ఈ దళితులు బౌద్ధ మతంలోకి ఎందుకు మారుతున్నారు?

  • 27 మార్చి 2018
దళితులు

"మనమంతా ఏప్రిల్ 19న ఇళ్లలో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలన్నింటినీ మన ఊరి దగ్గర నుంచి వెళ్తున్న రావల్ నదిలో నిమజ్జనం చేయాలి. 2016లో ఎక్కడైతే మన మీద దాడి జరిగిందో అక్కడికి వెళ్లి ఏప్రిల్ 29న మూకుమ్మడిగా బౌద్ధ మతాన్ని స్వీకరిద్దాం" అంటూ 55 ఏళ్ల బాలుభాయ్ శ్రావయ్య తన కులస్థులకు పిలుపునిచ్చారు.

ఎందుకు మారుతున్నారు?

2016 జులైలో గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా ఉనా పట్టణంలో ఐదుగురు దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తర్వాత నలుగురు యువకులను నడి వీధిలో కారుకు కట్టేసి అత్యంత పాశవికంగా కొట్టారు. ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కింది.

అప్పటి దాకా ఉనా అంటే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు. కానీ, ఆ ఘటన తర్వాత ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, రాహుల్ గాంధీ, మాయావతితో పాటు అనేకమంది ముఖ్య నేతలు వెళ్లి బాధితులను పరామర్శించారు.

చనిపోయిన ఓ ఆవు చర్మాన్ని వలుస్తుండగా 'గో రక్షకులు' వచ్చి తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు.

ఆ బాధితుల్లో బాలుభాయ్ కూడా ఒకరు.

చిత్రం శీర్షిక ఉనా దాడి బాధితుల్లో బాలుభాయ్ ఒకరు

బాలుభాయ్ కుటుంబం ఉనా తాలూకాలోని మోటా సామధియాలా గ్రామంలో ఉంటోంది. వీరి ఇంట్లో గోడలకు హిందూ దేవుళ్ల పటాలు వేలాడుతూ కనిపించాయి.

అయితే, ఇటీవల వారి ఇంట్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోలు, బుద్ధుడి విగ్రహాలు కూడా వచ్చి చేరాయి.

తమకు ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని హిందుత్వం ఇవ్వలేకపోయిందని బాలుభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమలా అవమానాలు ఎదుర్కొన్న దళితులంతా బౌద్ధ మతాన్ని స్వీకరించేందుకు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉనా ఘటన జరిగిన నాటి నుంచే తాము మతం మారాలని అనుకున్నట్టు బాలుభాయ్ తెలిపారు.

తన భార్యకు హిందూ మతమంటే ఎనలేని ప్రేమ అని, అయినా తాము ఆత్మాభిమానంతో బతికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

చిత్రం శీర్షిక ఉనా దాడి బాధితుడు బాలుభాయ్ భార్య కున్వార్ బెన్‌

నిద్రలోనూదెబ్బలు గుర్తొస్తున్నాయి

"2016 జులై 7న మాపై అత్యంత క్రూరంగా దాడి చేశారు. అది గుర్తొచ్చినప్పుడల్లా, వాళ్లు మళ్లీ వచ్చి కొడతారేమో అని భయమేస్తుంది" అని బాధితుల్లో అందరికంటే చిన్నవాడైన అశోక్ శ్రావయ్య ఆ దాడిని గుర్తుచేశారు.

ఆ ఘటన తర్వాత బాధితుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని అశోక్ తెలిపారు.

"నా కొడుకు ఇప్పటికీ సరిగ్గా నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు. చిన్న పిల్లాడిలా చూసుకోవాల్సి వస్తోంది" అంటూ అతని తల్లి విమల(50) ఆవేదన వ్యక్తం చేశారు.

