#BBCShe: పెళ్లి కోసం యువకుల కిడ్నాప్

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

#BBCShe: యువతీయువకులను ఎందుకు బలవంతంగా వివాహబంధంలోకి నెడుతున్నారు?

సాధారణంగా అబ్బాయి, అమ్మాయికి పెళ్లి నచ్చకున్నా ఇంట్లో పెద్దలు ఒప్పించి.. లేదా బలవంతం చేసైనా పెళ్లి చేయడం చూసి ఉంటాం. కానీ అబ్బాయిలను ఎత్తుకెళ్లి మరీ తమ అమ్మాయిలకు ఇచ్చి పెళ్లి చేసే వారిని చూసి ఉండం. కానీ అలాంటి పెళ్లిళ్లు బిహార్‌లో జరుగుతున్నాయి.

కొందరు కుటుంబపెద్దలు తమ కూతుళ్లకు పెళ్లి చేసేందుకు యువకులను కిడ్నాప్ చేస్తున్నారు. ఈ విషయంలో వారు కనీసం తమ కూతురి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం లేదు.

మీరు ఒక పెళ్లికాని యువతి అనుకోండి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలని ఎంత తొందర పడుతున్నారంటే, ఇందుకోసం వాళ్లు ఎవరైనా యువకుణ్ని కిడ్నాప్ చేసైనా మీ పెళ్లి చేసేయాలనుకుంటున్నారు.

ఈ బలవంతపు పెళ్లిలో అమ్మాయి అంగీకారం అడగరు. అబ్బాయినీ అంతే.

#BBCShe పట్నాకు వెళ్లినపుడు అక్కడ కాలేజీ యువతులు ఈ 'పకడ్వా పెళ్లి' గురించి చెప్పినపుడు నేను నమ్మలేకపోయాను.

ఏ యువతి అయినా ఇలాంటి పెళ్లికి ఎలా అంగీకరిస్తుంది?

ఒకవేళ ఆ యువకుడు ఆ అమ్మాయిని అంగీకరించకపోతే?

ఒకవేళ అతను కోపంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చినా, ఆమె ఆ వివాహబంధాన్ని కొనసాగించగలదా?

ఫొటో క్యాప్షన్,

పర్వీన్ కుమార్, మహారాణి దేవి

బిహార్ పోలీస్ రికార్డుల ప్రకారం, 2017లో రాష్ట్రంలో ఇలాంటి కేసులు 3,500 నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం ఉత్తర బిహార్‌లోనివి.

నేను పట్నా నుంచి సహస్త్ర జిల్లాకు వెళ్లాను. అక్కడ సిమ్రి గ్రామంలో మహారాణి దేవి, ఆమె భర్త పర్వీన్ కుమార్‌లను కలిశాను.

పర్వీన్‌ను కిడ్నాప్ చేసి, మహారాణి దేవితో బలవంతంగా పెళ్లి చేసినపుడు ఆమెకు 15 ఏళ్లు.

''నాకు పెళ్లి చేస్తున్నారని అప్పుడు నాకు తెలీదు. ఎవరూ నన్ను ఇష్టమా కాదా అని కూడా అడగలేదు'' అని మహారాణి తెలిపారు.

''చివరకు ఏమవుతుంది అనేదే అమ్మానాన్నలకు కావాలి. పెళ్లి విషయంలో కూతుళ్ల మాట చెల్లుబాటు కాదు'' అన్నారు మహారాణి.

దాని ఫలితంగా పెళ్లయిన మూడేళ్ల వరకు పర్వీన్ మహారాణిని తన ఇంటికి తీసుకురాలేదు.

జరిగిన సంఘటనలపై పర్వీన్, ''జరిగిన దానిపై నాకు చాలా కోపం వచ్చింది. అందువల్లే ఆమెను పుట్టింటిలోనే వదిలేసి, మా ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్నాను'' అని తెలిపారు.

సిమ్రి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తోలా ధాబ్ గ్రామం ఉంది. అక్కడ 17 ఏళ్ల రోషన్ (సురేశ్) కూడా ఇలాంటి ఆగ్రహాన్నే వ్యక్తం చేశాడు.

జనవరిలో పక్కింటిలో ఉండే వ్యక్తి రోషన్‌ను పక్క గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ రోషన్‌ను ఒక గదిలో బంధించి చితకబాదారు. తుపాకీ చూపించి బెదిరించారు.

