మీ డేటాతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక యాప్ 'నమో యాప్' యూజర్ల డేటాను వారి అనుమతి లేకుండా ఓ అమెరికా కంపెనీతో పంచుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. అయితే ప్రజల సమాచారం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదా?
దీనిపై బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడింది.
ఏదైనా ప్రభుత్వేతర యాప్ యూజర్ల సమాచార విశ్లేషణ కొరకు వారి వివరాలను ఒక థర్డ్ పార్టీకి పంపితే దానిలో చట్టవిరుద్ధమైనదేమీ లేదు.
దాదాపు అన్ని యాప్స్ యూజర్ల ప్రొఫైలింగ్ కోసం ఈ పని చేస్తాయి. దాని వల్ల యూజర్ల ఇష్టాయిష్టాలు తెలిసి.. కంటెంట్, ప్రకటనలు, ప్రాడక్ట్ ఫీచర్లను రూపొందించడం సులభమవుతుంది.
అయితే ప్రజల అనుమతి తీసుకోకుండానే వారి సమాచారాన్ని బయటి కంపెనీలతో పంచుకోవడం జరుగుతోందని ప్రధాని మోదీకి చెందిన 'నమో యాప్'పై ఇప్పుడు అభ్యంతరాలు వెలువడుతున్నాయి.
ఇది నిజమే అయితే ఈ డేటాతో బీజేపీ ఏం చేయాలనుకుంటుందో తెలీదు.
కానీ ఏ పార్టీ అయినా సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారాన్ని ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఉపయోగించుకోగలదా?
డిజిటల్ న్యూస్ పోర్టల్ 'మీడియా నామా'కు చెందిన నిఖిల్ పాహ్వా అది జరగవచ్చని అన్నారు.
''2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొంత మంది ఆఫ్రో-అమెరికన్ ప్రజలను ఒక నకిలీ సైట్‌కు డైవర్ట్ చేశారని, ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా, ఆ సైట్ ద్వారానే ఓటు వేయవచ్చని వాళ్లను పక్కదారి పట్టించారని వార్తలు వినవచ్చాయి. అలా ఆ నకిలీ వెబ్సైట్ ద్వారా వాళ్ల ఓట్లన్నీ చెల్లకుండా పోయాయి'' అని పాహ్వా తెలిపారు.
''బీజేపీ ఈ నమో యాప్ సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఇప్పటివరకు ఎలాంటి రుజువులూ లేవు. కానీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఘటన జరిగిన తర్వాత డేటా భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి'' అని పాహ్వా అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్ ద్వారా లక్షల మంది ప్రజల సమాచారాన్ని సంగ్రహించి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.
ఈ పని కోసం కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్లో ఒక క్విజ్‌ను ప్రారంభించింది. లక్షలాది మంది ఫేస్బుక్ యూజర్లు ఆ క్విజ్‌లో పాల్గొని తమకు తెలియకుండానే అనేక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
‘'ఎవరు ఇంట్రావర్ట్? ఎవరు ఎక్స్ట్రావర్ట్? ఎవరు దేనిని ఇష్టపడతారు? ఎవరు ఏ జాతికి చెందిన వారు? పేర్లు, ఈమెయిల్, వాళ్ల స్వస్థలాలు.. ఇవన్నీ కేంబ్రిడ్జ్ అనలటికా సేకరించింది.
దీని ద్వారా ఎవరు తమ వ్యతిరేకులు అన్నది గుర్తించి, కొన్ని ప్రత్యేక వర్గాలను లక్ష్యంగా చేసుకుని వదంతులను సృష్టించారు. ఉదాహరణకు ఎవరైనా హిల్లరీ క్లింటన్ మద్దతుదారులుంటే వాళ్లకు ఆమెపై సందేహం వచ్చేలా వార్తలను పంపారు.'' అని పాహ్వా వివరించారు.
''మీరు మీ స్టేటస్, కామెంట్, మెసేజ్ పెట్టగానే మీ గురించి సమాచారం చాలా వరకు తెలిసిపోతుంది.'' అని తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
సైబర్ లాయర్ విరాగ్ గుప్తా, ''ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీ తమ సైబర్ ఆర్మీని తయారు చేసుకుంటోంది. అయితే అవి డాటాను ఎలా సేకరిస్తున్నాయి, అందుకోసం ఎంత ఖర్చు చేస్తున్నాయి అన్న దాని గురించి ఎలాంటి వివరాలూ లేవు'' అన్నారు.
రాజకీయ పార్టీల వద్ద ఉన్న బడ్జెట్‌ను బట్టి ఎలాంటి సమాచారం అయినా లభ్యమవుతుందని 'నేతా డాటా' వ్యవస్థాపకులు హెచ్ ఆర్ వెంకటేశ్ తెలిపారు.
ఫొటో సోర్స్, OLI SCARFF
స్మార్ట్ ఫోన్
మీ డేటాను సంరక్షించుకోవడం మీ బాధ్యతేనా?
నిఖిల్ పాహ్వా, వెంకటేశ్‌లు ఇద్దరూ అది మీదే అంటారు.
''ప్రజలకు తమకు పనికి రాని యాప్‌లను కూడా డౌన్ లోడ్ చేసుకునే అలవాటుంది. దాన్ని నివారించాలి. మైక్రోఫోన్, కెమెరాకు యాక్సెస్ ఇస్తున్నామంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా తన లాప్ టాప్, కెమెరాలపై స్టిక్కర్ అతికించి పెడతారు. మీకు అవసరం లేని యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దు'' అని వెంకటేశ్ హెచ్చరించారు.
''సాధారణంగా ఒక స్మార్ట్ ఫోన్లో 17 నుంచి 20 యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది 50 పైగా యాప్‌లను ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్ చేస్తుంటారు. వాళ్ల సమాచారమంతా ఆ యాప్స్ ద్వారా వెళ్లిపోతోందని వాళ్లకు తెలీదు. ఫేస్బుక్ యూజర్లంతా థర్డ్ పార్టీలకు ఇచ్చిన పర్మిషన్లను డిలీట్ చేయాలి. కాండీ క్రష్ లాంటి గేమ్స్‌ను ఆడొద్దు. అవన్నీ థర్డ్ పార్టీ యాప్‌లు. ఫేస్బుక్లో మీ జీవితం గురించి అతి తక్కువ వివరాలు వెల్లడించండి. నేనెప్పుడూ నా కుటుంబ సభ్యుల ఫొటోలను ఫేస్బుక్లో పెట్టను. మన డేటాను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మనకు తెలీదు.'' అని వెంకటేశ్ అన్నారు.
ఫొటో సోర్స్, Carsten Koall
జీమెయిల్లో వచ్చీపోయే మెయిల్స్‌ను స్కాన్ చేస్తున్నామని గూగుల్ అంగీకరించింది.
అంటే దీని అర్థం ఎవరో గూగుల్‌లో కూర్చుని మీ ఈమెయిల్స్ పరిశీలిస్తుంటారని కాదు. కానీ ఈ సంస్థలు కీవర్డ్ సెర్చ్ ద్వారా వ్యక్తుల ఇష్టాయిష్టాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా వాళ్లకు ఇష్టమైన ప్రాడక్ట్ ఫీచర్లను తయారు చేయడానికే ఈ పని చేస్తున్నాయి. అది అర్థం చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)