ప్రెస్‌రివ్యూ: అవసరమైతే కేంద్రంపై టీఆర్‌ఎస్ అవిశ్వాసం- కేసీఆర్

  • 27 మార్చి 2018
కేసీఆర్ Image copyright Twitter/Telangana CMO

తెలంగాణలో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపుదల, విభజన హామీల అమలు లాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలని, అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు 'ఈనాడు' రాసింది.

కేంద్ర ప్రభుత్వం మనల్ని(తెలంగాణను) నిర్లక్ష్యం చేస్తే మనమూ సమయం చూసి అవిశ్వాస తీర్మానం పెడదామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్నారని పత్రిక చెప్పింది.

'బీజేపీని కాపాడుతున్నామనే అపప్రథ రావద్దు'

''కాంగ్రెస్ నాటకాలాడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లోపాయకారీగా కొన్ని బిల్లులను ఆమోదించుకుంటున్నాయి. దీన్ని బయటపెట్టాలి. మనమేదో బీజేపీని కాపాడుతున్నామనే అపప్రథ రావద్దు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే మనం పాల్గొని, తెలంగాణకు జరిగిన అన్యాయాలు, రిజర్వేషన్లపై కేంద్ర వైఖరిని ఎండగట్టాలి. ఓటింగ్ వరకు వస్తే అప్పుడేం చేయాలో నిర్ణయిద్దాం'' అని కేసీఆర్ చెప్పారని ఈనాడు తెలిపింది.

పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఆందోళనలను బీజేపీ, టీడీపీ వాటికి అనుకూలంగా అన్వయించుకుంటూ టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని, దీనిని తిప్పికొట్టాలని కేసీఆర్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

''ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటంలో టీడీపీ, ఇతర పార్టీలకు చిత్తశుద్ధి లేదు. మనం పార్లమెంటులో ఆందోళనలు ఆపేద్దాం.. అప్పుడు ఎవరి నిజరూపమేంటో తెలుస్తుంది'' అని కేసీఆర్ అన్నారని ఈనాడు పేర్కొంది.

Image copyright Facebook/ YS Jagan Mohan Reddy

జగన్: 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది

పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదాపడ్డా ఆ మరుక్షణమే స్పీకర్‌ ఫార్మాట్‌లో తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని 'సాక్షి' రాసింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు కూడా తమతో కలసి వచ్చి రాజీనామాలు చేయాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన చెప్పారు.

రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు (లోక్‌సభ సభ్యులు) ఏకతాటిపైకి వచ్చి రాజీనామాలు సమర్పిస్తే కేంద్రం దిగి వస్తుందని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అమలు డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందన్నారు.

ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్‌ సోమవారం గుంటూరు జిల్లా ముప్పాళ్ల వద్ద పార్టీ ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారని 'సాక్షి' తెలిపింది.

Image copyright Janasena Party
చిత్రం శీర్షిక పవన్ కళ్యాణ్

అమిత్ షా కేంద్రం ప్రతినిధి కాదు: పవన్ కళ్యాణ్

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదని, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడని, ఒక రాష్ట్ర (ఆంధ్రప్రదేశ్) అభివృద్ధి గురించి ఆయన ఎలా మాట్లాడతారని, దాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అమిత్ షా రాసిన లేఖపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా ఏదైనా వస్తే స్పందించేవాళ్లమని పవన్ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం చేపట్టాల్సిన ఆందోళనల కార్యాచరణపై సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం ప్రతినిధులతో సమావేశానంతరం సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులతో కలిసి పవన్‌ మీడియాతో మాట్లాడారు. హోదా విషయంలో ప్రజలను బీజేపీ, టీడీపీ మోసం చేశాయని పవన్ ఆరోపించారు. వామపక్షాలతో కలసి ప్రజల పక్షాన పోరాడతామన్నారు. అనంతపురం నుంచి తమ పోరాటం ప్రారంభమవుతుందని తెలిపారు.

వామపక్షాలతో ఐక్యపోరాటం ఎన్నికల్లో కూడా ఉంటుందా అని మీడియా అడగ్గా- ''మీరే చూస్తారు'' అని మధు, పవన్‌ సమాధానమిచ్చారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి 2016 నుంచే అడగటం ప్రారంభించామని పవన్ చెప్పారని ఆంధ్రజ్యోతి పేర్కొంది. ''అప్పుడు టీడీపీ ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్టుగా మాట్లాడింది. వైసీపీ నామ్‌కే వాస్తే ఆందోళన చేసింది. కేంద్రంతో టీడీపీ ప్రతిసారీ రాజీ ధోరణిలోనే ప్రవర్తించింది'' అని ఆయన ఆరోపించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని పవన్‌ అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే తాను ఆయన్ను కలిశానని, పార్టీలో చేరే విషయమై ఎలాంటి చర్చలూ జరపలేదన్నారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన సభ సందర్భంగా లక్ష్మీనారాయణ తనకు 'ఆల్‌ ద బెస్ట్‌' అని మెసేజ్‌ పంపించారని చెప్పారు.

Image copyright NAlle Sivakumar

పోలవరం: 'నిధుల విడుదలపై 9 నెలలుగా మారిన కేంద్రం వైఖరి'

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిలో దాదాపు తొమ్మిది నెలలుగా మార్పు కనిపిస్తోందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

''తనిఖీ అంచెలు పెరిగిపోయాయి. ఆ తనిఖీలకు అభ్యంతరం లేకపోయినా నిధులు విడుదలయ్యేందుకు పట్టే సమయమే మరీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రం ఊపిరి తీసుకోలేకపోతోందని అధికారులు చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వమే తొలుత నిధులు ఖర్చు చేసి ఆనక కేంద్రం నుంచి రాబట్టుకుంటోంది. రాష్ట్రం పంపిన ఒక్కో బిల్లు కేంద్రం నుంచి మంజూరై, రాష్ట్రానికి నిధులు రావడానికి మూడు నెలల నుంచి ఏడాది సమయం పడుతోందని జలవనరులశాఖ అధికారుల అంచనా. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) సాయానికి ఒప్పందం కుదిరిన తర్వాత జాప్యం పెరుగుతోందని పేర్కొంటున్నారు'' అని ఈనాడు తెలిపింది.

ప్రాజెక్టులపై ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,000 కోట్లు ఇప్పటికే అప్పులు చేసిందని, వాణిజ్య బ్యాంకుల నుంచి 7.9 శాతం వడ్డీకి ఈ రుణాలు పొందిందని ఈనాడు వివరించింది. ''పోలవరం నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల వడ్డీల రూపంలోనే రూ.కోట్లు నష్టపోవాల్సి వస్తోందని అధికారులు విశ్లేషిస్తున్నారు'' అని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)