ప్రెస్ రివ్యూ: ప్రజలారా.. రాజధాని కోసం అప్పు ఇవ్వండి: చంద్రబాబు

  • 29 మార్చి 2018
నారా చంద్రబాబునాయుడు Image copyright Nara Chandrababu Naidu/Facebook

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అప్పు ఇవ్వాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది.

డబ్బులున్న వారు బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పుగా ఇస్తే అందుకు ప్రతిగా వారికి బాండ్లు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు. బ్యాంకులు ఇస్తున్న దానికంటే అదనంగా రెండు లేదా మూడు శాతం అధికంగా వడ్డీ చెల్లిస్తామన్నారు. దీనిపై త్వరలోనే విధివిధానాలు సిద్ధం చేస్తామని చెప్పారు.

ఇటీవల జరిగిన అఖిలపక్షాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు.

"ప్రవాసాంధ్రులు, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. సమీకరణ పద్ధతిలో రైతులు భూములిచ్చిన తరహాలోనే...రాజధాని నిర్మాణానికి అప్పులివ్వాలి. ఎవరికి తోచిన విధంగా వారు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి" అని చంద్రబాబు కోరారు.

Image copyright Getty Images

కిరాయి కట్టకపోతే.. ఇల్లు ఖాళీ చేయాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌లో అద్దె నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

యజమానులు అద్దెలను అమాంతం పెంచకుండా తీసుకొచ్చిన ఈ చట్టం మార్చి 28 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత నవంబరు 22న శాసనసభలో ఏపీ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ టెనెస్సీ యాక్ట్- 2017ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈ చట్టం ప్రకారం యజమాని, కిరాయిదారు పరస్పర సహకారంతో ఒప్పందం చేసుకుంటారు. వరుసగా 2 నెలలు అద్దె చెల్లించకపోతే ఇంటిని ఖాళీ చేయించే అధికారం యజమానికి ఉంటుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

Image copyright Getty Images

చితికిపోతున్న చిన్న కాలేజీలు

కార్పొరేట్ కళాశాలతో పోటీ పడలేక వందల సంఖ్యలో చిన్నస్థాయి ప్రైవేటు కాలేజీలు మూతపడుతున్నాయంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

2014-15లో తెలంగాణలో 2,560 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుండేవి.. 2015-16 వాటి సంఖ్య 2,259కి తగ్గిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 301 కాలేజీలు మూత పడ్డాయి!

2016-17 విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 1,842కు తగ్గింది. ఏకంగా 417 కాలేజీలు మూతపడ్డాయి.

2017-18 విద్యా సంవత్సరం నాటికి 1,733కు తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితే కనిపిస్తోంది.

ఆకర్షణీయ ప్రకటనలు, ర్యాంకుల ప్రచార హోరులో సాధారణ ప్రైవేటు కాలేజీలు బడా కార్పొరేట్‌ కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. దాంతో నాలుగేళ్లలో 827 కాలేజీలు మూతపడినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు లెక్కలు చెబుతున్నాయని సాక్షి వివరించింది.

Image copyright facebook.com/TelanganaCMO

4,380 కొత్త పంచాయతీలు

తెలంగాణ రాష్ట్రంలో 4,380 కొత్త పంచాయతీలు ఏర్పాటు కానున్నాయని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో 4,380 కొత్త పంచాయతీలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

వీటిలో 1,311 షెడ్యూల్డ్ (ఏజెన్సీ ప్రాంతాల) గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయని తెలిపారు. 500 జనాభా, దానికంటే తక్కువ జనాభా ఉన్నా కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న రిజర్వేషన్లను పదేళ్లకు పెంచుతున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటుచేసిన వాటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పంచాయతీల సంఖ్య 12,741కి చేరుతుందన్నారు.

పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)