#BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
యువతి
ఫొటో క్యాప్షన్,

#BBCShe

''ఇప్పుడామె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లయ్యారు. దాంతో ఆమె సంతోషంగానే ఉన్నారు. ఆమెకు జీవితంలో ఇంకా చాలా సాధించాలని ఉంది. కానీ ఆ అవకాశమే రాలేదు.''

ఇవీ నాతో తన సోదరి గురించి ఓ యువతి చాలా అయోమయంతో చెప్పిన మాటలు.

#BBCShe ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్రతీర నగరం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పలువురు యువతులతో మాట్లాడినపుడు పై మాటలే వారి నుంచి వినిపించాయి.

చాలా త్వరగా తమకు పెళ్లి చేసేస్తుండటంతో.. తాము కెరియర్‌ను వదిలిపెట్టాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక్కడి హాలు.. జెనిటిక్స్, ఫార్మకాలజీ, లా, ఎంబీయే వంటి ఉన్నత విద్యలు చదువుతున్న యువతులతో నిండిపోయింది. మరికొందరైతే మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. ఇంకొందరు పీహెచ్‌డీ చేస్తున్నారు.

బిహార్‌తో పోల్చినపుడు ఇక్కడ చాలా మార్పు కనిపించింది.

మేం గతవారం ఇదే ప్రాజెక్ట్‌లో భాగంగా బిహార్‌లో యువతులతో మాట్లాడినపుడు అక్కడి బాలికలకు ఇప్పటికీ ప్రాథమిక, మాధ్యమిక విద్య చాలా దూరంలో ఉన్నట్లు అర్థమైంది.

వీడియో క్యాప్షన్,

#BBCShe: యువతీయువకులను ఎందుకు బలవంతంగా వివాహబంధంలోకి నెడుతున్నారు?

బిహార్‌తో పోల్చితే స్త్రీలకు ఉన్నత విద్య అంశంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల మైళ్ల ముందంజలో ఉంది.

ఉన్నత విద్యకు సంబంధించి అఖిల భారత సర్వే 2015-2016 ప్రకారం ఏపీ రెండో స్థానంలో ఉంది.

గ్రాస్ ఎన్‌రోల్మెంట్ రేషియో (స్థూల నమోదు నిష్పత్తి)లో తమిళనాడు మొదటి స్థానంలో.. దాని తర్వాత ఏపీ ఉంది.

స్థూల నమోదు నిష్పత్తి అంటే.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నిష్పత్తి. 18-23 ఏళ్ల వయసు గ్రూపు విద్యార్థుల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు.

ఈ నిష్పత్తిలో మహిళల జాతీయ సగటు 23.5 శాతం కాగా బిహార్‌లో 12.6 శాతమే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడులో 42.4 శాతం ఉండగా ఏపీలో ఇది 26.9 శాతం ఉంది.

మహిళలు ఉన్నత విద్యావంతులైతే.. వారికి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళలను చూస్తే ఏపీలో అలా జరగడం లేదనిపిస్తోంది.

ఇక్కడ 22 ఏళ్ల యువతి ఈ అంశంపై మాట్లాడుతూ.. చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. ''వరుడి కోసం మా ప్రొఫైల్ పంపినపుడు అందులో ఉన్నత డిగ్రీలు ఉంటే అది చాలా బాగా ఉంటుంది. అందుకోసమే మమ్మల్ని మా తల్లిదండ్రులు యూనివర్సిటీకి పంపుతున్నారు. అంతేకాని మేం ఉద్యోగాలు చేయడానికి ఈ డిగ్రీలు సాయపడవు'' అని ఆ యువతి చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో #bbcshe టీం, విద్యార్థినులు

దీన్ని అక్కడున్న యువతులంతా అంగీకరించారు. ఆ యువతిని చప్పట్లతో అభినందించారు కూడా.

మొత్తానికి ఈ విద్యార్థులు అందరూ తమ ఇళ్లలో 'పెళ్లి ఒత్తిడి'ని ఎదుర్కొంటున్నారన్నది స్పష్టమవుతోంది.

పని చేయాలనకుంటున్న, పని చేస్తున్న మహిళల శాతాన్ని పరిశీలిస్తే ప్రపంచ సగటుతో (39శాతం) పోల్చితే భారత్‌లో (24 శాతం) చాలా తక్కువగా ఉంది.

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ విషయంలో భారత్ 2016లో 185 దేశాలకు గాను 172వ స్థానంలో నిలిచింది.

1990తో పోల్చితే భారత్‌లో పని చేయాలనకుంటున్న, పని చేస్తున్న మహిళల శాతం తగ్గింది. అప్పట్లో ఇది 28శాతం కాగా.. 2016లో 24కి తగ్గింది.

ఈ విషయంలో ఏపీ ఇతర పెద్ద రాష్ర్టాలతో పోల్చినపుడు చాలా ముందంజలో ఉంది. కానీ ఇక్కడా పని చేయాలనుకుంటున్న మహిళల శాతం తగ్గుతోంది.

ఫొటో క్యాప్షన్,

బిహార్‌కు చెందిన యువతి

2000ల్లో ఏపీలో 46 శాతం మంది మహిళలు పని చేయాలని అనుకుంటుండగా 2011కి వచ్చేసరికి ఇది 36 శాతానికి చేరింది.

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ క్షేత్ర స్థాయి అధ్యయనం ప్రకారం.. ఉద్యోగుల్లో పెళ్లయిన మహిళల శాతం తగ్గుతూ వస్తోంది. గ్రామీణ, పట్టణ.. రెండు ప్రాంతాల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది.

ఆంధ్ర విశ్వద్యాలయంలో మేం కలిసిన యువతుల్లో ఈ రెండు ప్రాంతాలకు చెందినవారున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాట్లాడుతూ.. టీనేజీలోనే అమ్మాయిలకు పెళ్లి చేస్తే కట్నం తక్కువ ఇవ్వొచ్చని, అందుకే అక్కడ అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేస్తున్నారని చెప్పారు.

అయితే నగరాల నుంచి వచ్చిన వారు మాట్లాడుతూ కట్నానికి సంబంధించిన బేరసారాల్లో ఉన్నత చదువు కీలకమని పేర్కొన్నారు.

''మీకు మంచి డిగ్రీ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. కానీ ఇక్కడ మంచి డిగ్రీ ఉంటే అది కట్నానికి సంబంధించిన బేరసారాల్లో పనికొస్తుంది..'' అని ఓ యువతి వివరించారు.

నేను చాలా దూరం.. అంటే పాట్నా నుంచి విశాఖ పట్నం వెళ్లాను. సాంస్కృతికంగా, భౌగోళికంగా చాలా మార్పులు, అభివృద్ధి చూశాను. కానీ మహిళలు ఎదుర్కొటున్న సమస్యలు అలాగే ఉన్నాయి. అవి ఇప్పటికీ కట్నం.. పెళ్లి చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)