మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్‌బుక్ సహకరించిందా?

  • 24 మార్చి 2018
ఫేస్‌బుక్ Image copyright Getty Images

కేంబ్రిడ్జి అనలిటికా సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ భారతీయ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆ సంస్థతో సంబంధమున్న భారతీయ కంపెనీ ఎస్‌సీఎల్ ఇండియా వ్యవస్థాపకులు అవనీశ్ రాయ్ వెల్లడించారు.

ఎస్‌సీఎల్ గ్రూప్, లండన్‌లోని ఒవెలెనో బిజినెస్ ఇంటలిజెన్స్‌ల జాయింట్ వెంచరే ఈ ఎస్‌సీఎల్ ఇండియా.

2014 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు అలెగ్జాండర్ నిక్స్ భారతదేశాన్ని సందర్శించారని అవనీశ్ రాయ్ తెలిపారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కేంబ్రిడ్జి అనలిటికా 'ఒక క్లయింట్‌'తో కలిసి పని చేసిందని అవనీశ్ అన్నారు.

ఆ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ 543 లోక్‌సభ సీట్లలో 282 సీట్లను గెల్చుకుని భారీ విజయం సాధించింది.

Image copyright Getty Images

కాంగ్రెస్, బీజేపీ - రెండూ క్లయింట్లే

ఎస్సీఎల్ ఇండియా క్లయింట్ల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఉన్నాయి. అయితే రెండు పార్టీలు కూడా తమకు ఆ కంపెనీతో సంబంధం లేదంటున్నాయి.

కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న దివ్య స్పందన, కేంబ్రిడ్జి అనలిటికాతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. దీనిని బట్టి చూస్తే - కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమే అని అవనీశ్ రాయ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్, సోషల్ మీడియా చీఫ్ అమీత్ మాలవ్య, ''అవనీశ్ కుమార్ రాయ్ ఎవరో నాకు తెలీదు. ఆయన ఇంటర్వ్యూను కూడా నేను చూడలేదు. కేంబ్రిడ్జి అనలిటికాతో సంబంధమున్న ఏ సంస్థతోనూ మాకు సంబంధాలు లేవు'' అని స్పష్టం చేశారు.

Image copyright Getty Images

అంతకు ముందు భారత న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ - కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ దీనిపై సమాధానం ఇవ్వాలని అన్నారు.

ఫేస్‌బుక్ కనుక భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు వెల్లడైతే దానిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఐటీ చట్టాల ప్రకారం జుకర్‌బర్గ్‌ను భారతదేశానికి రప్పిస్తామని అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

త్యాగితో ఎలాంటి సంబంధాలున్నాయి?

ఎస్సీయల్ ఇండియా చీఫ్ అమరీశ్ త్యాగి బిహార్ జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి కుమారులు. అందువల్ల బిహార్లో ఈ విషయం రాజకీయాంశంగా మారింది.

దీనిపై కేసీ త్యాగి బీబీసీతో మాట్లాడుతూ, ''గ్రామాల్లో ఎంత మంది బనియాలు ఉన్నారు, ఎంత మంది బ్రాహ్మణులు ఉన్నారు - ఇలాంటి కులాలవారీ లెక్కలను అమరీశ్ సంస్థ ఎక్కువగా సేకరిస్తుంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలున్న వారిని జతపరచడం కోసం పని చేసిన మాట నిజమే. కానీ అక్కడ కలుగజేసుకోమని మేమేమైనా ఫేస్‌బుక్‌కు చెప్పామా? అక్కడ జరిగిన గందరగోళం గురించి ఇక్కడ ఎవరూ ఫేస్‌బుక్‌పై ఫిర్యాదు చేయలేరు'' అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి

సోషల్ మీడియా ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?

భారత్‌లో సెక్యూరిటీ డాటా గురించి చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. భారతదేశంలాంటి పెద్ద దేశంలో సోషల్ మీడియా సమాచారం ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?

ఎన్నికల సర్వేలు నిర్వహించే సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్ కుమార్, ''గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నట్లు.. మన దేశంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. భారతదేశ సాధారణ ఓటరు సమస్యలు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఉద్యోగాలు.. ఇవే. సాధారణ ఓటరుకు ఫేస్‌బుక్‌లో రాయాల్సినంత పెద్ద విషయాలు ఏముంటాయి? భారత రాజకీయ పార్టీలకు దేశంలోని ఓటర్ల మనస్తత్వం తెలుసు. వాళ్ల సమాచారాన్ని మళ్లీ ఎక్కడి నుంచో తీసుకోవడం ఎందుకు?'' అన్నారు.

ఎస్‌సీఎల్ ఇండియా సంస్థకు భారతదేశంలోని పార్టీలతో ఎలాంటి సంబంధం ఉంది? దాని వల్ల ఆ పార్టీలకు ఎలాంటి లబ్ధి చేకూరింది అన్నదానిపై అనేక ప్రశ్నలున్నాయి. ఈ ఆరోపణలపై బీబీసీ కేంబ్రిడ్జి అనలిటికాకు పంపిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు.

ఎస్‌సీఎల్ ఇండియా వ్యవస్థాపకులు అవనీశ్ రాయ్‌తో మాట్లాడడానికి కూడా బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన మీడియాతో మాట్లాడ్డానికి ఇష్టపడలేదు.

Image copyright Getty Images

ఎస్‌సీఎల్ భారతదేశంలో ఏం చేస్తుంది?

తమకు దేశంలోని 10 రాష్ట్రాలలో ఉన్న వివిధ కార్యాలయాలలో 300 మంది శాశ్వత ఉద్యోగులు, 1,400 మంది కన్సల్టింగ్ సిబ్బంది ఉన్నారని ఎస్‌సీఎల్ ఇండియా చెబుతోంది.

భారతదేశంలో ఇది అనేక విధమైన సేవలను అందిస్తోంది. వాటిలో రాజకీయ ప్రచార నిర్వహణ ఒకటి.

సోషల్ మీడియాలో ప్రచార వ్యూహం, ఎన్నికల ప్రచార నిర్వహణ, మొబైట్ మీడియా మేనేజ్‌మెంట్ వాటిల్లో కొన్ని. సోషల్ మీడియా వ్యూహం కింద ఆ సంస్థ, ''బ్లాగర్ మరియు ఎఫెక్టివ్ మార్కెటింగ్'', ''ఆన్‌లైన్‌లో మీ ప్రతిష్టను ఎలా పెంచుకోవాలి'', ''సోషల్ మీడియా రోజువారీ నిర్వహణ'' అన్న సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)