అక్కడ తనకన్నా పెద్ద వయసున్న యువతితో అతని పెళ్లి జరిపించారు.

పెళ్లయ్యాక రోషన్ అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన పెళ్లిపై రోషన్, ''పంచాయితీ చేసి రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ నన్ను చంపినా పెళ్లికి అంగీకరించనని చెప్పేశాను'' అన్నాడు.

మరి యువతి సంగతి ఏమిటి?

''ఆ యువతి ఎవరో నాకు తెలీదు. ఆమె ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నేను పై చదువులు చదివి, నా జీవితాన్ని బాగా గడపాలనుకుంటున్నాను'' అన్నాడు.

ఫొటో క్యాప్షన్,

రోషన్

'పకడ్వా పెళ్లి' లో ఏం జరుగుతుందో తెలిసి కూడా ఎందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను బలవంతంగా ఆ ఊబిలోకి నెడుతున్నారు?

పట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ భారతి కుమార్, బిహార్‌లోని భూస్వామ్య సంస్కృతి ప్రభావంతోనే ఇది జరుగుతోందని అన్నారు.

''ఉత్తరప్రదేశ్, బిహార్‌లాంటి రాష్ట్రాలలో తమ కూతుళ్లను తమ కులానికే చెందిన వారితో వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలనే సామాజిక ఒత్తిడి బాగా ఉంది'' అని ఆమె వివరించారు.

ఈ 'పకడ్వా పెళ్లి' - పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే చట్రం చుట్టూ తిరిగే గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

రోషన్ సోదరి ప్రియాంక ఇలాంటి పెళ్లిళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

''నేను కూడా బాలికనే. ఏ బాలికా తనకు కాబోయే భర్తను బలవంతంగా ఎత్తుకురావాలని భావించదు.'' అంది ప్రియాంక. ''యువతీయువకులు ఒక్కసారి కూడా కలుసుకోకుండానే పెళ్లి చేసేయాలనుకుంటారు. ఈ పెళ్లిలో యువకుడూ సంతోషంగా ఉండడు. అటు యువతి జీవితం కూడా నాశనమైపోతుంది.''

ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లకు కారణం?

''వరకట్నం ఇచ్చుకోలేని వాళ్లే యువకులను కిడ్నాప్ చేస్తున్నారు. కట్నం ఇచ్చుకోగలిగిన వాళ్లు మామూలుగానే తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తున్నారు'' అంది ప్రియాంక.

అయితే పకడ్వా పెళ్లిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యువతిని తన భార్యగా స్వీకరించడానికి యువకుడు నిరాకరించినపుడు, అతణ్ని మళ్లీ వరకట్నం ద్వారానే మెత్తబరచడానికి ప్రయత్నిస్తారు.

వరకట్నం, పెళ్లి.. ఈ రెండూ ఒక విషవలయం. దాన్ని బద్దలు కొట్టడం చాలా కష్టం.

ఫొటో క్యాప్షన్,

ప్రియాంక కుమారి

పర్వీన్ కుమార్ పెళ్లయిన మూడేళ్ల తర్వాత తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. దానికి కారణం.. కుటుంబం పరువు పోతుందనే.

''జనం నా గురించి ఏమనుకుంటారు? నేను ఈ పెళ్ళిని అంగీకరించకపోతే, పరువు మర్యాదలు కలిగిన ఏ కుటుంబమైనా తమ కూతుర్ని నాకిచ్చి ఎలా పెళ్లి చేస్తుంది?'' అన్నారు పర్వీన్.

అందువల్లే పర్వీన్ సర్దుకుని, కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే మహారాణికి కనీసం ఆ నిర్ణయాధికారం కూడా లేదు. ''జరిగింది మర్చిపొమ్మని నా స్నేహితులు సలహా ఇచ్చారు. ఇలాంటిది చాలా మందికి జరిగింది. దాని గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు.''

పర్వీన్, మహారాణికి ఇప్పుడు కవల పిల్లలు.

జీవితం ఎలా ఉందని ప్రశ్నించినపుడు మహారాణి కళ్లు చెమర్చాయి.. తన అత్తామామలు బాగా చూసుకుంటారని మాత్రం ఆమె తెలిపారు.

''ఇప్పుడు నా పెళ్లి బలవంతంగా జరిగిందని అనిపించడం లేదు'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)