కోబ్రాపోస్ట్: డబ్బులు తీసుకుని హిందుత్వ వార్తలు రాయడానికి 17 మీడియా సంస్థలు సిద్ధం

  • ప్రియాంక దూబే
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

'ఆపరేషన్ 136' అనే పేరుతో కోబ్రాపోస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

డబ్బులు తీసుకుని హిందుత్వ అజెండాకు అనుగుణంగా వార్తలు ప్రచురించేందుకు 17 మీడియా సంస్థలు అంగీకరించాయంటూ కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ వెల్లడించింది.

తాము నిర్వహించిన శూల శోధన (స్టింగ్ ఆపరేషన్‌)లో ఆ సంస్థల బండారం బయటపడిందని కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనురుద్ధ బహల్ వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌ ఎలా సాగిందన్న వివరాలను, వీడియోలను సోమవారం దిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో మీడియాకు వివరించారు.

2017 వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో భారత్‌కు 136వ ర్యాంకు వచ్చింది. ఆ సంఖ్యతోనే తాజా స్టింగ్ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ 136' అని పేరు పెట్టినట్టు కోబ్రాపోస్ట్ తెలిపింది.

శూల శోధన ఎలా జరిగింది?

ఓ అండర్‌కవర్(రహస్య) రిపోర్టర్.. తాను 'శ్రీమద్ భగవత్ గీత ప్రచార్ సమితి' అనే సంస్థ ప్రతినిధిగా చెప్పుకుంటూ 17 మీడియా సంస్థల సీనియర్ ఎడిటర్లను, సేల్స్ ప్రతినిధులను కలిశారు.

హిందుత్వ భావజాల రాజకీయాలకు అనుకూలంగా మూడు నెలలపాటు నిర్విరామంగా వార్తా కథనాలు ప్రసారం చేయాలని, అందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని మీడియా సంస్థలను ఆ రిపోర్టర్ కోరారు.

ఆ అండర్‌కవర్ రిపోర్టర్ నుంచి డబ్బులు తీసుకుని, హిందుత్వ రాజకీయాలకు అనుకూలంగా కథనాలు ప్రచురించేందుకు 17 మీడియా సంస్థలు నోటిమాట ద్వారా అంగీకరించినట్టు సోమవారం కోబ్రాపోస్ట్ విడుదల చేసిన వీడియో క్లిప్పింగుల్లో కనిపిస్తోంది.

రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా...

అంతేకాదు, 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొందరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాసేందుకు కూడా ఆ సంస్థలు అంగీకరించాయి.

రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు, బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, మనోజ్ సిన్హా, జయంత్ సిన్హా, వరుణ్ గాంధీ, మనేకా గాంధీలకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాసేందుకు ఆ మీడియా సంస్థలు ఓకే చెప్పినట్టు కోబ్రాపోస్ట్ వివరించింది.

మొత్తం ఏడు వార్తా చానెళ్లు, 6 వార్తా పత్రికలు, 3 వెబ్‌ పోర్టళ్లు, 1 వార్తా ఏజెన్సీల మీద కోబ్రాపోస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

హిందూ నాయకుల మతతత్వ ప్రసంగాలు, ఉపన్యాసాలను ప్రసారం చేయడం, కథనాలు ప్రచురించడంతో పాటు, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు ఇచ్చేందుకు కూడా ఆ మీడియా సంస్థలు ఒప్పుకున్నట్టు కోబ్రాపోస్ట్ వెల్లడించింది.

మా సంస్థ ఒప్పుకోలేదు

ఈ స్టింగ్ ఆపరేషన్‌లో ఆరోపలు ఎదుర్కొంటున్న ఇండియా టీవీ సేల్స్ ప్రతినిధి సుదిప్టో చౌదరీని బీబీసీ ఈమెయిల్ ద్వారా సంప్రదించింది. అందుకు ఆయన స్పందిస్తూ.. 'ఆపరేషన్ 136'లో ఆ రిపోర్టర్ నుంచి వచ్చిన 'ప్రతిపాదన'లకు తమ సంస్థ అంగీకరించలేదని, ఏ ఒక్క కథనాన్ని కూడా ప్రసారం చేయలేదని వివరించారు.

కోబ్రా పోస్ట్ విడుదల చేసిన ఆ వీడియో 'మార్ఫింగ్' చేసిందని ఆయన అన్నారు. "కోబ్రోపోస్టు తన స్వప్రయోజనాల కోసం ఇలా అనవసర రాద్ధాంతం చేస్తోంది. దీనిపై ఇండియా టీవీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది" అన్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దైనిక్ జాగరన్ చీఫ్ ఎడిటర్, జాగరన్ ప్రకాశన్ లిమిటెడ్ సీఈవో సంజయ్ గుప్తాలు కోబ్రాపోస్టు స్టింగ్ ఆపరేషన్‌ను తోసిపుచ్చారు.

కోబ్రాపోస్ట్ విడుదల చేసిన వీడియో ఫుటేజీకి ఉన్న విశ్వసనీయత ఏమిటని ప్రశ్నించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌‌కే విశ్వసనీయత లేదన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)