ఉనా బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని దళిత యువ నేత, వడ్‌గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అసెంబ్లీలో ప్రశ్నించారు. అయితే, అధికారికంగా వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

ఇష్టమైన హిందూ మతం నుంచి బౌద్ధం వైపు

"ఒకవేళ డాక్టర్ అంబేడ్కర్ దళితుడిగా పుట్టి ఉండకపోతే, ఈ దేశంలో దళితులను అగ్రవర్ణాల వారు వీధి కుక్కల్లా చూసేవారు" అని బాలుభాయ్ భార్య కున్వార్‌ బెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి హిందూ మతంలో కున్వార్ బెన్‌ ఎంతో నిష్ఠతో ఉండేవారు. పదేళ్లుగా క్రమం తప్పకుండా స్థానిక దశమా దేవి ఆలయానికి వెళ్తూ పూజలు చేస్తున్నారు. ఏ హిందూ మత గురువు వచ్చినా వెళ్లేవారు.

కానీ, ఇప్పుడు కున్వార్ తన మతంపై అసహనంగా ఉన్నారు.

"ఇన్నాళ్లూ బిచ్చగాళ్లగా గడిపాం. ఇప్పటికీ గౌరవంగా బతకలేకపోతున్నాం. మాకు మనిషిగా బతికే అవకాశం ఇవ్వని మతాన్ని ఇంకా ఎందుకు అనుసరించాలి?" అని కున్వార్ అన్నారు.

చిత్రం శీర్షిక దళితులపై దాడులు వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ బౌద్ధ మతంలోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.

గుజరాత్‌లో పెరుగుతున్న బౌద్ధులు

2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌లో 30,483 మంది బౌద్ధులు ఉన్నారు. ఉనా ఘటన అనంతరం గుజరాత్‌లో బౌద్ధ మతాన్ని స్వీకరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోతికర్ తెలిపారు.

డా. బీఆర్ అంబేడ్కర్ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించిన అతికొద్ది మంది దళితుల్లో జ్యోతికర్ ఒకరు. ప్రస్తుతం ఆయన గుజరాత్ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు.

అంబేడ్కర్ తర్వాత, 1960లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితుడిని తానే అని జ్యోతికర్ తెలిపారు.

2011 తర్వాత గుజరాత్‌లో బౌద్ధుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని ఆయన వెల్లడించారు.

"మతం మారడానికి ప్రధాన కారణం ఆత్మాభిమానమే. ప్రస్తుత మతంలో తమకు సరైన గౌరవం ఉండటం లేదన్న కారణంతో చదువుకున్న దళిత యువత ఈ నిర్ణయం తీసుకుంటున్నారు" అని ఆయన వివరించారు.

మతం మారినా ఆవును ప్రేమిస్తూనే ఉంటా: బాలుభాయ్

ఉనా ఘటనకు ముందు నుంచే బాలుభాయ్ ఓ ఆవును పెంచుకుంటున్నారు. దానికి ప్రేమగా గౌరి అని పేరు కూడా పెట్టుకున్నారు.

"ప్రస్తుతం నా ఆవు మా సోదరుడి పొలం దగ్గర ఉంది. దానికో దూడ కూడా ఉంది. నేను మతం మారినా నా ఆవును ప్రేమిస్తూనే ఉంటా. మా దగ్గర ఏ దళితుడూ ఆవుల ప్రాణం తీయడు. అనారోగ్యంతో ఉన్న ఆవులను కూడా మేము ఏనాడూ ముట్టుకోలేదు. తమ ఆవు చనిపోయిందని అగ్రవర్ణాల వారు చెబితేనే చర్మం వలిచేందుకు వెళ్లేవాళ్లం" అని బాలుభాయ్ వివరించారు.

చిత్రం శీర్షిక 2016లో దాడి జరిగిన స్థలం

ఉనా ఘటనకు సంబంధించి అప్పట్లో 45 మంది అరెస్టు అయ్యారు.

వారిలో 11 మంది జైలులో ఉండగా, మిగతా వారు బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం