వీరన్న తెలిపారు.

దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? వాళ్లని మార్చే ప్రయత్నం చేయలేదా? అని అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్. అనిల్‌ కుమార్‌ను అడిగితే... తమవంతు ప్రయత్నం చేస్తున్నామని, అయినా ఆశించిన మేర వారిలో మార్పు తీసుకురాలేకపోతున్నామని ఆయన చెప్పారు.

ఇప్పుడిప్పుడే కొంతమంది మహిళలు ప్రసవానికి ఆస్పత్రికి వస్తున్నారని ఆయన తెలిపారు.

పెనుగొండ ఆర్డీవో రామ్మూర్తి మాట్లాడుతూ.. ఇది చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఆచారమని తెలిపారు. ఈ అంశంపై ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖ అధికారులు అందరూ కలిసి పని చేస్తేనే అక్కడి వారిలో చైతన్యం తేగలమని చెప్పారు.

కాడుగొల్ల కులస్థులది హిందూ మతం.

వీళ్లు ఎత్తప్ప స్వామి, చిక్కన్న స్వామిలను ఎక్కువగా పూజిస్తారు.

గంతగొల్లహట్టి గ్రామంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ పూజారి ఎప్పుడూ చెప్పులు వేసుకోరు. ఎంతదూరమైనా కాలినడకనే వెళ్తారు కానీ బస్సు, బైకు, కారు ఏవీ ఎక్కరు.

బీసీ-డీ వర్గానికి చెందిన కాడుగొల్ల కులస్థులు అనంతపురం జిల్లాలోని రొల్ల, మడకశిర, గుడిబండ, అమరాపురం, అగలి మండలాల్లో దాదాపు 40 వేల మంది ఉంటారని గుండుమల గ్రామ సర్పంచి చంద్రప్ప తెలిపారు.

దాదాపు ఈ కులస్థులంతా ఈ ఆచారం పాటిస్తారని స్థానికులు వివరించారు.

రొల్లగల్ల హట్టి, రత్నగిరి గొల్ల హట్టి, నసేపల్లి గొల్ల హట్టి, మదుడి గొల్ల హట్టి, డొక్కలపల్లి గొల్ల హట్టి, కెంకెర గొల్ల హట్టి, జంగమవీర గొల్ల హట్టి గ్రామాల్లో కాడు గొల్లలు ఎక్కువగా ఉన్నారు.

గొర్రె పిల్లలు

ఫొటో సోర్స్, Prathima/bbc

ఫొటో క్యాప్షన్,

కాడు గొల్ల కులస్థుల ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం

కాడు గొల్ల కులస్థుల ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. మగవాళ్లు ఏడాదిలో 5 నెలలు మాత్రమే గ్రామంలో ఉంటారు. మిగతా 7 నెలలు స్థానికంగా గొర్రెలకు మేత దొరక్క కర్ణాటక వెళ్తారు.

గంతగొల్లహట్టి గ్రామంలో గడచిన ఐదారేళ్ల నుంచే పిల్లలు బడికి వెళ్తున్నారని స్థానికులు తెలిపారు.

ఇక్కడ 16, 17 ఏళ్లకే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండక ముందే పెళ్లై, తల్లులైన వారు ఈ ఊరిలో కనిపించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)