ప్రెస్ రివ్యూ: ఇలాగైతే సమాచార కమిషన్ అవసరమా- సీఐసీకి మాడభూషి శ్రీధర్ లేఖ

  • 26 మార్చి 2018
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ Image copyright Facebook/Madabhushi Sridhar
చిత్రం శీర్షిక కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్

కేంద్ర సమాచార కమిషన్‌లో ఫిర్యాదులను ఓ ధర్మాసనం విచారిస్తుండగా అర్ధంతరంగా దానిని రద్దు చేసి అదే ఫిర్యాదు విచారణకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విధానంపై సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని 'సాక్షి' తెలిపింది. ఈ మేరకు ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) ఆర్కే మాథుర్‌కు శ్రీధర్‌ ఫిబ్రవరిలో 2 లేఖలు రాయగా అవి ఇటీవలే బయటకొచ్చాయని పేర్కొంది.

ఇలా ధర్మాసనాలు ఏర్పాటు చేస్తే సమాచార కమిషనర్ల స్వతంత్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతాయనీ, పారదర్శకత, జవాబుదారీతనం లేనప్పుడు ఇక ఈ సమాచార కమిషన్‌ ఉండటం ఎందుకని శ్రీధర్ ప్రశ్నించారు.

బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎంలను 2013లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ పార్టీలు ఈ చట్టానికి కట్టుబడి సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ జరిపేందుకు 2016లో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో శ్రీధర్ ఒక సభ్యుడు. ఆరు నెలల అనంతరం కమిషనర్లకు చెప్పకుండానే మాథుర్‌ ఆ ధర్మాసనాన్ని రద్దు చేసి 2017 ఆగస్టులో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ధర్మాసనం ఆ ఫిర్యాదులను ఇప్పటివరకు విచారించలేదు.

''ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయినట్లుగా చెబుతున్న విద్యాసంవత్సరం రికార్డులను బయటపెట్టాలని 2017లో శ్రీధర్‌ ఆదేశించారు. వెంటనే ఆయన్ను మానవ వనరుల శాఖ ఫిర్యాదులపై విచారణ బాధ్యతల నుంచి తప్పించారు. 'కేసులను ఎవరికి అప్పగించాలనే దానిని అర్థవంతమైన పద్ధతిలో కమిషన్‌ సభ్యులందరూ నిర్ణయించాలి. ఫిర్యాదులను మనం ఏళ్ల తరబడి విచారించడం లేదు. కీలకమైన రాజకీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే ఇక మనం పారదర్శకంగా ఉన్నామని ఎలా చెప్పగలం? ఈ కమిషన్‌ ప్రయోజనం లేకుండా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారి కొనసాగాల్సిన అవసరమేంటి?' అని లేఖలో శ్రీధర్‌ ఆచార్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు'' అని సాక్షి తెలిపింది.

ఏపీపీ‌ఎస్‌సీ గ్రూప్-1లో ఆంగ్లం తప్పినా 8 మందికి ఇంటర్వ్యూకి అర్హత

ఏపీపీఎస్‌సీ గ్రూపు-1 ఉద్యోగ నియామకాల్లో ప్రధాన పరీక్షల్లో ఒకటిగా ఉన్న 'జనరల్‌ ఇంగ్లిష్‌'లో అర్హత సాధించని ఎనిమిది మంది అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరు కావడం దుమారం రేపుతోందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

''2016 నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీపీఎస్‌సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ద్వారా అర్హత సాధించిన వారికి ప్రధాన పరీక్షలను రాసేందుకు అనుమతినిచ్చారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను అనుసరించి 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు అభ్యర్థులను కమిషన్ ఎంపికచేసింది. వీరికి మౌఖిక పరీక్షలు ఇటీవల ముగిశాయి. ప్రధాన పరీక్షల్లో ఒకటిగా ఉన్న జనరల్‌ ఇంగ్లిష్‌లో అర్హత మార్కుల కంటే తక్కువ మార్కులను సాధించిన ఎనిమిది మంది అభ్యర్థుల నంబర్లు మౌఖిక పరీక్షలు ముగిసిన తర్వాత వెల్లడించిన జాబితాలో కనిపించాయి. అనర్హులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు" అని పత్రిక తెలిపింది.

జనరల్‌ ఇంగ్లిష్‌లో అర్హత సాధించని వారు ఉంటే వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని, ఎంపికైన వారి జాబితాను ఇంకా ప్రకటించలేదని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఏపీపీఎస్‌సీ ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్‌ చెప్పారని ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Getty Images

ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు

గతంలో అన్ని ఐఐటీల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా ఐదేళ్లుగా కొన్ని విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ పూర్తిస్థాయిలో జరగడం లేదని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది. హైదరాబాద్‌, కాన్పూర్‌ ఐఐటీలు మినహా అన్ని ఐఐటీల్లో ఈ పరిస్థితి నెలకొందని మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొంది.

అన్ని ఐఐటీల్లో 11 వేల సీట్లు ఉండగా గత ఐదేళ్లలో 276 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. 2013-17 మధ్య కాలంలో ఈ పరిస్థితి నెలకొందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఐటీ-భువనేశ్వర్‌లో 2013 నుంచి గత ఏడాది వరకు అత్యధికంగా 105 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం గత ఏడాది ఒక కమిటీని నియమించింది. కొన్ని కోర్సులకు డిమాండ్‌ తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న కోర్సులకే డిమాండ్‌ ఉందని ఈ కమిటీ గుర్తించింది.

డిమాండ్‌ తక్కువగా ఉన్న ఒకట్రెండు కోర్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని కమిటీ తన నివేదికలో ప్రతిపాదించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: దిల్లీ యువతిపై డిసెంబరులో 20 రోజులు సామూహిక అత్యాచారం

దిల్లీకి చెందిన ఒక పాతికేళ్ల యువతిపై నిరుడు డిసెంబరులో హైదరాబాద్‌లో 20 రోజులపాటు సామూహిక అత్యాచారం జరిగినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

''ఈ యువతి కశ్మీర్ నుంచి దిల్లీకి వచ్చి, బొటిక్‌ ఏర్పాటు చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోనూ బొటిక్‌ పెట్టేందుకు డిసెంబరులో నగరానికి వచ్చారు. ఫరీద్‌ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. బొటిక్‌ కోసం దుకాణాలు చూపిస్తున్నట్లు నమ్మించి ఆమెను జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు-36లోని ఓ గదిలో నిర్బంధించాడు. మరో ముగ్గురితో కలిసి ఆమెపై 20 రోజుల పాటు అత్యాచారానికి తెగబడ్డాడు. కేసు పెట్టొద్దని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు'' అని ఆంధ్రజ్యోతి రాసింది.

''వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఈ యువతి దిల్లీకి చేరి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఫిబ్రవరిలో దిల్లీ గ్రేటర్‌కైలాశ్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అక్కడి పోలీసులు కేసును హైదరాబాద్‌కు బదిలీ చేశారు. స్థానిక పోలీసులు ఫరీద్‌, మరో ముగ్గురిపై లైంగిక దాడి, నిర్బంధం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు'' అని పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)